Fake News, Telugu
 

ప్రజల నుండి డిపాజిట్లు వసూలు చేస్తున్నందుకు JAA LIFE STYLE కంపెనీ డైరెక్టర్ ని ఇటీవల బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసారు

0

‘కరోనాతో ఇంటి పెద్దను పోగొట్టుకున్న వారికి భరోసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో JAA LIFE STYLE కంపెనీ ద్వారా ప్రతి నెలా రూ. 10,000 అందించాబోతున్నారని’ చెప్తూ, అవసరం ఉన్నవారు సంప్రదించాల్సిన వివరాలు షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఇదే విషయం గురించి సమాచారం కోరుతూ మా వాట్సాప్ టిప్ లైన్ కి కూడా చాలా అభ్యర్థనలు వచ్చాయి. ఈ కథనం ద్వారా ఈ విషయం గురించి సమాచారం తెలుసుకుందాం.

క్లెయిమ్: కరోనా వల్ల ఇంటి పెద్ద పోగొట్టుకున్నవారికి JAA LIFE STYLE కంపెనీ ద్వారా ప్రతి నెలా రూ. 10,000 అందించబోతున్నారు.

ఫాక్ట్ (నిజం): JAA LIFE STYLE కంపెనీ ప్రజల దగ్గరి నుండి ఒక నియంత్రణ విధానం లేకుండా డిపాజిట్లు వసూలు చేస్తున్నందుకు, ఆ కంపెనీ డైరెక్టర్ అయిన కే.వీ. జానీ ని చీటింగ్ మరియు Banning of unregulated Deposit Schemes Act కింద బెంగలూరు క్రైమ్ బ్రాంచ్ కి చెందిన ఆర్థిక నేరాల విభాగం ఇటీవల అరెస్ట్ చేసింది. ఇప్పటికే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి మల్టీ లెవెల్ మార్కెటింగ్ ని నిషేదిస్తూ చట్టాలు చేసింది. QNet, Ebiz మల్టీ లెవెల్ మార్కెటింగ్ ప్రోత్సహించే వారిని అరెస్ట్ కూడా చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ విషయం గురించి సమాచారం కోసం పోస్టులో పేర్కొన్న నెంబర్ కి  FACTLY కాల్ చేసి మాట్లాడగా వారు ఇలా అన్నారు ‘కరోనా వల్ల ఇంటి పెద్దను కోల్పోయిన వారికి లేదా ఇబ్బంది పడుతున్న వారు రూ.1,109 కట్టి JAA LIFE STYLE అనే కంపెనీలో రిజిస్టర్ అవ్వడం ద్వారా ఒక పార్ట్ టైం జాబ్ లాంటిది పొందొచ్చు, ఇది బేసిక్ గా అడ్వేర్టైసింగ్ జాబ్, కంపెనీ ఎకౌంటు లోకి లాగిన్ అయ్యి అడ్వేర్టైస్మెంట్ వీడియోస్ ని చూడాలని, ఇందుకు గాను రూ. 7,000 చేలిస్తారు. ఈ జాబ్ చేసిన వారికి భరోసా ఫౌండేషన్ తరపు నుండి నెల నెలా రూ. 3000 అందిస్తాము. ఐతే JAA LIFE STYLE లో ఈ జాబ్ ఎవరైనా పొందోచ్చు, కాకపోతే కరోనా వల్ల ఇబ్బంది పడుతున్నవారికి భరోసా ఫౌండేషన్ వారే రూ.1,109 కట్టి రిజిస్ట్రేషన్ చేపిస్తుంది’.  ఐతే ప్రస్తుతం తాము అనుకున్న టార్గెట్ రీచ్ కావడంతో ఈ స్కీం క్లోజ్ చేసామని మళ్ళి తిరిగి ఆగస్టులో ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్పారు.

JAA LIFE STYLE:

ఇటీవల బెంగలూరు క్రైమ్ బ్రాంచ్ కి చెందిన ఆర్థిక నేరాల విభాగం JAA LIFE STYLE కంపెనీ డైరెక్టర్ అయిన కే.వీ. జానీ ని చీటింగ్ మరియు Banning of unregulated Deposit Schemes Act కింద ప్రజల నుండి నియంత్రణ లేకుండా డిపాజిట్లు వసూలు చేస్తున్నందుకు అరెస్ట్ చేసి FIR కూడా రిజిస్టర్ చేసింది.

ఈ అరెస్ట్ కి సంబంధించి పోలీసులు మరియు వార్తా కథనాలు చెప్తున్న దాని ప్రకారం JAA LIFE STYLE కంపెనీ ప్రజలను ముందుగా రూ.1,109 కట్టి రిజిస్ట్రేషన్ చేసుకొనేలా ప్రోత్సహించి, వారు అడ్వేర్టైస్మెంట్ వీడియోలు చూసి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా ఒక్కో అడ్వేర్టైస్మెంట్ కి రూ. 4 చొప్పున అందిస్తున్నారు. ఇలా కొన్ని రోజులు డబ్బులు చెల్లించిన తర్వాత ఈ కంపెనీ వారు ప్రజలని ప్రీమియర్ మెంబర్షిప్ పొందాలని మరియు ఇతరులను ఈ స్కీం లో జాయిన్ చేయడం ద్వారా కమిషన్ పొందొచ్చని ఒత్తిడి చేస్తుంటారు. ఒక చైన్ సిస్టం లాగా దీనిని ఆపరేట్ చేస్తారు. ఈ స్కీం ద్వారా ఇప్పటికే ఈ కంపెనీ ప్రజల నుండి రూ. 3.5 కోట్లు వసూలు చేసారని వార్త పత్రికలు పేర్కొన్నాయి.  ఈ వార్తని ప్రచురించిన కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

సాదారణంగా మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీంల ద్వారా ఇలానే ఒకరి నుండి మరికొందరిని, వీరి నుండి ఇంకొందరి స్కీంలో చేర్పించి వారి నుండి రిజిస్ట్రేషన్ రూపంలో డబ్బు వసూలు చేస్తుంటారు. ఐతే  ఇలాంటి ఒక పిరమిడ్ లేదా చైన్ స్కీంల ద్వారా ప్రజల నుండి ఒక నియంత్రణ లేకుండా డిపాజిట్లు వసూలు చేసే స్కీం లను ప్రభుత్వం నిషేదిస్తు Prize Chits and Money Circulation Schemes (Banning) Act , Banning of unregulated Deposit Schemes Act వంటి చట్టాలు చేసింది. ఇంతకు ముందు ఇలాంటి ఇలాంటి మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీంల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసారు. తెలంగాణలో కూడా QNet, Ebiz మొదలైన మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీంలను ప్రోత్సహిస్తున్న వారిని అరెస్ట్ చేసారు.

చివరగా, ప్రజల నుండి డిపాజిట్లు వసూలు చేస్తున్నందుకు JAA LIFE STYLE కంపెనీ డైరెక్టర్ ని ఇటీవల బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసారు.

Share.

About Author

Comments are closed.

scroll