Fake News, Telugu
 

మలేషియా రైల్వే ప్రాజెక్టుకు సంబంధించిన వీడియోను భారతదేశంలో రైల్వే ట్రాక్ నిర్మాణానికి సంబంధించిన వీడియో అంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు

0

అత్యాధునిక రైల్వే ట్రాక్-లేయింగ్ మెషిన్ రైల్వే ట్రాక్ వేస్తున్న దృశ్యాలు చూపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ & ఇక్కడ). ఈ వీడియో భారతదేశంలో జరుగుతున్న రైల్వే ట్రాకుకు సంబంధించిన పనులని చుపిస్తున్నట్లుగా చెప్తూ షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: అత్యాధునిక రైల్వే ట్రాక్-లేయింగ్ మెషిన్ ఉపయోగించి భారతదేశంలో రైల్వే ట్రాక్‌ను ఏర్పాటు చేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు మలేసియాలో కొత్తగా నిర్మిస్తున్న ఈస్ట్ కోస్ట్ రైల్ లింక్ (ECRL) రైల్వే ప్రాజెక్టులో భాగంగా అధునాతన ట్రాక్-లేయింగ్ మిషన్‌తో రైల్వే ట్రాక్ నిర్మాణాన్ని చూపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ 11 డిసెంబర్ 2023న మలేషియాలో ప్రారంభమైంది. ఈ రైల్వే ప్రాజెక్టును చైనీస్ కమ్యూనికేషన్స్ కన్‌స్ట్రక్షన్ అనే చైనా కంపెనీ నిర్మిస్తోంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ముందుగా ఈ వైరల్ వైరల్ వీడియోను నిశితంగా పరిశీలిస్తే రైల్వే  ట్రాక్-లేయింగ్ మెషీన్‌పై  చైనీస్ భాష ఉండడం మనం గమనించవచ్చు. అలాగే ‘చైనా కమ్యూనికేషన్స్ కన్‌స్ట్రక్షన్’ అని ఇంగ్లీషు భాషలో రాసి ఉండడం కూడా మనం గమనించవచ్చు. దీన్ని బట్టి ఈ వీడియోలోని దృశ్యాలు చైనా సంస్థ చేస్తున్న  రైల్వే ట్రాక్ నిర్మాణ పనికి సంబంధించినదిగా తెలుస్తుంది.

తరువాత ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు వీడియో యొక్క కీఫ్రేములను ఉపయోగిస్తూ రివర్స్ ఇమేజ్ సర్చ్ చేయగా, కొద్ది నిడివి గల ఇదే వీడియోను 09 జనవరి 2024న ‘Sharing Travel’ అనే X(ట్విట్టర్) యూజర్ షేర్ చేసినట్లు తెలిసింది. “మలేషియాకు చెందిన ‘ఈస్ట్ కోస్ట్’ రైల్వే ట్రాక్‌లను వేయడం ప్రారంభించింది” అని ఈ వీడియో యొక్క వివరణలో పేర్కొన్నారు.

దీని ఆధారంగా  తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఈ రైల్వే మలేషియా రైలు ప్రాజెక్ట్ గురించి వెతకగా, వైరల్ వీడియోలోని దృశ్యాలను చూపిస్తున్న పలు ఫోటోలు చైనాకు చెందిన వార్త సంస్థ జిన్హువా న్యూస్ (china Xinhua News)  తమ X(ట్విట్టర్) హ్యాండిల్‌లో 12 డిసెంబర్ 2023న షేర్ చేసినట్లు గుర్తించాం. “ఈస్ట్ కోస్ట్ రైల్ లింక్ #ECRL, మలేషియాలో చైనా కమ్యూనికేషన్స్ నిర్మిస్తున్న మెగా రైలు ప్రాజెక్ట్” అనే శీర్షికతో ఈ ఫోటోలు షేర్ చేశారు. (ఇంగ్లీషు నుండి తెలుగు అనువాదం)

ఈ మలేషియా మెగా రైలు ప్రాజెక్ట్ మరియు ఈ ట్రాక్-లేయింగ్ మెషీన్ గురించి మరింత తెలుసుకోవడానికి ఇంటర్నెట్‌లో వెతకగా, ఈ రైల్వే ప్రాజెక్ట్ గురించి డిసెంబర్ 2023లో పబ్లిష్ అయిన పలు వార్తా కథనాలు మాకు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, మలేషియాలో చైనీస్ కమ్యూనికేషన్స్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ (ఈ కంపెనీ పేరు వైరల్ వీడియోలో చూడవచ్చు) ఈస్ట్ కోస్ట్ రైల్ లింక్ (ECRL)  రైల్వే ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్ 11 డిసెంబర్ 2023న ప్రారంభమైంది. మలేషియా రాజు సుల్తాన్ అబ్దుల్లా సుల్తాన్ అహ్మద్ షా ఈ మెగా రైలు ప్రాజెక్ట్ భాగంగా ట్రాక్ లేయింగ్‌ను 11 డిసెంబర్ 2023న  ప్రారంభించారు. చైనా నుండి వచ్చిన అధునాతన ట్రాక్-లేయింగ్ పరికరాలు రైల్వే నిర్మాణ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయని మలేషియా రవాణా మంత్రి లోకే సివ్ ఫూక్ చెప్పారని, ECRL అనేది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (BRI) కింద అభివృద్ధి చేయబడుతున్న ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ అని ఈ కథనాలు పేర్కొన్నాయి.

ఈ రైల్వే ప్రాజెక్ట్ గురించి ‘AP Archive’ (ఆర్కైవ్డ్ లింక్)న్యూస్ యూట్యూబ్ ఛానెల్ ప్రచురించిన వీడియోను కూడా మేము కనుగొన్నాము. ఈ వీడియోలోని ట్రాక్-లేయింగ్ మెషీన్ వైరల్ వీడియోలో ఉన్నట్లే ఉండడం మనం గమనించవచ్చు. వైరల్ వీడియోలో కనిపించే చైనా కమ్యూనికేషన్స్ కంపెనీ లోగో కూడా ఈ వీడియోలో ట్రాక్-లేయింగ్ మెషీన్‌లో చూడవచ్చు. ఈ వీడియో మలేషియాలో చైనా కమ్యూనికేషన్స్ నిర్మిస్తున్న మెగా రైలు ప్రాజెక్ట్ కు సంబంధించిన వీడియో అని ఈ ఏపీ న్యూస్ వీడియో రిపోర్ట్ ద్వారా కూడా స్పష్టం అవుతుంది .

చివరగా, మలేషియా రైల్వే ప్రాజెక్టుకు సంబంధించిన వీడియోను భారతదేశంలో జరుగుతున్న రైల్వే ట్రాక్ నిర్మాణంకు సంబంధించిన వీడియో అంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll