Fake News, Telugu
 

నాటకంలోని ముస్లిం పాత్రదారుడిపై జరిగిన దాడిని తప్పుడు మతపరమైన కోణంలో షేర్ చేస్తున్నారు

0

హిందువులందరినీ ముస్లింలుగా మారుస్తానని వేదికపై ఒక ముస్లిం వ్యక్తి మాట్లాడుతుండగా, వెనక నుంచి వచ్చిన మరో వ్యక్తి అతనిపై దాడి చేశాడంటూ ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

ఆర్కైవ్ పోస్టుని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: హిందువులందరినీ ముస్లింలుగా మారుస్తానని ఒక ముస్లిం వ్యక్తి చెప్పగానే అతనిపై మరో వ్యక్తి దాడి చేసిన దృశ్యాలు.

ఫాక్ట్: మీడియా కథనాల ప్రకారం, ఈ ఘటన 10 సెప్టెంబర్ 2024లో ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలో జరిగింది. ఒక నాటక సన్నివేశంలో భాగంగా హిందువులందరినీ ముస్లింలుగా మారుస్తానని ముస్లిం పాత్రదారుడు డైలాగ్ చెప్తున్న సందర్భంలో ఒక ప్రేక్షకుడు అతనిపై దాడి చేశాడు. నాటకంలో ముస్లింగా నటించిన నవ కుమార్ ఘోష్ స్పందిస్తూ ప్రేక్షకులు ఈ విధంగా స్పందించడం అనేది ఒక నటుడిగా తనకి గొప్ప పురస్కారంతో సమానమని పేర్కొన్నారు. కావున పోస్టులో చేయబడిన క్లెయిమ్ తప్పు.

ముందుగా వైరల్ వీడియోలోని దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ ఘటనకు సంబంధించిన కొన్ని ఒడియా మీడియా కథనాలు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) లభించాయి. వీటి ప్రకారం, ఈ ఘటన 10 సెప్టెంబర్ 2024లో ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలో ఒక నాటకం జరుగుతున్న సమయంలో జరిగింది.

నాటకంలోని ఒక సన్నివేశంలో ముస్లిం పాత్రదారుడు మరో పాత్రదారుడిని ముస్లిం మతంలోకి మార్చేందుకు ప్రయత్నిస్తూ, “హిందువులందరినీ ముస్లింలుగా మార్చేస్తాను.” అనే డైలాగ్ చెప్తున్న సమయంలో ప్రేక్షకులలో నుంచి ఒక వ్యక్తి స్టేజిపైకి వచ్చి అతనిపై దాడి చేశాడు. నిర్వాహకులు వెంటనే ఆ వ్యక్తిని అడ్డుకుని కిందకి పంపేశారు. దీనికి సంబంధించిన పూర్తి వీడియోని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

ఈ ఘటనపై మరింత పరిశోధించగా, ఈ నాటకంలో ముస్లిం పాత్ర వేసిన వ్యక్తి పేరు నవ కుమార్ ఘోష్ (కిషోర్ ఘోష్) అని తెలిసింది. స్థానిక మీడియాతో మాట్లాడుతూ ప్రేక్షకులు తనకి దేవుడితో సమానమని, వారి నుంచి ఇటువంటి స్పందన రావడం అనేది ఒక నటుడిగా తనకి ఒక గొప్ప పురస్కారమని ఘోష్ పేర్కొన్నారు.

చివరిగా, ఒక నాటకంలోని ముస్లిం పాత్రదారుడిపై జరిగిన దాడిని తప్పుడు మతపరమైన కోణంలో షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll