Fake News, Telugu
 

ముస్లిం యువకులు జాతీయ గీతాన్ని వాయిస్తున్న పాత వీడియోను కశ్మీర్‌కు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు

0

కొందరు ముస్లిం యువకులు వివిధ సంగీత పరికరాలతో జనగణమన గీతాన్ని వాయిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ వీడియో కశ్మీర్ మదరసాకు సంబంధించిందని చెప్తూ, 2019లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీర్ మదరసాల్లో ఇలాంటి మార్పు వచ్చిందనే ఉద్దేశంలో ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఐతే ఈ కథనం ద్వారా పోస్టులో చేస్తున్న వాదనలో నిజమెంతుందో చూద్దాం.

క్లెయిమ్: ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీర్ మదరసాలో ముస్లిం యువకులు వివిధ సంగీత పరికరాలతో జనగణమన గీతాన్ని వాయిస్తున్న వీడియో.

ఫాక్ట్(నిజం): ఈ వీడియో 2017 నుండే ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంది. ఈ వీడియో ఎక్కడిదో అన్న స్పష్టత లేనప్పటికీ, ఈ వీడియోకు కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుకు ఎటువంటి సంబంధం లేదని మాత్రం స్పష్టమవుతుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఇటీవల దేశం 77వ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంది. అన్ని రాష్ట్రాలతో పాటు కశ్మీర్‌లో కూడా వేడుకలు జరిగాయి. కశ్మీర్‌లోని మదర్సాలో కూడా స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరిగినట్టు రిపోర్ట్స్ ఉన్నాయి (ఇక్కడ మరియు ఇక్కడ).

ఐతే ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియో మాత్రం ఈ మధ్య కాలనిది కాదు. ఈ వీడియో స్క్రీన్ షాట్స్‌ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే వీడియోను 2017లో షేర్ చేసిన ఫేస్‌బుక్‌ మరియు యూట్యూబ్‌ పోస్టులు కనిపించాయి (ఇక్కడ మరియు ఇక్కడ).

ఐతే ఈ పోస్టులలో ఈ వీడియో ఎక్కడిదో అన్న విషయం స్పష్టం చేయనప్పటికీ, వీడియో ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమయాన్ని బట్టి ఇది కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు కన్నా ముందుదే అని స్పష్టమవుతుంది. కాబట్టి ఆర్టికల్ 370 రద్దు తరవాతే కశ్మీర్ మదర్సాలో మార్పు వచ్చిందని పోస్టులో చేస్తున్న వాదన కరెక్ట్ కాదని అర్ధం చేసుకోవచ్చు.

చివరగా, ముస్లిం యువకులు జాతీయ గీతాన్ని వాయిస్తున్న పాత వీడియోను కశ్మీర్‌కు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు

Share.

About Author

Comments are closed.

scroll