Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

ఈ ఫోటో భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కోవిడ్ -19 వాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కి సంబంధించింది కాదు

0

భారత్ బయోటెక్ సంస్థవారు  తయారు చేసిన కోవిడ్ -19 వాక్సిన్ (కొవాక్సిన్ లేదా బీబీవీ 152 కోవిడ్ వాక్సిన్) క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్  కే.వీ. శ్రీనివాస్ మొదట ఆ వాక్సిన్ని తనమీదే ప్రయోగించుకుంటున్నట్టు ఉండే ఒక చిత్రం అనేక సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నది . ఈ కధనం ద్వారా ఆ చిత్రంలో ఎంతవరకు నిజముందో చూద్దాం .

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: భారత్ బయోటెక్ సంస్థవారు తయారు చేసిన కోవిడ్ -19 వాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ కే.వీ.శ్రీనివాస్ మొదట ఆ వాక్సిన్ని తనమీదే ప్రయోగించుకున్నారు.

ఫాక్ట్ (నిజం): భారత్ బయోటెక్ సంస్థవారు ఆ ఫొటోలో కనిపించేది సాధారణంగా చేసే రక్త నమూనాల సేకరణ మాత్రమే అని ధృవీకరించారు. అలాగే క్లినికల్ ట్రయల్స్ రిజిస్ట్రీ – ఇండియా (CTRI) వెబ్సైట్ లో సమాచారం ప్రకారం భారత దేశంలో బీబీవీ 152 కోవిడ్ వాక్సిన్ ట్రయల్స్ కోసం నమోదు చేసుకునే ప్రక్రియ 13 జులై నుండి మొదలవుతున్నట్టు ఉంది. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

భారత్ బయోటెక్ సంస్థవారు తమ ట్విట్టర్ అకౌంట్ ద్వారా వైరల్ అవుతున్న ఆ ఫోటో గురించి వివరణ ఇస్తూ ఆ ఫొటోలో కనిపించేది సాధారణంగా చేసే రక్త నమూనాల సేకరణ మాత్రమే అని ఒక ట్వీట్ ద్వారా తెలిపారు, పైగా ఆ ఫోటోని తమ సంస్థ విడుదల చేయలేదని తెలిపారు. ఈ విషయం మేము గూగుల్ సెర్చ్ లో వైరల్ అవుతున్న ఫోటో గురించి వెతికే క్రమంలో తెలిసింది.

ఆ వాక్సిన్ గురించి మరిన్ని విషయాలు క్లినికల్ ట్రయల్స్ రిజిస్ట్రీ – ఇండియా (CTRI) వెబ్సైట్ లో దొరికాయి. ఈ వెబ్సైట్ లో ఉన్న సమాచారం ప్రకారం భారత దేశంలో బీబీవీ 152 కోవిడ్ వాక్సిన్ ట్రయల్స్ కోసం నమోదు చేసుకునే ప్రక్రియ 13 జులై నుండి మొదలవుతున్నట్టు ఉంది. భారత్ బయోటెక్ సంస్థ చైర్మన్ డా. కృష్ణ ఎల్లా ఇటీవలే ఎన్డీటీవీతో మాట్లాడుతూ తాము తయారు చేసిన వాక్సిన్ కి కావాల్సిన అనుమతులు లభించడంతో, ఒక పది రోజుల్లో మనషుల మీద ప్రయోగాలు మొదలు పెట్టే అవకాశముందని చెప్పారు. ఈ సమాచారం ప్రకారం ఈ రోజు వరకు (06 జులై 2020) మనుషులపై ఎటువంటి ప్రయోగాలు చేయలేదని నిర్ధారించవచ్చు.

అలాగే CTRI వెబ్సైట్లో ఉన్న సమాచారం ప్రకారం  బీబీవీ152 అనేది కండరాలకు ఇచ్చే సూదిమందు.

కానీ వైరల్ అవుతున్న ఫొటోలో వాక్సిన్ని కండరాలకు ఇస్తునట్టుగా లేదు. సూదిమందును వివిధ  రకాలుగా ఇచ్చే ప్రక్రియను ఈ ఫొటోలో చూడొచ్చు.

ఉదాహరణకి Moderna’s mRNA Vaccine (mRNA-1273) అనబడే మరొక కోవిడ్-19 వాక్సిన్ని ఒక మహిళకు ఇస్తున్న విధానం ఇక్కడ చూడవచ్చు, అమెరికా ప్రభుత్వ క్లినికల్ ట్రయల్స్ వెబ్సైట్ ప్రకారం పైన పేర్కొన్న వాక్సిన్ కూడా కండరాలకు ఇచ్చే సూదిమందే.

క్లుప్తంగా చెప్పాలంటే వైరల్ అవుతున్న ఫొటో భారత్ బయోటెక్ వైస్ ప్రెసిడెంట్ కి కోవిడ్ -19 వాక్సిన్ ఇస్తున్నది కాదు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll