వక్ఫ్ సవరణ చట్టం, 2025ని వ్యతిరేకిస్తూ, ఏప్రిల్ 2025లో పశ్చిమ బెంగాల్‌లో చాలా చోట్ల నిరసనలు జరిగాయి. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో ఈ ఆందోళనులు హింసాత్మకంగా మారి, గొడవలు, అల్లర్లు కూడా జరిగాయని వార్తా కథనాలు పేర్కొన్నాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఈ కథనాల ప్రకారం (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ), ముర్షిదాబాద్‌లో జరిగిన గొడవల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు, ఇందులో చందన్ దాస్, హరగోబింద్ దాస్ అనే ఇద్దరు హిందువులు ఒక మూక దాడిలో మరణించగా, ఒక ముస్లిం వ్యక్తి పోలీసు కాల్పుల్లో చనిపోయాడు. ముర్షిదాబాద్ జిల్లాలో జరుగుతున్న ఈ హింసను తప్పించుకోవడానికి వందలాది హిందువులు తమ ఇళ్లను వదిలి, ఆశ్రయం పొందడానికి మాల్డా నగరానికి చేరుకున్నారని కూడా మీడియా రిపోర్ట్ చేసింది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ముర్షిదాబాద్‌లో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి కేంద్ర బలగాలని మోహరించాలని కలకత్తా హైకోర్టు 12 ఏప్రిల్ 2025న ఆదేశించింది (ఇక్కడ, ఇక్కడ). ఈ అల్లర్లకు సంబంధించి 150 మందికి పైగా వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసినట్లు రిపోర్ట్స్ పేర్కొన్నాయి (ఇక్కడ, ఇక్కడ).
ఈ నేపథ్యంలో కొందరు వ్యక్తులు ఉన్న ఒక బస్సులో నుంచి ఒకతను బయటికి తల పెట్టి నినాదాలు చేపడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో బజరంగ్ దళ్ దిగింది, మాములుగా ఉండదు ఇంక, అని క్లెయిమ్ చేస్తూ ఈ వీడియోని యూజర్లు షేర్ చేస్తున్నారు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: ముర్షిదాబాద్ హింస నేపథ్యంలో, బజరంగ్ దళ్ వారు పశ్చిమ బెంగాల్‌లో ప్రవేశించిన దృశ్యాలను చూపిస్తున్న వీడియో.
ఫ్యాక్ట్(నిజం): ఈ వీడియో 12 ఏప్రిల్ 2025న ఉత్తర్ ప్రదేశ్‌లోని లక్నోలో ఉన్న హజ్రత్‌గంజ్ అనే ప్రాంతంలో తీసినది, దీనికి పశ్చిమ బెంగాల్‌కు ఎటువంటి సంబంధం లేదు. రాజ్‌పుత్ రాజు రాణా సంగ జయంతి సందర్భంగా కర్ణి సేన, క్షత్రియ మహాసభ వంటి సంస్థలు లక్నోలో ఒక ప్రదర్శనకు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ సంఘటనకి చెందిన దృశ్యాలే మనం వైరల్ వీడియోలో చూడవచ్చు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ముందుగా, ఈ క్లెయిమ్ వెనుక నిజానిజాలు తెలుసుకోవడానికి, తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, బజరంగ్ దళ్ సభ్యులు ఈ విధంగా పశ్చిమ బెంగాల్‌కు చేరుకున్నారని చెప్తూ ఎటువంటి వార్తా కథనాలు మాకు లభించలేదు.
ఆ తర్వాత, వైరల్ వీడియో గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి దాన్ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ పరిశీలించగా, ఒకచోట బోర్డు పైన ‘పోలీస్ చౌకి కొత్వాలి హజు..’ అని హిందీలో రాసి ఉండటాన్ని మేము గమనించాము. ఆ బోర్డుకి ఒక స్తంభం అడ్డంగా ఉండడం వల్ల మనకు దానిపై ఉన్న అక్షరాలు సరిగ్గా కనిపించడం లేదు. కానీ ‘పోలీస్ చౌకి కొత్వాలి హజు..’ని క్లూగా తీసుకొని ‘కొత్వాలి హజ..’ అనే పదాలతో ఉన్న పోలీస్ స్టేషన్‌ల గురించి ఇంటర్నెట్లో వెతకగా, ఇది ఉత్తర్ ప్రదేశ్‌లోని లక్నోలో, హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్ అని మాకు తెలిసింది.

అలాగే వీడియోలో ఒక బిల్డింగ్ పైన, ‘Kazmi Soun’అని, ఒక బిల్డింగ్ పైన ‘R Overs’ అని ఉండటం మేము గమనించాము. తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, ఈ వీడియో లక్నోలోని హజ్రత్‌గంజ్‌లో ఉన్న ‘అటల్ చౌక్ చౌరాహ’లో తీసినది అని మాకు అర్థం అయ్యింది. ఈ రెండు బిల్డింగులని మీరు గాగుల్ మ్యాప్స్‌పై ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. వైరల్ వీడియోలో ఉన్న ప్రాంతం, ఈ ప్రాంతానికి ఉన్న పోలికలను మీరు కింది కొల్లాజ్‌లో చూడవచ్చు.

వైరల్ వీడియోలో ఒక వ్యక్తి, ‘సమాజ్‌వాది పార్టీ ముర్దాబాద్’ అని అనడం మనం చూడవచ్చు. దీనిని ఆధారంగా తీసుకొని, లక్నోలో సమాజ్‌వాది పార్టీకి (SP) వ్యతిరేకంగా ఇటీవల జరిగిన ఆందోళనల గురించి ఇంటర్నెట్లో వెతకగా, ఈ సంఘటనకు సంబంధించిన వార్తా కథనాలు మాకు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).

12 ఏప్రిల్ 2025న రాజ్‌పుట్ రాజు, రాణా సంగ జయంతి సందర్భంగా కర్ణి సేన మరియు కొన్ని సంస్థలు లక్నోలోని హజ్రత్‌గంజ్‌లో ఒక ప్రదర్శనను చేపట్టాలి పిలుపుని ఇచ్చారు. అయితే, ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీస్ వారు ఈ కార్యక్రమ నిర్వాహకులతో మాట్లాడి దాన్ని వాయిదా వెయ్యాలని కోరారు(ఇక్కడ). అయినా గానీ కొంత మంది నిరసనకారులు హజ్రత్‌గంజ్‌కు చేరుకోవడంతో, పోలీసు వారు వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ సంఘటనపై దైనిక్ భాస్కర్ వారు ప్రచురించిన వార్తా కథనంలో వైరల్ వీడియోలో బస్సు బయటికి తల పెట్టి ‘జై శ్రీ రామ్,సమాజ్‌వాది పార్టీ ముర్దాబాద్’ అని అరుస్తున్న వ్యక్తిని మనం చూడవచ్చు.

అలాగే, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో రిపోర్టులలో వైరల్ వీడియోలో కనిపిస్తున్న బిల్డింగులు, కట్టడాలను మనం చూడవచ్చు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).

ఈ నిరసనలు SP ఎంపీ రామ్‌జీ లాల్ సుమన్, రాజ్‌పుట్ రాజు రాణా సంగను ‘దేశద్రోహి’ అని పార్లమెంటులో అనడం వల్ల జరిగాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). సుమన్ ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత, ఆయన ఇంటిపై కొందరు 27 మార్చ్ 2025న దాడి చేశారు.

చివరగా, పశ్చిమ బెంగాల్‌లో బజరంగ్ దళ్ కార్యకర్తలు అని ఉత్తర్ ప్రదేశ్‌లోని లక్నోలో తీసిన ఒక సంబంధం లేని వీడియోని షేర్ చేస్తున్నారు.