Fake News, Telugu
 

మోదీ బొమ్మకు శవయాత్ర నిర్వహిస్తున్న పాత వీడియోను 2024 ఎన్నికల నేపథ్యంలో మోదీకి వ్యతిరేకంగా గుజరాత్‌లో నిరసనలు జరుగుతున్నట్టు షేర్ చేస్తున్నారు

0

2024 లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మోదీకి నిరసనగా ధర్నా చేస్తున్న గుజరాత్ వ్యాపారులు అని క్లెయిమ్ చేస్తూ మోదీ బొమ్మకు శవయాత్ర నిర్వహిస్తున్న వీడియోని సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) షేర్ చేస్తున్నారు. ఈ క్లెయిమ్ లో ఎంతవరకు నిజం ఉందో చూద్దాం. 

క్లెయిమ్: 2024 లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మోదీకి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న గుజరాత్ వ్యాపారుల వీడియో. 

ఫాక్ట్ (నిజం): 2017 నుండి ఈ వీడియో వేరు వేరు కథనాలతో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ వీడియోకు 2024 ఎన్నికలకు ఎంటువంటి సంబంధం లేదు. ఈ వీడియోలోని నిరసనలు గుజరాత్ లో జరిగినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.  

వైరల్ వీడియోకి సంబంధించిన కీ ఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతికితే ఈ వైరల్ వీడియో సోషల్ మీడియాలో 2017 నుండే వేర్వేరు క్లెయిమ్‌లతో షేర్ అవుతూ కనిపించింది.  2017లో ఒక ఫేస్‌బుక్ పోస్టులో ఇది హర్యానాకి సంబంధించిన వీడియో అని పేర్కొన్నారు. అలానే, 2018లో ఇదే వీడియోను (ఇక్కడ, ఇక్కడ) సోషల్ మీడియాలో కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో గెలిచినందుకు పాకిస్తాన్లో మోదీ శవయాత్ర చేస్తున్నారన్న క్లెయిమ్ తో వైరల్ అయింది. 2020లో ఈ వీడియోను (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హర్యానాలో రైతుల నిరసనలకు ముడిపెడుతూ షేర్ చేసారు.    

వైరల్ వీడియో కీఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినపుడు జల్లికట్టు గురించి 21 జనవరి 2017న ప్రచురించిన ఒక కథనంలో వైరల్ వీడియోలో ఉన్న మోదీ శవయాత్రకి సంబంధించిన ఫోటో లభించింది. 2017లో ఇలాంటి సంఘటన ఏదయినా జరిగిందా అని ఇంటర్నెట్లో వెతికితే ‘vinavu’ అనే YouTube ఛానల్ 21 జనవరి 2017న  పోస్ట్ చేసిన వీడియో లభించింది. చెన్నైలో జల్లికట్టుని నిషేదించినందుకు వ్యతిరేకంగా నిరసనకారులు మోదీ బొమ్మకు శవయాత్ర చేసిన విజువల్స్ ఈ వీడియోలో చూడవొచ్చు. అంతేకాకుండా, అదే సమయంలో తమిళనాడులో జల్లికట్టుని నిషేదించినందుకు పెద్ద ఎత్తున నిరసనలు జరిగినట్టు ప్రముఖ మీడియా సంస్థలు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) రిపోర్ట్ చేసాయి.

2018లో ‘BOOM’ ప్రచురించిన ఫాక్ట్-చెక్ ఆర్టికల్‌లో, ఈ వీడియో యూట్యూబ్ లో 25 జనవరి 2017 నుండే ఉందని, వీడియోలో ఉన్న ఆడియో హిందీలో కాకుండా ఇతర భాషలో ఉన్నట్టు తెలిపారు. ఈ వీడియోని ఇంటర్నెట్ నుంచి తొలగించడంతో ఈ వీడియో ఆర్కైవ్‌ని వెతికాము. ఇందులోని థంబ్‌నెయిల్‌ వైరల్ వీడియోలో ఉన్న విజువల్‌ ని పోలి ఉండడం గమనించవచ్చు. ఈ ఆధారాలతో వైరల్ అవుతున్న వీడియో ఇప్పటిది కాదని, 2017లో తమిళనాడులో జల్లికట్టు నిషేధానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలకు సంబంధించిన వీడియో అయ్యే అవకాశం ఉందని అర్థం అవుతుంది.

చివరగా, మోదీ బొమ్మకు శవయాత్ర నిర్వహిస్తున్న పాత వీడియోను 2024 లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మోదీకి వ్యతిరేకంగా గుజరాత్‌లో నిరసనలు జరుగుతున్నట్టు షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll