Fake News, Telugu
 

పాలస్తీనా పౌరులు ఇజ్రాయెల్ దాడుల నుండి తప్పించుకోవడానికి భారత జెండాను ఉపయోగిస్తున్నారని పేర్కొంటూ 2023 అర్బయిన్ వాక్ వీడియోను షేర్ చేస్తున్నారు

0

07 అక్టోబరు 2023న హమాస్ మెరుపుదాడులతో పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య తాజా ఘర్షణ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇజ్రాయెల్ గాజాపై బాంబుల వర్షం కురిపిస్తోంది (ఇక్కడ, ఇక్కడ).  ఈ నేపథ్యంలో,“పాలస్తీనా పౌరులు ఇజ్రాయెల్ దాడుల నుండి తప్పించుకోవడానికి భారత జెండాను ఉపయోగిస్తున్నారు” అని చెప్తూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పాలస్తీనా పౌరులు ఇజ్రాయెల్ దాడుల నుండి తప్పించుకోవడానికి భారత జెండాను ఉపయోగిస్తున్నారు.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో సెప్టెంబర్ 2023లో ఇరాక్‌లోని కర్బలాలో జరిగిన అర్బయిన్ వాక్/యాత్ర  (Arbaeen walk) సంబంధించినది. ఈ వీడియో పలువురు భారతీయ యాత్రికులు భారతదేశ జెండాలను పట్టుకుని సెప్టెంబర్ 2023లో జరిగిన అర్బయిన్ యాత్రలో పాల్గొన్న దృశ్యాలను చూపుతుంది. ప్రతి సంవత్సరం జరిగే అతిపెద్ద మతపరమైన సమావేశాలలో/యాత్రలలో అర్బయిన్ వాక్ ఒకటి. ఈ యాత్ర ప్రతి ఏటా ఇరాక్‌లో జరుగుతుంది, ఇది షియా ముస్లింలకు ముఖ్యమైన మతపరమైన యాత్ర. ప్రతి సంవత్సరం ఈ యాత్రలో లక్షలాది మంది భారతీయ షియా ముస్లింలు కూడా పాల్గొంటారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోను సెప్టెంబర్ 2023లో పలువురు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ఈ వీడియో సెప్టెంబర్ 2023లో ఇరాక్‌లోని కర్బలాలో జరిగిన అర్బయిన్ వాక్ (Arbaeen walk) సంబంధించిన వీడియో అని పేర్కొన్నారు (ఇక్కడ, ఇక్కడ).

ప్రతి సంవత్సరం జరిగే అతిపెద్ద మతపరమైన సమావేశాలలో/యాత్రలలో అర్బయిన్ వాక్  ఒకటి. ఈ యాత్ర ప్రతి ఏటా ఇరాక్‌లో జరుగుతుంది. ఇది షియా ముస్లింలకు ముఖ్యమైన మతపరమైన యాత్ర. ఆగస్ట్ 2024లో జరిగిన అర్బయిన్ యాత్రలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 మిలియన్ల మంది పాల్గొన్నారు (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). అషురాను సందర్భంగా ఈ యాత్రను నిర్వహిస్తారు. అషురా అనేది ముహమ్మద్ ప్రవక్త మనవడు మరియు మూడవ షియా ఇమామ్ అయిన హుస్సేన్ ఇబ్న్ అలీ మరణాన్ని గుర్తుచేసే ఒక మతపరమైన ఆచారం. ఈ అర్బయిన్ వాక్  సందర్భంగా హుస్సేన్ ఇబ్న్ అలీ మందిరం ఉన్న ఇరాక్‌లోని కర్బలా నగరానికి ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు నడిచి వెళ్తారు.

ప్రతి సంవత్సరం ఈ యాత్రలో లక్షలాది మంది భారతీయ షియా ముస్లింలు పాల్గొంటారు (ఇక్కడ, ఇక్కడ). భారతదేశం నుండి ఈ యాత్రలో పాల్గొన్న పలువురు భారత జెండాను మోస్తూ ఈ యాత్రలో కనిపించారు.

చివరగా, పాలస్తీనా పౌరులు ఇజ్రాయెల్ దాడుల నుండి తప్పించుకోవడానికి భారత జెండాను ఉపయోగిస్తున్నారని పేర్కొంటూ సెప్టెంబర్ 2023లో ఇరాక్‌లో జరిగిన అర్బయిన్ వాక్ వీడియోను షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll