భారత దేశాన్ని ‘హిందూ రాష్ట్రం’ గా మార్చాలని చెబుతున్న ఒక సాధువు వీడియోని ఫేస్ బుక్ లో పెట్టి ఇటీవల పాల్గర్ దాడిలో చనిపోయిన సాధువుల్లో ఒకరు అని ప్రచారం చేస్తున్నారు. ఆ క్లెయిమ్ లో ఎంతవరకు నిజం ఉందో విశ్లేషిద్దాం.
క్లెయిమ్: భారత దేశాన్ని ‘హిందూ రాష్ట్రం’ గా మార్చాలని వీడియోలో చెబుతున్న సాధువు ఇటీవల పాల్గర్ దాడిలో చంపబడిన సాధువుల్లో ఒకరు.
ఫాక్ట్ (నిజం): ఆ వీడియోలో ఉన్న అతను ‘శ్రీ వ్రతాధర్ రామానుజ జీయర్ స్వామి త్రిదండిజీ’, ఆయన ‘అఖిల భారత హిందూ మహా సభ’ ప్రెసిడెంట్. ఆయన ‘FACTLY’ తో మాట్లాడుతూ ఆ వీడియోలో ఉన్నది తనే అని ధృవీకరించారు. పాల్గర్ లో జరిగిన దాడి లో చనిపోయిన ఇద్దరి సాధువుల పేర్లు – మహంత్ కల్పవృక్ష గిరి (వయసు -70ఏళ్ళు, సుశీల్‌గిరి మహారాజ్ (వయసు – 30 ఏళ్లు). కావున, పోస్ట్ లోని క్లెయిమ్ తప్పు.
ఆ వీడియో స్క్రీన్ షాట్స్ ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ టెక్నిక్ ద్వారా వెతికితే, ఎక్కువ నిడివితో ఉన్న అదే వీడియో (ఆర్కైవ్డ్), ఫేస్ బుక్ లో కనిపించింది. ఆ పొడిగించిన వీడియోలో, 1 నిమి 35 సెకన్ల దగ్గర, వీడియోలో ఉన్న సాధువును ‘జీయర్ స్వామీజీ మహారాజ్’ అని అన్నట్లు వినవచ్చు. ఆ కీలకపదాలతో ఇంటర్నెట్‌లో వెతికితే, ఆ వీడియోలోని వ్యక్తి ‘శ్రీ వ్రతాధర్ రామానుజ్ జీయర్ స్వామి త్రిదండిజీ’ అని తెలిసింది. ఆయన ‘అఖిల భారత్ హిందూ మహాసభ’ ప్రెసిడెంట్.
‘FACTLY’ ఆయన్ని సంప్రదించినప్పుడు, ఆ వీడియోలో మాట్లాడింది తనే అని స్పష్టం చేసారు. అంతేకాక, వ్రతాధర్ జీయర్ యొక్క వీడియో, ఫోటోలు ఆయన పేరు తో ఉన్న ఫేస్ బుక్ ప్రొఫైల్ లో చూస్తే, ఆయన ముఖ పోలికలు, తిలకం మరియు స్వరం వీడియోలో ఉన్న అతనితో సరిపోలినట్టు గమనించవచ్చు. కాబట్టి, వీడియోలో మాట్లాడుతున్న వ్యక్తి పాల్గర్ లో చంపబడిన సాధువు కాదు. పాల్గర్ దాడి లో చనిపోయిన ఇద్దరి సాధువుల పేర్లు: మహంత్ కల్పవృక్ష గిరి (వయసు -70ఏళ్ళు, సుశీల్‌గిరి మహారాజ్ (వయసు – 30 ఏళ్లు). వేర్వేరు మీడియా లో కనిపిస్తున్న ఆ ఇద్దరి సాధువుల ఫోటోలను గమనిస్తే అందులో ఉన్నది పోస్టులోని వీడియోలో సాధువు కాదని తెలుస్తుంది.
చివరగా, పోస్టులోని వీడియో లో ‘హిందూ రాష్ట్రం’ గురించి మాట్లాడుతున్న సాధువు పాల్గర్ దాడిలో చనిపోయిన సాధువు ఒకరు కాదు.
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?