Fake News, Telugu
 

ఆంధ్ర ప్రదేశ్ కి ‘ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్-2019’ ర్యాంకింగ్స్ లో మొదటి ర్యాంకు రావడానికి జగన్ అమలు చేసిన సంస్కరణలు కారణం కాదు.

0

ఇటీవలే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్-2019 (EODB)’ ర్యాంకింగ్స్ లో ఆంధ్ర ప్రదేశ్ మొదటి ర్యాంకు సాధించడం సీఎం జగన్ ఘనత అని చెప్తూ ఉన్న పోస్ట్ ని సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్-2019 ర్యాంకింగ్స్ లో ఆంధ్ర ప్రదేశ్ మొదటి ర్యాంకు సాధించడం సీఎం జగన్ ఘనత

ఫాక్ట్(నిజం): 2019కి సంబంధించిన ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ 31మార్చ్ 2019కి ముందు అమలు చేసిన సంస్కరణల ఆధారంగా ఇచ్చారు. అప్పటికింకా జగన్ ముఖ్యమంత్రి కాలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఇటీవలే 05 సెప్టెంబర్ 2020న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్-2019 లో ఆంధ్ర ప్రదేశ్ మొదటి ర్యాంకు సాధించడం నిజమైనప్పటికీ ఈ ర్యాంకింగ్స్ 2018-2019వ సంవత్సర కాలంలో అమలు పరచిన సంస్కరణల ఆధారంగా ఇచ్చినవి. Department for Promotion of Industry and Internal Trade (DPIIT) వెబ్సైటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ సంస్కరణలు అమలు పరచడానికి 31 మార్చ్ 2019ని చివరి తేదీగా పరిగణించారు. ఐతే ఈ సమయానికి జగన్ ఇంకా ముఖ్యమంత్రి కాలేదు. జగన్ 30 మే 2019న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసాడు. దీన్నిబట్టి ఈ ర్యాంకు సాధించడానికి పరిగణలోకి  తీసుకొన్న సంస్కరణలు గత ప్రభుత్వ హయాంలో అమలు పరిచినవని చెప్పొచ్చు.

ఐతే ఈ ర్యాంక్ గత TDP ప్రభుత్వ ఘనత అని TDPకి చెందిన వారు, ఈ ర్యాంక్ తమ ప్రభుత్వ ఘనత అని YSRCP పార్టీకి సంబంధించిన వారు ప్రకటించుకున్న నేపధ్యంలో ర్యాంకింగ్స్ కి సంబంధించిన వార్తలు విస్తృతంగా షేర్ చేస్తున్నారు. 2018-2019వ సంవత్సరానికి సంబంధించిన ర్యాంకులు కింద చూడొచ్చు.

వ్యాపారానికి అనుకూలమైన వాతావరణం కల్పించలాన్న ఉద్దేశంతో DPIIT 2015వ సంవత్సరంలో మొదటి సారిగా ఈ ర్యాంకులు ప్రకటించింది. సమాచారం అందుబాటులో ఉండటం, సింగల్ విండో సిస్టం, ఎన్ఫోర్సింగ్ కాంట్రాక్ట్స్, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్, టాక్స్ వంటి పలు అంశాల ఆధారంగా ఈ ర్యాంకులు కేటాయిస్తారు. 2016లో ఒక బిజినెస్ లైఫ్ సైకిల్ కి సంబంధించిన 10 విభాగాలలో 340 యాక్షన్ పాయింట్స్ ఆధారంగా రాష్ట్రాలకు ర్యాంకులు కేటాయించారు. 2017లో హెల్త్ కేర్ అండ్ హాస్పిటాలిటీ, ట్రేడ్ లైసెన్స్, సెంట్రల్ ఇన్స్పెక్షన్ సిస్టం వంటి కొన్ని పాయింట్స్ జతచేసి 372 అంశాల ఆధారంగా ర్యాంకులు ఇచ్చారు. ఐతే 2015,2016 సంవత్సరాలలో కేవలం రాష్ట్ర ప్రభుత్వాలు సమర్పించిన సంస్కరణలు అమలు యొక్క ఆధారాల మూలంగానే ర్యాంకులు కేటాయించారు. ఐతే 2017వ సంవత్సరంలో సంస్కరణలు నిజంగానే అమలు జరుగుతున్నాయో లేదో తెలుసుకోవడానికి 78 సంస్కరణ అంశాలలో కాంట్రాక్టర్, ఆర్కిటెక్ట్, లాయర్స్ మొదలైన వారి ఫీడ్ బ్యాక్ తీసుకొని ర్యాంకు ఇచ్చారు. 2019లో మాత్రం 100% అన్ని అంశాలకు సంబంధించి యూసర్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా ర్యాంకులు ఇచ్చారు. ఫీడ్ బ్యాక్ పద్ధతి గురించి మరింత సమాచారం ఇక్కడ చదవొచ్చు. 2019వ సంవత్సరానికి ర్యాంకులు కేటాయించడానికి పరిగణలోకి తీసుకున్న అన్ని అంశాల గురించి సమగ్ర సమాచారం ఇక్కడ పొందొచ్చు.

చివరగా, 2019కి సంబంధించిన ర్యాంకులు 31మార్చ్ 2019కి ముందు అమలు చేసిన సంస్కరణల ఆధారంగా ఇచ్చారు. అప్పటికింకా జగన్ ముఖ్యమంత్రి కాలేదు.

Share.

About Author

Comments are closed.

scroll