Fake News, Telugu
 

ట్విట్టర్ లో హిందువులకి వ్యతిరేకమైన ట్వీట్ లు పెట్టింది ‘అల్ జజీరా’ వార్తా సంస్థ కరెస్పాండంట్ కాదు

0

రోడ్ల మీద ఉన్న ముస్లింలారా… హిందువులని నరికేయండి… అప్పుడే వాళ్ళకి గుణపాఠం చెప్పినట్లు అవుతుంది, ఇస్లాం ని అవమానించిన వాళ్ళని ఊచకోత కొయ్యండి…” అని ‘Dilawar Shaik’ అనే ఒక ‘అల్ జజీరా’ కరెస్పాండంట్ వ్యాఖ్యలు చేసినట్లుగా ఉన్న ట్వీట్ల స్క్రీన్ షాట్లను ఫేస్బుక్ లో చాలా మంది పోస్టు చేస్తున్నారు. దాంట్లో ఎంతవరకు నిజముందో పరిశీలిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ట్విట్టర్ లో హిందువులకి వ్యతిరేకమైన ట్వీట్ లు పెట్టిన ‘అల్ జజీరా’ వార్తా సంస్థ కరెస్పాండంట్ ‘Dilawar Shaik’.

ఫాక్ట్ (నిజం): ట్విట్టర్ లో హిందువులకి వ్యతిరేకమైన ట్వీట్ లు పెట్టింది ‘అల్ జజీరా’ వార్తా సంస్థ కరెస్పాండంట్ కాదని ఆ సంస్థ తెలిపింది. ‘ది వైర్’ సంస్థ కూడా ‘Dilawar Shaik’ పేరుతో తమ సంస్థ లో ఇంతకు క్రితం ఎవరు పని చేయలేదని స్పష్టం చేసింది. ఇది ఒక ఫేక్ ట్విట్టర్ అకౌంట్. ‘@dilawarshaikh_’ అకౌంట్ గతం లో ముస్లిం వ్యతిరేఖ మరియు హిందూ అనుకూల ట్వీట్లు మరియు రీట్వీట్లు చేసింది. కావున, పోస్టులో చెప్పింది తప్పు. 

స్క్రీన్ షాట్ లో ఉన్న ట్వీట్లను ‘Dilawar Shaik’ అనే వ్యక్తి చేసినట్లుగా ఉంది. అతని ప్రొఫైల్ లో తాను ‘అల్ జజీరా’ వార్తా సంస్థ కరెస్పాండంట్ అని, మరియు అంతకుముందు ‘ది వైర్’ సంస్థ కి పని చేసినట్లుగా రాసి ఉంది. ట్విట్టర్ హ్యాండిల్ ‘@dilawarshaikh_’ కోసం వెతికినప్పుడు, ఆ అకౌంట్ డిఆక్టివేట్ అయినట్లుగా తెలిసింది.

‘Dilawar Shaik’ పేరుతో ‘అల్ జజీరా’ మరియు ‘ది వైర్’ వెబ్సైటుల్లో ఏవయినా ఆర్టికల్స్ ప్రచురింపబడ్డాయా అని వెతికితే, ఆ పేరుతో ప్రచురింపబడ్డ ఒక్క ఆర్టికల్ కూడా దొరకలేదు.

‘అల్ జజీరా’ వార్తా సంస్థ తమ ఒక ట్వీట్ లో పొందుపరచిన ప్రకటనలో ‘@dilawarshaikh_’ అనేది ఒక నకిలీ ట్విట్టర్ ఖాతా అని, దానికి అల్ జజీరాతో ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. అంతేకాదు, ‘Dilawar Shaik’ పేరుతో తమ సంస్థ లో ఏ జర్నలిస్టు లేడని కూడా తెలిపింది.

‘ది వైర్’ సంస్థ వ్యవస్థాపక ఎడిటర్ కూడా ఒక ట్వీట్ లో ‘Dilawar Shaik’ పేరుతో ఉన్న వ్యక్తి ఎవరూ కూడా గతంలో తమ సంస్థ లో పని చేయలేదని తెలిపారు.

ఆ ట్విట్టర్ అకౌంట్ కి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతికినప్పుడు, BOOM వారి ద్వారా, ఆ అకౌంట్ యొక్క ఆర్కైవ్ వెర్షన్ లభించింది. దానిని ఫిబ్రవరి 26న ఆర్కైవ్ చేసారు. ఆర్కైవ్ చేసే సమయానికి ఆ అకౌంట్ యొక్క ప్రొఫైల్ లో ఆ వ్యక్తి ఆ ఖాతాని సెప్టెంబర్ 2013 లో తెరిచినట్లుగా మాత్రమే ఉంది, మరే ఇతర సమాచారం అందులో లేదు. కావున, ప్రొఫైల్ లో తాను ‘అల్ జజీరా’ జర్నలిస్ట్ అని, ‘ది వైర్’ సంస్థ పూర్వపు జర్నలిస్ట్ అని, మరియు రానా అయ్యుబ్ స్ఫూర్తి అని ఫిబ్రవరి 26 తరవాత నుండి ఆ అకౌంట్ డిఆక్టివేట్ అయ్యే తేది మధ్యలో చేర్చి ఉంటాడు.

అంతేకాదు, ఆ అకౌంట్ యొక్క ట్వీట్ హిస్టరీ చూసినప్పుడు, ఆ అకౌంట్ డిఆక్టివేట్ కాకముందు చాలా సార్లు ముస్లిం వ్యతిరేఖ మరియు హిందూ అనుకూల ట్వీట్ లు, రీట్వీట్ లు చేసినట్లుగా తెలుస్తుంది. వాటిని కింద చూడవచ్చు.

ఇవ్వన్నీ గమనిస్తే ‘@dilawarshaikh_’ అని పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్ ఫేక్ అని, కావాలనే ‘అల్ జజీరా’ మరియు ‘ది వైర్’ సంస్థలతో సంబంధం ఉన్నట్టు ప్రొఫైల్ లో పెట్టుకొని మత ఘర్షణలు రెచ్చగొట్టేలా ట్వీట్ చేసినట్టు అర్థం అవుతుంది.

చివరగా, ట్విట్టర్ లో హిందువులకి వ్యతిరేకమైన ట్వీట్ లు పెట్టింది ‘అల్ జజీర’ వార్తా సంస్థ కరెస్పాండంట్ కాదు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll