Fake News, Telugu
 

మహిళ హత్య కేసులో 16 మంది దోషులకు మరణశిక్ష విధించిన బంగ్లాదేశ్ న్యాయమూర్తి భారత న్యాయవ్యవస్థను హేళన చేయలేదు

0

బంగ్లాదేశ్‌ మహిళ రేప్ కేసులో 16 మంది దోషులకు మరణ శిక్ష విధించిన బంగ్లాదేశ్ న్యాయమూర్తి, “ఇది భారతదేశం అనుకుంటున్నారా ఏంటి?” అని భారత న్యాయవ్యవస్థని హేళన చేస్తూ మాట్లాడినట్టు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: అత్యాచార కేసులో 16 మంది దోషులకు మరణ శిక్ష విధించిన బంగ్లాదేశ్ న్యాయమూర్తి, భారత న్యాయవ్యవస్థని హేళన చేస్తూ మాట్లాడారు.

ఫాక్ట్ (నిజం): బంగ్లాదేశ్‌ మహిళ నుస్రత్ జహాన్ రఫీ హత్య కేసుకి సంబంధించి ఫెని ట్రిబ్యునల్ కోర్టు జడ్జి మామునూరు రషీద్, 16 మంది దోషులకి మరణ శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు బంగ్లాదేశ్ న్యాయవ్యవస్థలో ఒక మైలు రాయని బంగ్లాదేశ్ అటార్నీ జనరల్ పేర్కొన్నారు. ఈ తీర్పు అనంతరం మామునూరు రషీద్  భారత న్యాయవ్యవస్థని హేళన చేస్తూ మాట్లాడినట్టు ఎక్కడా రిపోర్ట్ అవలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.  

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం గుగూల్‌లో వెతికితే, 2019లో బంగ్లాదేశ్ మహిళ నుస్రత్ జహాన్ రఫీ హత్య కేసుకి సంబంధించి ఫెని జిల్లా ట్రిబ్యునల్ కోర్టు 16 మంది దోషులకి మరణ శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చినట్టు తెలిసింది. ఈ విషయాన్నీ రిపోర్ట్ చేస్తూ పబ్లిష్ అయిన న్యూస్ అర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. మదర్సా హెడ్ మాస్టర్ తనని లైంగికగా వేధిస్తున్నాడని నుస్రత్ జహాన్ రఫీ 2019 మార్చ్ నెలలో పోలీసులకి కంప్లైంట్ చేసింది. కేసు వాపసు తీసుకోవడానికి నిరాకరించినందుకు గాను ఆ మదర్సా హెడ్ మాస్టర్ నుస్రత్ జహాన్ రఫీని హత్య చేయించాడు. ఈ ఘటన 2019 ఏప్రిల్ నెలలో జరిగింది.

నుస్రత్ జహాన్ రఫీ హత్య పై బంగ్లాదేశ్‌లో తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో, బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ కేసు విచారణని వీలైనంత త్వరగా పూర్తిచేయాలని నిర్ణయించుకుంది. 24 అక్టోబర్ 2019 నాడు ఫెని ట్రిబ్యునల్ కోర్టు న్యాయమూర్తి మామునూరు రషీద్, ఈ కేసులోని 16 మంది దోషులకు మరణ శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు పై ఫెని ట్రిబ్యునల్ కోర్టు  ప్రాసిక్యూటర్ హఫీజ్ అహ్మద్ స్పందిస్తూ, ‘ఈ తీర్పు ద్వారా బంగ్లాదేశ్‌లో హత్యలకు పాల్పడే నేరస్థులు ఎవరూ చట్టం నుంచి తప్పించుకోలేరని స్పష్టమయ్యింది. బంగ్లాదేశ్‌ న్యాయవ్యవస్థకి ఇదో గొప్ప విజయం”, అని తెలిపారు. ఈ తీర్పు అనంతరం ఫెని ట్రిబ్యునల్ కోర్టు న్యాయమూర్తి మామునూరు రషీద్, భారత న్యాయవ్యవస్థను హేళన చేసి మాట్లాడినట్టు ఎక్కడా రిపోర్ట్ అవలేదు.

నుస్రత్ జహాన్ రఫీ హత్య కేసులో ఫెని ట్రిబ్యునల్ కోర్టు ఇచ్చిన తీర్పుని బంగ్లాదేశ్ అప్పటి అటార్నీ జనరల్ మహాబుబే అలాం ప్రశంసించారు. ఈ తీర్పు బంగ్లాదేశ్ న్యాయవ్యవస్థలో ఒక మైలురాయని మహాబుబే అలాం పేర్కొన్నారు. మహాబుబే అలాం కూడా ఈ తీర్పు అనంతరం భారత న్యాయవ్యవస్థను చూలకన చేస్తూ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

చివరగా, మహిళ హత్య కేసులో 16 మంది దోషులకు మరణ శిక్ష విధించిన బంగ్లాదేశ్‌ న్యాయమూర్తి, భారత న్యాయవ్యవస్థని హేళన చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll