2008 ముంబై ఉగ్ర దాడులు జరిగిన కొన్ని నెలల తర్వాత, పాకిస్తాన్ కంపెనీలు టాటా సుమో వాహనాలని ఆర్డర్ చేస్తే, పాకిస్థాన్ గడ్డకు ఒక్క వాహనం కూడా రతన్ టాటా పంపించలేదు అని చెప్తున్న పోస్ట్ (ఇక్కడ మరియు ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముందుగా ఆ కంపెనీ వాళ్ళు రతన్ టాటాను కలవడానికి ప్రయత్నిస్తే ఆయన స్పందించకపోయే సరికి, వాళ్ళు అప్పటి కాంగ్రెస్ మంత్రి ఆనంద్ శర్మని కలిసారని, ఆనంద్ శర్మ రతన్ టాటాకి కాల్ చేసి పాకిస్థాన్ కంపెనీ వాళ్లతో మాట్లాడండి అని అడిగితే “మీకు సిగ్గులేదా..నాకు ఉంది” అని చెప్పి కాల్ కట్ చేశాడు అని కూడా ఈ పోస్టులో చెప్తున్నారు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
క్లెయిమ్: 2008 ముంబై తీవ్రవాద దాడి జరిగిన తర్వాత పాకిస్థాన్ కంపెనీలు టాటా సుమోలని ఆర్డర్ చేస్తే, రతన్ టాటా ఒక్క వాహనాన్ని కూడా పాకిస్థాన్‌కి ఎగుమతి చెయ్యలేదు.
ఫ్యాక్ట్(నిజం): ఇది నిజం కాదు, ఇది ఎన్నో ఏళ్లుగా ఇంటర్నెట్లో చలామణిలో ఉన్న ఒక పుకారు. ఈ విషయాన్ని, స్వయానా ‘టాటా మోటార్స్’ వాళ్లు తమ అధికారిక ‘X’ హ్యాండిల్ ద్వారా చెప్పారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికితే, ఈ విషయాన్ని గురించి ‘X’ లో ఒక యూజర్ అడిగిన ప్రశ్నకు ‘టాటా మోటార్స్’ వాళ్ళు బదులిస్తూ, ఇదంతా ఒక పుకారు అని చెప్పారు.
26 అక్టోబర్ 2019న చేసిన ఈ ట్వీట్‌లో టాటా మోటర్స్ పాకిస్థాన్‌కి వాహనాలని ఎగుమతి చేయకపోవడానికి అసలు కారణం, ఆ దేశ ప్రభుత్వ పాలసీ అని చెప్పారు. ఈ పాలసీ ప్రకారం, వాహనాలు అనేవి, భారత దేశం నుంచి పాకిస్థాన్ దిగుమతి చేసుకునే వస్తువుల యొక్క నెగిటివ్ లిస్ట్ జాబితాలో ఉండడమే దీనికి కారణం అని చెప్పారు. ఇదే విషయాన్ని గురించి ‘టాటా మోటార్స్’ వారు ‘X’ ముఖంగా 2013లో కూడా వివరణ ఇచ్చారు.
పాకిస్తాన్ దేశ రూల్స్ ప్రకారం ఆటోమొబైల్స్/ వాహనాలు, మన దేశం నుంచి వాళ్లు దిగుమతి చేసుకునే వస్తువల జాబితాలో ‘restricted లిస్ట్’లో ఉంది అని, ఆ కారణంగా అసలు పాకిస్తాన్ ‘టాటా మోటార్స్’ నుంచి టాటా సుమోలని ఆర్డర్ చేసింది అనే ప్రశ్నే తలెత్తదు అని చెప్పారు.
ఇక 26/11 దాడుల తర్వాత రతన్ టాటా పాకిస్థాన్ కంపెనీ వాళ్లతో మాట్లాడడానికి నిరాకరించారు అని చేస్తున్న క్లెయిమ్ గురించి ఇంటర్నెట్లో వెతుకగా. దీనికి రుజువుగా మాకు ఎలాంటి ఆధారాలు లభించలేదు.
పాకిస్థాన్‌కి చెందిన ‘మినిస్ట్రీ ఆఫ్ కామర్స్’ వెబ్సైటులో ఉన్న 2022 నాటి ‘ఇంపోర్ట్ పాలసీ ఆర్డర్’ ప్రకారం, భారత్ మరియు ఇజ్రాయెల్ దేశానికి చెందిన వస్తువులను ఆ దేశానికి దిగుమతి చేసుకోవడం బ్యాన్ చేయబడింది (ఇక్కడ మరియు ఇక్కడ). కేవలం ‘థెరప్యూటిక్ డ్రగ్స్’ మాత్రమే వాళ్ళు దిగుమతి చేసుకోగలరు.
చివరిగా, 2008 ముంబై పేలుళ్ల తర్వాత పాకిస్థాన్ నుండి టాటా సుమోల ఆర్డర్ వచ్చినా రతన్ టాటా ఒక్క వాహనం కూడా ఇచ్చేది లేదని చెప్పారని ఒక పాత పుకారుని మళ్ళీ షేర్ చేస్తున్నారు.