Fake News, Telugu
 

2017లో పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడిపై జరిగిన దాడికి సంబంధించిన పాత వీడియోని మణిపూర్‌లో బీజేపీ నాయకులను ప్రజలు కొడుతున్న వీడియో అంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు.

0

మణిపూర్‌ రాష్ట్రంలో బీజేపీ (BJP) నాయకులను ప్రజలు కొడుతున్నారు అని చెప్తూ పలు పోస్టులు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి మద్దతుగా బీజేపీ కండువాలు కప్పుకున్న వారిపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడుతున్న వీడియోను జతచేసి షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఇలాంటి మరొక పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: మణిపూర్‌ రాష్ట్రంలో బీజేపీ (BJP) నాయకులను ప్రజలు కొడుతున్న దృశ్యాలను చూపిస్తున్న వీడియో.

ఫాక్ట్(నిజం): మణిపూర్‌కు, ఈ వీడియోకు ఎలాంటి సంబంధం లేదు. ఈ వీడియోలోని దృశ్యాలు 2017లో పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్‌పై గూర్ఖా జనముక్తి మోర్చా(GJM) కార్యకర్తల దాడికి సంబంధించినవి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోకి సంబంధించిన  మరింత సమాచారం కోసం పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే దాడికి సంబంధించిన దృశ్యాలను చూపిస్తున్న వీడియోని ‘NMF News’ తమ యూట్యూబ్ ఛానెల్‌లో 06 అక్టోబర్ 2017న  పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియో యొక్క వివరణలో, డార్జిలింగ్‌లో గూర్ఖా జనముక్తి మోర్చా (GJM) యొక్క బినోయ్ తమాంగ్ వర్గానికి చెందిన వ్యక్తులు పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్‌పై దాడి చేశారని పేర్కొన్నారు.

ఈ సమాచారం ఆధారంగా, ఈ దాడికి సంబంధించిన మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, అక్టోబర్ 2017లో వచ్చిన పలు వార్త కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ రిపోర్ట్స్ ప్రకారం, బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ డార్జిలింగ్ హిల్స్ పర్యటనలో భాగంగా 05 అక్టోబర్ 2017న రద్దీగా ఉండే చౌక్ బజార్ ప్రాంతంలో పర్యటిస్తుండగా, గూర్ఖా జనముక్తి మోర్చా యొక్క(GJM)  బినోయ్ తమాంగ్ వర్గానికి చెందిన వ్యక్తులు అక్కడ బీజేపీ తలపెట్టిన బహిరంగ సభను రద్దు చేయమని “లాంగ్ లివ్ బినోయ్ తమాంగ్” మరియు “బిజెపి గో బ్యాక్” అని నినాదాలు చేస్తూ ఘోష్‌తో పాటు వెళుతున్న కార్యకర్తలపై దాడి చేసారు. దీన్ని బట్టి ఈ వైరల్ వీడియోకి మణిపూర్‌కు ఎలాంటి సంబంధం లేదని నిర్థారించవచ్చు.

ఇదే వీడియో ఇంతకు ముందు వివిధ క్లెయిమ్‌లతో వైరల్ అయినప్పుడు FACTLY వాటిని ఫాక్ట్-చెక్ చేస్తూ రాసిన కథనాలు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

చివరగా, 2017లో పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడిపై జరిగిన దాడికి సంబంధించిన పాత వీడియోని మణిపూర్‌లో బీజేపీ నాయకులను ప్రజలు కొడుతున్న వీడియో అంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll