Fake News, Telugu
 

సంబంధంలేని పాత ఫోటో పట్టుకొని ఇటీవల ఆవు పేడ తిన్న డాక్టర్ హాస్పిటల్ పాలైనట్లు షేర్ చేస్తున్నారు

0

ఆవు పేడ తిని హాస్పిటల్ పాలైన ఒక డాక్టర్ ఫోటో అని ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఇటీవల, హర్యానాలోని కర్నాల్ కు చెందిన డాక్టర్ మనోజ్ మిట్టల్ అనబడే వ్యక్తి ఆవు పేడ తింటున్న వీడియో బాగా వైరల్ అయ్యింది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఆవు పేడ తిని హాస్పిటల్ పాలైన డాక్టర్ యొక్క ఫోటో.

ఫాక్ట్: ఆసుపత్రి మంచంపై ఉన్న వ్యక్తి పేరు బిధాన్ థాపా, చాలా క్లిష్టమైన ఆరోగ్య పరిస్థితి కారణంగా అమెరికాలో 2017లో కన్నుమూశారు. ఆవు పేడ తిన్న డాక్టర్ మనోజ్ మిట్టల్ ను వైరల్ పోస్ట్ గురించి అడిగినప్పుడు, అతను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని, ఆసుపత్రిలో చేర్చలేదని చెప్పాడు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.        

ఆసుపత్రి బెడ్ మీద ఉన్న వ్యక్తి యొక్క ఇమేజ్ పై రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే ఫోటోతో ఉన్న గో‌ఫండ్‌మీ పేజీ దొరికింది. ఈ పోస్టుని 10 జూలై 2017న పబ్లిష్ చేసారు. దాని వివరణ ప్రకారం, మంచంపై ఉన్న వ్యక్తి పేరు బిధాన్ థాపా, అతను “చాలా క్లిష్టమైన” ఆరోగ్య పరిస్థితి కారణంగా అమెరికాలోని జాన్ హాప్కిన్స్ ఆసుపత్రిలో మరణించాడు. చనిపోయిన వ్యక్తి మృతదేహం తమ సొంత దేశమైన నేపాల్ కు బదిలీ చేయడానికి అయన భార్య నిధులు సేకరిస్తున్నట్టు తెలిపారు.

ఇటీవల, ఒక వైరల్ వీడియోలో, హర్యానాలోని కర్నాల్ కు చెందిన డాక్టర్ మనోజ్ మిట్టల్ అనబడే వ్యక్తి ఆవు పేడ తినడం చూపించారు. అయితే, ఒక వీడియో రిపోర్ట్ ప్రకారం, డాక్టర్ మనోజ్ మిట్టల్ ఆసుపత్రి మంచంపై లేడు అని తేలింది. వైరల్ పోస్ట్ గురించి డాక్టర్ మనోజ్ మిట్టల్ ను అడిగినప్పుడు, అతను ఆరోగ్యంగా ఉన్నానని మరియు ఆసుపత్రిలో చేరలేదని స్పష్టం చేసాడు.

ఆసుపత్రి మంచంపై ఉన్న వ్యక్తి యొక్క ఫోటోను గతంలో ఇథియోపియన్ ప్రధాని అబీ అహ్మద్ అనే వాదనతో సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు, AFP ఫిబ్రవరి 2020లోనే ఒక ఫాక్ట్-చెక్ ఆర్టికల్‌ రాసింది.

చివరగా, సంబంధంలేని పాత ఫోటో పట్టుకొని ఇటీవల ఆవు పేడ తిని హాస్పిటల్ పాలైన డాక్టర్ యొక్క ఫోటో అంటున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll