ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఇటీవల తమ దేశాలలో కోవిడ్-19 మూడో వేవ్ వల్ల కొత్త లాక్ డౌన్ ఆంక్షలను విధించాయని సోషల్ మీడియాలో ఒక మెసేజ్ షేర్ చేస్తున్నారు. కెనడా, సౌదీ అరేబియా, కొలంబియా, స్పెయిన్, ఇతర దేశాలు కోవిడ్-19 వైరస్ మూడో వేవ్ నియంత్రించడానికి మరోసారి లాక్ డౌన్ విధించాయని ఈ పోస్ట్ పేర్కొంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కోవిడ్-19 యొక్క మూడవ తరంగాన్ని నియంత్రించడానికి లాక్ డౌన్ ఆంక్షలు విధించిన దేశాల జాబితా.
ఫాక్ట్ (నిజం): కనీసం డిసెంబర్ 2020 నుండి ఇలాంటి మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆక్స్‌ఫర్డ్ కోవిడ్-19 గవర్నమెంట్ రెస్పాన్స్ ట్రాకర్ ప్రకారం, పోస్టులో పేర్కొన్న చాలా దేశాలు తమ లాక్ డౌన్ ఆంక్షలను సడలించాయి. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.
పోస్టులో చేసిన క్లెయిమ్ గురించి సెర్చ్ చేసినప్పుడు, కనీసం డిసెంబర్ 2020 నుండి సోషల్ మీడియాలో ఇలాంటి మెసేజ్ వైరల్ అవుతున్నట్లు తెలిసింది.
వివిధ దేశాల్లోని ప్రభుత్వాలు కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి నివారణ చర్యలను అమలు చేస్తున్నాయి. వివిధ దేశాల విధాన ప్రతిస్పందనలను ట్రాక్ చేయడానికి, పోల్చడానికి, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ‘ది ఆక్స్‌ఫర్డ్ కోవిడ్-19 గవర్నమెంట్ రెస్పాన్స్ ట్రాకర్’ అనే డేటాబేస్ ను రూపొందించింది. ఈ టూల్ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేసిన కాంపోజిట్ స్కోరు అయిన ‘కోవిడ్-19 గవర్నమెంట్ రెస్పాన్స్ స్ట్రింజెన్సీ ఇండెక్స్’ను ఉపయోగించి చేసారు. ‘ఫైనాన్షియల్ టైమ్స్‘ తమ వెబ్ సైట్ లో వివిధ దేశాల ‘కోవిడ్-19 గవర్నమెంట్ రెస్పాన్స్ స్ట్రింజెన్సీ ఇండెక్స్’ ఉపయోగించి గ్రాఫ్స్ తయారు చేసారు. ఈ సమాచారం ఆధారంగా, మెసేజ్ లో పేర్కొన్న వివిధ దేశాల లాక్ డౌన్ చర్యలను చెక్ చేయొచ్చు.
కెనడా:
కెనడా అంతర్జాతీయ ప్రయాణానికి మరో 8 విమానాశ్రయాలకు అనుమతి ఇచ్చింది. కెనడియన్ విమానాశ్రయాల నుండి బయలుదేరే ప్రయాణికులు, సిబ్బంది పూర్తిగా టీకాలు వేసుకోవాల్సిన అవసరం ఉన్నందున మరిన్ని విమానాశ్రయాలు అంతర్జాతీయ విమానాలను స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నాయి. కోవిడ్-19 కొత్త కేసులు కెనడాలో తగ్గుముఖం పడుతున్నాయి. కెనడాలో ప్రతిరోజూ సగటున (అక్టోబర్ 15-21) 2,821 కోవిడ్-19 కొత్త కేసులు వస్తున్నాయి, ఇది ఇంతకుముందు వారంతో పోలిస్తే 11% తగ్గింది. ప్రతిరోజూ సగటున 35 మరణాలు రిపోర్ట్ అవుతున్నాయి. కెనడా యొక్క ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయ ‘కోవిడ్-19 గవర్నమెంట్ రెస్పాన్స్ స్ట్రింజెన్సీ ఇండెక్స్’ స్కోరు 67.13.
సౌదీ అరేబియా:
సౌదీ అరేబియా దేశీయ, అంతర్జాతీయ విమానాలకు పూర్తి సామర్థ్యంతో నడపడానికి అనుమతించాలని నిర్ణయించింది. దీనిని ప్రకటిస్తూ దేశంలోని విమానాశ్రయాల్లో పనిచేస్తున్న అన్ని విమానయాన సంస్థలకు సౌదీ అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. సౌదీ అరేబియా కూడా బహిరంగ సమావేశాలపై తమ ఆంక్షలను సడలించింది, పూర్తిగా టీకాలు వేసిన ప్రజలకు మాస్క్ ఆదేశాలను ఎత్తివేయాలని యోచిస్తోంది. సౌదీ అరేబియా యొక్క ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయ ‘కోవిడ్-19 గవర్నమెంట్ రెస్పాన్స్ స్ట్రింజెన్సీ ఇండెక్స్’ స్కోరు 57.41.
కొలంబియా:
‘ఎపి న్యూస్’ ప్రచురించిన ఒక కథనం ప్రకారం, కొలంబియా ప్రభుత్వం మూడో వేవ్ యొక్క గరిష్ట పెరుగుదలతో పోరాడుతున్నప్పటికీ 02 జూన్ 2021 నుండే లాక్ డౌన్ ఆంక్షలను సడలించింది. కొలంబియా, యూరోప్ మధ్య ఐబెరియా అత్యంత ప్రసిద్ధి చెందిన విమానయాన సంస్థ. కొలంబియాలో ప్రీ-కోవిడ్ సామర్థ్యానికి ఐబెరియా విమానాలు చేరుకున్నట్టు ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. కొలంబియా యొక్క ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయ ‘కోవిడ్-19 గవర్నమెంట్ రెస్పాన్స్ స్ట్రింజెన్సీ ఇండెక్స్’ స్కోరు 29.63.
బ్రెజిల్:
2020 ఫిబ్రవరిలో బ్రెజిల్ దేశంలో ఈ వ్యాధి గుర్తించబడినప్పటి నుండి ఇప్పటి వరకు, మరణాలు అతితక్కువ రోజువారీ సగటు ఈ మధ్యే నమోదు అయినట్టు బ్రెజిలియన్ శాస్త్రీయ సంస్థ ఒకటి తెలిపింది. అధికారిక “మానిటరా కోవిడ్-19” ప్రకారం, బ్రెజిల్ అక్టోబర్ చివరి ఏడు రోజుల సగటు 311 మరణాలగా నమోదు చేసింది. ఏప్రిల్ 28, 2020 తరువాత మరణాల సంఖ్య సగటున 325.14కు చేరుకున్న తరువాత ఇది అత్యల్ప సంఖ్య. బ్రెజిల్ యొక్క ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయ ‘కోవిడ్-19 గవర్నమెంట్ రెస్పాన్స్ స్ట్రింజెన్సీ ఇండెక్స్’ స్కోరు 40.28.
స్పెయిన్:
కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, స్పెయిన్ ప్రభుత్వం అక్టోబర్ 2020 లో కొత్త కరోనా వైరస్ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని ప్రకటించింది. స్పెయిన్ ప్రభుత్వం ఈ ఎమర్జెన్సీని 09 మే 2021న ఎత్తివేసింది. మాడ్రిడ్ ప్రీ-కోవిడ్ టూరిజం లెవెల్స్ టచ్ అయినట్టు ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. స్పెయిన్ యొక్క ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయ ‘కోవిడ్-19 గవర్నమెంట్ రెస్పాన్స్ స్ట్రింజెన్సీ ఇండెక్స్’ స్కోరు 41.2.
