Fake News, Telugu
 

మహిళలపై జరుగుతున్న నేరాలలో ఆంధ్రప్రదేశ్ భారత దేశంలోనే ప్రథమ స్థానంలో లేదు

0

మహిళలపై జరుగుతున్న నేరాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారత దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ‘ఓ దిశా నువ్వెక్కడ’ అనే పేరుతో భాదితురాళ్ల చిత్రాలని ప్రదర్శిస్తూ జరిపిన ఒక కార్యక్రమం వీడియోని ఈ పోస్టులో షేర్ చేసారు. జగన్ ప్రభుత్వం హయాంలో ఇటీవల 801 మంది ఆడవాళ్ళపై అఘాయిత్యాలు జరిగినట్టు ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: మహిళలపై జరుగుతున్న నేరాలలో ఆంధ్రప్రదేశ్ భారత దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.

ఫాక్ట్ (నిజం): 2021 మర్చి నెలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వైఎస్ జగన్ పాలనలో రాష్టంలో ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలని నిరసిస్తూ టీడీపీ నాయకులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) రిలీజ్ చేసిన ‘క్రైమ్ ఇన్ ఇండియా 2020’ రిపోర్ట్ ప్రకారం, భారత దేశంలో మహిళలపై నేరాలు అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకున్తున్నట్టు స్పష్టంగా తెలిపింది.  కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే కార్యక్రమం యొక్క వీడియోని పలు యూట్యూబ్ ఛానల్స్ 2021 మార్చి నెలలో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వైఎస్ జగన్ పాలనలో రాష్టంలో ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలని నిరసిస్తూ టీడీపీ మహిళా నాయకులు ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిసింది. ఈ కార్యక్రమం యొక్క లైవ్ వీడియోని టీడీపీ 08 మార్చి 2021 నాడు ట్వీట్ చేసింది.

ఈ కార్యక్రమంలో భాగంగా అత్యాచారానికి గురైన ఆడపిల్లల చిత్రాలని ప్రదర్శించారు. జగన్ ప్రభుత్వం ‘దిశ’ చట్టం తీసుకొచ్చిన తరువాత రాష్ట్రంలో మహిళలపై 500కు పైగా నేరాలు జరిగాయి, వారిలో ఒక్కరికి కూడా ఈ చట్టం ద్వారా శిక్ష పడలేదని ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా నాయకురాలు వంగలపూడి వనిత ఆరోపించారు.

2021 సెప్టెంబర్ నెలలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) రిలీజ్ చేసిన ‘క్రైమ్ ఇన్ ఇండియా 2020’ రిపోర్ట్ ప్రకారం, 2020 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై మొత్తంగా 17089 నేరాలు జరిగినట్టు తెలిపింది. భారత దేశ పరంగా చూసుకుంటే 2020లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై అత్యధిక నేరాలు జరిగినట్టు NCRB తెలిపింది. 2020లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై మొత్తంగా 49,385 నేరాలు జరిగాయి.

2020లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై జరిగిన నేరాలలో 1095 అత్యాచార కేసులు ఉంటే, 534 కిడ్నాప్ లేదా అపహరణ కేసులు ఉన్నాయి. 1107 మంది ఆడపిల్లలు అత్యాచారం లేదా రేప్ ద్వారా బాధించపడ్డారని, ఇందులో 587 మంది చిన్నారులు ఉన్నారని NCRB తమ రిపోర్టులో స్పష్టం చేసింది. 2020లో మహిళలపై అత్యాచార ఘటనలు అత్యధికంగా రాజస్తాన్ రాష్ట్రంలో చోటుచేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల మహిళలపై ఎన్ని నేరాలు జరిగాయనే విషయాన్ని NCRB ఇంకా విడుదల చేయలేదు.

చివరగా, మహిళలపై జరుగుతున్న నేరాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారత దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవలేదు.

Share.

About Author

Comments are closed.

scroll