Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

భారత్ బయోటెక్ సంస్థ కరోనా వాక్సిన్ ని 15 ఆగస్టు 2020న మార్కెట్ లోకి విడుదల చేయట్లేదు

0

కేంద్ర ప్రభుత్వం భారత్ బయోటెక్ సంస్థకి కరోనా వాక్సిన్ ని 15 ఆగస్టు 2020న మార్కెట్ లోకి విడుదల చేయడానికి పర్మిషన్ ఇచ్చింది అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ICMR భారత్ బయోటెక్ కి రాసిన ఒక లేఖని వారి వాదనకి మద్దతుగా పోస్ట్ లో షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: కేంద్ర ప్రభుత్వం భారత్ బయోటెక్ సంస్థ కి కరోనా వాక్సిన్ ని 15 ఆగస్టు 2020న మార్కెట్ లోకి విడుదల చేయడానికి పర్మిషన్ ఇచ్చింది.

ఫాక్ట్ (నిజం): ICMR లేఖని జాగ్రత్తగా పరిశీలిస్తే అందులో అన్ని క్లినికల్ ట్రయల్స్ తర్వాత 15 ఆగస్టు 2020 వరకి వాక్సిన్ ని విడుదల చేసే ప్రయత్నం చేస్తాము అనే మాత్రమే ఉంది. . ఒక ఇంటర్వ్యూ లో భారత్ బయోటెక్ వ్యవస్థాపకుడు డా. కృష్ణ ఎల్లా మాట్లాడుతూ, తాము కనిపెట్టబోయే వాక్సిన్ అన్ని రక్షణ ప్రమాణాలు పాటించి, అన్ని క్లినికల్ ట్రయల్ స్టేజెస్ ని విజయవంతంగా దాటి అధికారుల నుండి అనుమతులు పొందితే 2021వ సంవత్సరం ఆరంభంలో ప్రజలకి అందుబాటులోకి వస్తుందని అన్నారు. కావున పోస్టులో చెప్తున్నది తప్పు.

పోస్టులో షేర్ చేసిన లేఖని జాగ్రత్తగా పరిశీలిస్తే అందులో వాక్సిన్ ని అన్ని క్లినికల్ ట్రయల్స్ తర్వాత 15 ఆగస్టు 2020 వరకి విడుదల చేసే ప్రయత్నం చేస్తాము, కాని తుది ఫలితం ఈ ప్రాజెక్ట్ లో పాల్గొంటున్న అన్ని క్లినికల్ ట్రయల్ సైట్స్ యొక్క సహకారం పై ఆధారపడి ఉంటుంది అని ఉంది. దీన్నిబట్టి 15 ఆగస్టు 2020 డెడ్ లైన్ గా నిర్ధారించలేదు అని చెప్పొచ్చు.

‘ICMR భారత్ బయోటెక్ వాక్సిన్’ అనే కీ వర్డ్స్ తో మేము గూగుల్ లో వెతకగా మాకు ICMR భారత్ బయోటెక్ కలిసి 15 ఆగస్టు 2020న కరోనా వాక్సిన్ విడుదల చేయబోతున్నాయి అన్న వార్తలు చాలా కనిపించాయి, ఈ వార్తలకి మద్దతుగా ICMR భారత్ బయోటెక్ కి రాసిన ఒక లేఖని కోట్ చేసారు. ఆ వార్త కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. దీన్నిబట్టి పోస్ట్ లో షేర్ చేసిన లేఖ నిజమైనదే అని చెప్పొచ్చు.

ఐతే ఎలాగైనా వాక్సిన్ అందుబాటులోకి తీసుకురావాలని ICMR తొందరపడుతుంది అన్న విమర్శలు రావడంతో ICMR ఒక ప్రెస్ నోట్ ద్వారా వివరణ ఇచ్చారు. ఒక వ్యాధి నివారించడానికి వాక్సిన్ కనిపెట్టే క్రమంలో అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారమే మనషులు, జంతువుల పై ఒకేసారి పరిక్షలు చేస్తునట్టు ICMR ఆ వివరణలో తెలిపింది. అనవసరమైన పేపర్ వర్క్, ఫైల్ కదలికలో అనవసరమైన జాప్యం వాక్సిన్ కనిపెట్టడానికి అడ్డు రాకూడదనే  తమ ఉద్దేశమని కూడా చెప్పారు.

“మా ఇంటర్నల్ కమ్యూనికేషన్ ని తప్పుగా అర్ధంచేసుకున్నారు, వాక్సిన్ ని 15 ఆగస్టు 2020 తేదీ లోగా తాయారు చేసే ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పామే తప్ప ఆ తేదీ డెడ్ లైన్ అని చెప్పలేదు, వాక్సిన్ తాయారు చేసే ప్రక్రియ వేగవంతం చెయ్యొచ్చు కానీ ఈ క్రమంలో వాక్సిన్ అన్ని క్లినికల్ ట్రయల్ స్టేజెస్ దాటాలి” అని మింట్ తో మాట్లాడుతూ ఒక ICMR అధికారి అన్నారు.

న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ వారికిచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ భారత్ బయోటెక్ వ్యవస్థాపకుడు డా. కృష్ణ ఎల్లా, తాము కనిపెట్టబోయే వాక్సిన్ అన్ని రక్షణ ప్రమాణాలు పాటించి, అన్ని క్లినికల్ ట్రయల్ స్టేజెస్ ని విజయవంతంగా దాటి అధికారుల నుండి అనుమతులు పొందితే 2021వ సంవత్సరం ఆరంభంలో ప్రజలకి అందుబాటులోకి వస్తుందని అన్నారు.

చివరగా, అనుమతులు పొందే ప్రక్రియ వేగవంతం చేయండి అని చెప్తూ ICMR రాసిన లేఖని వాక్సిన్ ని 15 ఆగస్టు 2020న మార్కెట్ లోకి విడుదల చేయడానికి అనమతి ఇచ్చిన లేఖగా ప్రచారం చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll