రోలర్ కోస్టర్‌పై పిడుగు పడిన దృశ్యాలు అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. తిరుగుతున్న రోలర్ కోస్టర్‌పై పిడుగు పడడంతో అందులో ప్రయాణిస్తున్న అందరూ కాలి బూడిదైనట్టు ఈ వీడియోలో చూడొచ్చు(ఇక్కడ). ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: తిరుగుతున్న రోలర్ కోస్టర్‌పై పిడుగు పడిన దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వీడియోలోని దృశ్యాలను యానిమేషన్ ద్వారా రూపొందించారు. ‘javier.vfx’ పేరుతో ఉన్న ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఈ వీడియోను యానిమేషన్ ద్వారా రూపొందించమంటూ షేర్ చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
తిరుగుతున్న రోలర్ కోస్టర్‌పై పిడుగు పడినట్టు ఉన్న ఈ దృశ్యాలు నిజంగా జరిగిన ఘటనకు సంబంధించినవి కావు. వీటిని కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా రూపొందించారు. ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియో స్క్రీన్ షాట్స్ ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇవే దృశ్యాలను షేర్ చేసిన ఒక ఇంస్టాగ్రామ్ పోస్ట్ మాకు కనిపించింది.
ఐతే ఈ వీడియోను ‘javier.vfx’ యానిమేషన్ ద్వారా రూపొందించినట్టు ఈ పోస్టులో పేర్కొన్నారు. దీని ఆధారంగా ఆ అకౌంట్ కోసం ఇంస్టాగ్రామ్‌లో వెతకగా ‘javier.vfx’ పేరుతో ఉన్న అకౌంట్‌లో ఇదే వీడియోను 08 ఏప్రిల్ 2024న షేర్ చేసినట్టు తెలిసింది. ఐతే ఈ వీడియోకు సంబంధించి అందించిన వివరణ ప్రకారం దీనిని యానిమేషన్ ద్వారా రూపొందించినట్టు తెలుస్తుంది.
ఈ వీడియోకు సంబంధించి స్పష్టత కోసం అతనిని ఇంస్టాగ్రామ్ ద్వారా సంప్రదించాము. వారి నుండి వచ్చిన జవాబు ఆధారంగా ఈ ఆర్టికల్ అప్డేట్ చేయబడుతుంది.
చివరగా, తిరుగుతున్న రోలర్ కోస్టర్‌పై పిడుగు పడిన దృశ్యాలు అంటూ ఒక యానిమేషన్ వీడియోను షేర్ చేస్తున్నారు.