యునైటెడ్ కింగ్‌డమ్:
పెరుగుతున్న కేసు సంఖ్యలను తగ్గించడానికి తేలికపాటి చర్యలతో ముందస్తుగా వ్యవహరించడం బ్రిటిష్ ప్రధాని సలహాదారులు తెలిపారు. తరువాత కఠినమైన ఆంక్షల అవసరాన్ని తగ్గిస్తుందని చెప్పటంతో, బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ అక్టోబర్ 2021లో కొత్త కోవిడ్-19 లాక్ డౌన్ ఇప్పట్లో లేదని తెలిపారు. కోవిడ్-19 వ్యాక్సిన్లు, బూస్టర్ షాట్ ల కోసం ఎక్కువ మంది ముందుకు రాకపోతే అటువంటి చర్యలను ప్రవేశపెట్టవచ్చు. యునైటెడ్ కింగ్‌డమ్ యొక్క ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయ ‘కోవిడ్-19 గవర్నమెంట్ రెస్పాన్స్ స్ట్రింజెన్సీ ఇండెక్స్’ స్కోరు 41.2.
ఫ్రాన్స్:
ఫ్రాన్స్ ప్రభుత్వం తాజా ప్రెస్ రిలీజ్ ప్రకారం, ఫ్రాన్స్ తమ దేశంలో లాక్ డౌన్ ఆంక్షలను చాలా వరకు ఎత్తివేసింది. దేశంలో నైట్ కర్ఫ్యూను 20 జూన్ 2021న ఎత్తివేశారు. రెస్టారెంట్లు, కేఫ్ లు, బార్ లు వినియోగదారులకు కొన్ని ఆంక్షలతో అనుమతించబడ్డాయి. ఫ్రాన్స్ యొక్క ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయ ‘కోవిడ్-19 గవర్నమెంట్ రెస్పాన్స్ స్ట్రింజెన్సీ ఇండెక్స్’ స్కోరు 66.67.
జర్మనీ:
ప్రస్తుత కోవిడ్ నిబంధనలు నవంబర్ 25న ముగియడానికి అనుకూలంగా జర్మనీ తదుపరి ప్రభుత్వ ప్రతినిధులు ఆలోచిస్తున్నారు. సోషల్ డెమొక్రాట్ (ఎస్‌పిడి), గ్రీన్స్, మరియు ఫ్రీ డెమోక్రాట్లు (ఎఫ్‌డిపి) కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై చర్చలు ప్రారంభించారు. వారు పరిష్కరించే మొదటి సమస్యల్లో ఒకటి కరోనా. బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరి ఫేస్ మాస్క్ లు వంటి వ్యక్తిగత నిర్బంధ చర్యలు అమలు చేయడానికి అనుమతించారు. “పాఠశాల మూసివేతలు, లాక్ డౌన్ లు మరియు కర్ఫ్యూలు ఇకపై మాతో జరగవు. మరియు ప్రస్తుతం ఇవి అవసరం లేదు” అని ఎస్ పిడి పార్లమెంటరీ గ్రూప్ వైస్ చైర్మన్ డిర్క్ వైస్ చెప్పారు, సెప్టెంబర్ 25 న ఫెడరల్ ఎన్నికల తరువాత వారి పార్టీ బలంగా ఉద్భవించింది. జర్మనీ యొక్క ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయ ‘కోవిడ్-19 గవర్నమెంట్ రెస్పాన్స్ స్ట్రింజెన్సీ ఇండెక్స్’ స్కోరు 45.37.
ఇటలీ:
కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఒక సంవత్సరం పాటు మూసివేసిన తరువాత, ఇటలీలోని డిస్కోలు, నైట్ క్లబ్ లు తిరిగి తెరవబడ్డాయి. 2020లో ఇటలీలో మొదటి లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుండి డిస్కోలు, నైట్ క్లబ్ లు మూసివేయబడ్డాయి. పునఃప్రారంభించడం సాధారణ జీవితానికి తిరిగి తీసుకురావడానికి దేశం యోచిస్తోందని ఈ న్యూస్ రిపోర్టులో చూడొచ్చు. ఇటలీ యొక్క ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయ ‘కోవిడ్-19 గవర్నమెంట్ రెస్పాన్స్ స్ట్రింజెన్సీ ఇండెక్స్’ స్కోరు 71.3.
చివరగా, కోవిడ్-19 మూడో వేవ్ నియంత్రించడానికి ఆంక్షలు విధించిన వివిధ దేశాలు అంటూ షేర్ చేస్తున్న ఈ మెసేజ్‌లో నిజం లేదు.