ఇటీవల వెల్లడైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో బీజేపీ 58 స్థానాలలో 2 వేల ఓట్ల తేడాతో, 41 స్థానాల్లో వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోయిందని చెప్తున్న వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కర్ణాటక ఎన్నికల ఫలితాలలో బీజేపీ 58 స్థానాలలో 2 వేల ఓట్ల తేడాతో, 41 స్థానాల్లో వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోయింది.
ఫాక్ట్(నిజం): కర్ణాటక ఎన్నికలలో 2వేల వోట్ల లోపు మెజారిటీతో అభ్యర్థులు గెలిచిన స్థానాలు కేవలం 12 మాత్రమే. కాగా ఈ 12 స్థానాలలో, 7 బీజేపీ గెలుపొందగా, మిగిలిన 5 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే ఈ ఎన్నికల్లో రెండు వేల ఓట్ల తేడాతో బీజేపీ ఓడిపోయిన స్థానాలు కేవలం 5 మాత్రమే. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
కర్నాటక ఎన్నికల ఫలితాలు ఇటీవల 13 మే 2023న విడుదల అయ్యాయి. మొత్తం 224 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 135 స్థానాల్లో గెలుపొందగా, బీజేపీ 66 స్థానాల్లో గెలుపొందింది.
ఐతే వైరల్ పోస్టులో చెప్తున్నట్టు బీజేపీ చాలా స్థానాల్లో స్వల్ప (1-2 వేల వోట్ల) తేడాతో ఓడిపోయిందన్న వార్తలో నిజం లేదు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకారం అసలు మొత్తం స్థానాలలో 2వేల వోట్ల లోపు మెజారిటీతో అభ్యర్థులు గెలిచిన స్థానాలు కేవలం 12 మాత్రమే. ఈ స్థానాల వివరాలు కింది చార్ట్‌లో చూడొచ్చు.
కాగా ఈ 12 స్థానాలలో 7 బీజేపీ గెలుపొందగా, మిగిలిన ఐదు స్థానాలలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే ఈ ఎన్నికల్లో రెండు వేల ఓట్ల తేడాతో బీజేపీ ఓడిపోయిన స్థానాలు కేవలం ఐదు మాత్రమే. పైగా ఈ ఐదు స్థానాలలో కూడా బీజేపీ వెయ్యిలోపు వోట్ల తేడాతో ఓడిపోయింది. 1000-2000 మధ్య వోట్ల తేడాలో బీజేపీ ఒక్క సీటులో కూడా ఓడిపోలేదు.
ఇకపోతే 2000-3000 వోట్ల తేడాతో 11 స్థానాల్లో అభ్యర్థులు గెలుపొందగా, వీరిలో ఆరుగురు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కాగా, కేవలం ముగ్గురు మాత్రమే బీజేపీకి చెందినవారు ఉన్నారు. మీగాతా ఇద్దరు జేడీఎస్ పార్టీకి చెందిన వారు.
చివరగా, కర్ణాటక ఎన్నికల్లో రెండు వేల ఓట్ల తేడాతో బీజేపీ ఓడిపోయిన స్థానాలు కేవలం ఐదు మాత్రమే.