ఇటీవల టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల్లో గెలిచి సీఎం అయిన తర్వాత తొలిసారి హైదరాబాద్ వచ్చారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు పోస్టర్‌ను కొందరు చెప్పులతో కొడుతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చంద్రబాబు తెలంగాణకు రావడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రజలు చంద్రబాబు ఫ్లెక్సీని చెప్పులతో కొట్టారని క్లెయిమ్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఇటీవల జులై 2024లో చంద్రబాబు హైదరాబాద్‌కు రాగా ఆయన పర్యటనను వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రజలు చంద్రబాబు ఫ్లెక్సీని చెప్పులతో కొట్టారు, అందుకు సంబంధించిన దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వీడియోలోని దృశ్యాలు ఏప్రిల్ 2024లో మడకశిర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సునీల్ కుమార్ స్థానంలో ఎంఎస్ రాజును ప్రకటించడంతో డాక్టర్ సునీల్ కుమార్ అనుచరులు లోకేష్, చంద్రబాబు ఫ్లెక్సీలను చెప్పులతో కొట్టిన సంఘటనకు సంబంధించినవని. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం వైరల్ వీడియోకి సంబంధించిన కీఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను చూపిస్తున్న వీడియో ఒకటి లభించింది. ఈ వీడియోని 21 ఏప్రిల్ 2024న ‘Samayam Telugu‘ తమ యూట్యూబ్ ఛానెల్‌లో ‘TDP Workers Protest In Madakasira | Chandrababu | MS Raju | Dr. Sunil Kumar ||” అనే శీర్షికతో షేర్ చేసింది. ఈ వీడియోలో తెలిపిన కథనం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లా, మడకశిర అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సునీల్ కుమార్ ను టీడీపీ మొదట ప్రకటించింది. అయితే, చివర్లో డాక్టర్ సునీల్ కుమార్ స్థానంలో ఎంఎస్ రాజును అభ్యర్థిగా ప్రకటించడంతో డాక్టర్ సునీల్ కుమార్ అనుచరులు మడకశిర టీడీపీ కార్యాలయంపై దాడి చేసి చంద్రబాబు, లోకేష్ ఫ్లెక్సీని దగ్ధం చేశారు. అలాగే నారా లోకేష్, చంద్రబాబు ఫ్లెక్సీలను కార్యకర్తలు చెప్పులతో కొట్టారని తెలిసింది. ఈ నిరసనకు సంబంధించిన మరిన్ని వార్తా కథనాలను ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు.

వైరల్ వీడియోలోని దృశ్యాలను, న్యూస్ వీడియోలోని దృశ్యాలతో పోల్చి చూస్తే, రెండు ఒకే సంఘటనను చూపిస్తున్నాయని తెలుస్తుంది. దీనిని బట్టి, వైరల్ వీడియోలోని దృశ్యాలు మడకశిర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సునీల్ కుమార్ స్థానంలో ఎంఎస్ రాజును ప్రకటించడంతో డాక్టర్ సునీల్ కుమార్ అనుచరులు చంద్రబాబు ఫ్లెక్సీను చెప్పులతో కొట్టిన సంఘటనకు సంబంధించినవని మనం నిర్థారించవచ్చు.

చివరగా, చంద్రబాబు నాయుడు హైదరాబాద్ పర్యటనను వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రజలు చంద్రబాబు ఫ్లెక్సీని చెప్పులతో కొట్టారంటూ సంబంధం లేని పాత వీడియోని షేర్ చేస్తున్నారు.