తనకు ఓటేస్తే చంద్రుడిపై మూడు ఎకరాలు ఇప్పిస్తా అని తెలంగాణ బీజేపీ ఎంపీ బండి సంజయ్ అంటునట్టు ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనంలో ఆ వీడియోకు సంబంధించిన నిజమేంటో తెలుసుకుందాం.
క్లెయిమ్: తనకు ఓటేస్తే చంద్రుడిపై మూడు ఎకరాలు ఇప్పిస్తా – తెలంగాణ బీజేపీ ఎంపీ బండి సంజయ్
ఫాక్ట్(నిజం): బండి సంజయ్ కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యంగంగా ఈ వ్యాఖ్యలు చేసాడు. రాబోయే ఎన్నికలకు సంబంధించి కేసీఆర్ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో చంద్రుడిపైన కూడా మూడు ఎకరాలు ఇస్తానని కూడా కేసీఆర్ వాగ్ధానం చేస్తాడని బండి సంజయ్ వ్యాఖ్యానించాడు. బండి సంజయ్ మీడియాతో మాట్లాడిన వీడియోను డిజిటల్‌గా మార్ఫ్ చేసి షేర్ చేస్తున్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో చెప్తున్నట్టు బండి సంజయ్ చంద్రుడిపై మూడు ఎకరాల గురించి నిజంగానే ప్రస్తావించిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి చేసినవి.
ఈ వీడియోకు సంబంధించి వివరాల కోసం యూట్యూబ్‌లో వెతకగా, బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఫుటేజ్‌లు మాకు కనిపించాయి. ఈ వీడియోల ప్రకారం ఇటీవల రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీ రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో మీడియా ఈ విషయానికి సంబంధించి బండి సంజయ్‌ను అభిప్రాయం అడిగిన సందర్భంలో కేసీఆర్‌ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేసాడు.
ఎన్నికల నేపథ్యంలో రాబోయే రోజుల్లో చంద్రుడిపైన కూడా మూడు ఎకరాలు ఇస్తానని కేసీఆర్ వాగ్ధానం చేస్తాడని బండి సంజయ్ కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యంగంగా ఈ వ్యాఖ్యలు చేసాడు.
కేసీఆర్‌ను ఉద్దేశించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలును వార్తా సంస్థలు కూడా రిపోర్ట్ చేసాయి, ఈ కథనాలు ఇక్కడ చూడొచ్చు. బండి సంజయ్ వేరే సమయంలో కూడా కేసీఆర్‌ను ఉద్దేశించి ఇవే వ్యాఖ్యలు చేసాడు, దీనికి సంబంధించిన వీడియో ఇక్కడ చూడొచ్చు.
దీన్నిబట్టి కేసీఆర్‌ను ఉద్దేశించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలును డిజిటల్‌గా మార్ఫ్ చేసి తనకు ఎన్నికల్లో ఓటేస్తే చంద్రుడిపై మూడు ఎకరాలు ఇస్తానని బండి సంజయ్ వాగ్ధానం చేసినట్టు సృష్టించారని స్పష్టమవుతుంది.
చివరగా, బండి సంజయ్ కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి షేర్ చేస్తున్నారు.