Fake News, Telugu
 

ప్రస్తుతం అరబ్ దేశాల్లో ఖురాన్‌ను మురుగు కాలువల్లో పడేస్తున్నరంటూ ఒక పాత వీడియోని షేర్ చేస్తున్నారు

0

‘అరబ్ దేశాల్లో ఖురాన్ మత గ్రంథం కాదని, రాజకీయ కుట్ర పుస్తకం అని  గ్రహించి ఖురాన్‌ను మురుగు కాలువల్లో పడేస్తున్నారని’ చెప్తూ తమ వాదనకి మద్దతుగా ఒక వార్తా కథనాన్ని షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా పోస్టులో చెప్తున్న దాంట్లో నిజమెంతుందో చూద్దాం.

క్లెయిమ్: అరబ్ దేశాల్లో ప్రస్తుతం ఖురాన్‌ను మురుగు కాలువల్లో పడేస్తున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): ఈ వార్త ఇప్పటిది కాదు, 2013 నుండే ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంది. కాని ఈ ఘటనకు సంబంధించి ఇంకే ఇతర వివరాలు (ఘటనకు సంబంధించి తీసుకున్న చట్టపరమైన చర్యలు, మొదలైన) మాకు లభించలేదు. ప్రస్తుతం ఇలాంటి ఘటనలు జరిగినట్టు కూడా మాకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

సౌదీ అరేబియా తైఫ్ పట్టణంలో ఖురాన్‌ను అపవిత్రం చేస్తూ మురికి కాలువలో పడేసారంటున్న పోస్టులో షేర్ చేసిన వార్తా కథనం అక్టోబర్ 2017లో ప్రసారమైంది. ఈ కథనంలో కాలువలో పడేసిన ఖురాన్‌ను ఒక స్థానిక విద్యార్థి గుర్తించినట్టు రిపోర్ట్ చేసారు. 

ఐతే వార్తా కథనంలో రిపోర్ట్ చేసిన దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇవే ఫోటోను ప్రచురించిన ఒక 2013 న్యూస్ బ్లాగ్ మాకు కనిపించింది. ఈ కథనంలో కూడా పైన తెలిపిన విధంగానే తైఫ్ పట్టణంలో ఖురాన్‌ను మురికి కాలువలో పడేసారంటూ ఈ ఫోటోని ప్రచురించింది. దీన్నిబట్టి పోస్టులో షేర్ చేసిన న్యూస్ రిపోర్ట్ నిజానికి 2013 లేదా అంతకన్న ముందు జరిగిన ఘటనకు సంబంధించిందని స్పష్టమవుతుంది.

ఐతే 2013లో గానీ లేక 2017లో ఈ వార్త తిరిగి ప్రసారమైనప్పుడుగానీ, అసలు ఈ ఘటనకు సంబంధించి ఎవరు, ఎందుకు చేసారనే విషయాలకు సంబంధించి ఎటువంటి సమాచారం లభించలేదు. ప్రముఖ వార్తా సంస్థలేవి కూడా ఈ వార్తను ప్రచురించిన ఆధారాలు కూడా లేవు.

2019లో కూడా ఇలానే సౌదీలోని ఖైబర్ పట్టణంలో ఖురాన్‌ను అపవిత్రం చేసారంటూ పలు సంస్థలు బ్లాగ్స్ ప్రచురించాయి (ఇక్కడ మరియు ఇక్కడ). ఐతే ఈ ఘటనకి సంబంధించి పూర్తి వివరాలు తెలియనప్పటికీ, ఈ ఘటనపై సౌదీ అరేబియా ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ ఘటనను ఖండిస్తూ, దోషులను శిక్షిస్తామని తెలిపినట్టు పలు న్యూస్ బ్లాగ్స్ రిపోర్ట్ చేసాయి.

ఐతే పైన తెలిపిన ఏఒక్క ఘటనకు సంబంధించి కచ్చితమైన సమాచారం లభించలేదు. కాకపోతే పోస్టులో షేర్ చేసిన వైరల్ వీడియో మాత్రం ఇప్పటిది కాదని మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు. పైగా ఇటీవల అరబ్ దేశాల్లో ఇలా ఖురాన్‌ను పడేసిన ఘటనలు జరిగినట్టు ఎటువంటి విశ్వసనీయ వార్తా కథనాలు కూడా లేవు.

చివరగా, అరబ్ దేశాల్లో ఖురాన్‌ను మురుగు కాలువల్లో పడేస్తున్నరంటూ ఒక పాత వీడియోని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll