Fake News, Telugu
 

ఉగ్రవాదులను అంతం చేస్తున్నందుకు నెతన్యాహును సౌదీ రాజు వీడియో కాల్ ద్వారా అభినందిస్తున్న వీడియో అని ఒక పాత, సంబంధంలేని వీడియోని తప్పుగా షేర్ చేస్తున్నారు

0

హమాస్ నేత యాహ్యా సిన్వార్ మరణం నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి ఒక వ్యక్తితో వీడియో కాల్ మాట్లాడుతున్న వీడియో (ఇక్కడ మరియు ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉగ్రవాదులను నాశనం చేస్తున్నందుకు తనకు వీడియో కాల్ ద్వారా సౌదీ రాజు అభినందనలు తెలుపుతున్నప్పుడు తీసిన వీడియో ఇది అని క్లెయిమ్ చేస్తూ నెటిజన్లు ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. అసలు ఇందులో ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

ఈ వీడియో యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు. 

క్లెయిమ్: ఉగ్రవాదులను అంతం చేస్తున్నందుకు నెతన్యాహును వీడియో కాల్ ద్వారా సౌదీ రాజు అభినందించడాన్ని ఈ వీడియో చూపిస్తుంది.

ఫ్యాక్ట్(నిజం): ఈ వీడియో 2019 నాటిది. ఇందులో నెతన్యాహూతో వీడియో కాల్ మాట్లాడుతున్న వ్యక్తి సౌదీ అరేబియాకి చెందిన ఒక బ్లాగర్ అని అప్పటి వార్తా కథనాలు పేర్కొన్నాయి. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

వైరల్ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలను తెలుసుకోవడానికి తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికితే, ఇటీవల సౌదీ రాజు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహూతో వీడియో కాల్ మాట్లాడారు అని చెప్పడానికి ఎక్కడా ఆధారాలు లభించలేదు.

పోస్టులో షేర్ చేస్తున్న వీడియో గురించి తెలుసుకోవడానికి అందులోని కొన్ని కీ ఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ వీడియో యొక్క అసలు వెర్షన్ మాకు దొరికింది, ఇది 2019 నాటిది. Al Mayadeen మరియు TRT Arabic అనే వార్తా సంస్థలు ఈ వీడియోని తమ అధికారిక వెరిఫైడ్ యూట్యూబ్ ఛానెళ్లలో 2019లో అప్లోడ్ చేశారు. 

ఈ విషయానికి సంబంధించి వచ్చిన వార్తా కథనాల(ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) ప్రకారం, సౌదీ అరేబియా బ్లాగర్ ‘మహమ్మద్ సౌద్’తో నెతన్యాహూ వీడియో కాల్ ద్వారా మాట్లాడటం ఈ వీడియో చూపిస్తుంది. ఈ సంఘటన డిసెంబర్ 2019లో జరిగింది. మహమ్మద్ సౌద్ ఇజ్రాయెల్ దేశం మద్దతుదారు. 

వార్తా కథనాల ప్రకారం మహమ్మద్ సౌద్, నెతన్యాహుతో తను మాట్లాడిన సంఘటన గురించి ‘X’లో ట్వీట్ చేశాడు. కానీ, తన పాత అకౌంట్ ఇప్పుడు సస్పెండ్ అయ్యి ఉండటం(తన కొత్త అకౌంట్ ఇక్కడ చూడవచ్చు) వల్ల ఈ లింక్ పనిచేయడం లేదు.

దీని ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ ట్వీటులో తను ఈ వీడియోను పోస్ట్ చేస్తూ, నెతన్యాహూ తనకి కాల్ చేశాడని చెప్పాడు. నెతన్యాహూ నెగ్గి, మిడిల్ ఈస్ట్ దేశాలకి శాంతిని తీసుకొస్తాడు అని తను కోరుకుంటున్నాను అని ఈ ట్వీట్ ద్వారా సౌద్ తెలిపాడు.

చివరిగా, సౌదీకి చెందిన మహమ్మద్ సౌద్ అనే ఒక బ్లాగర్‌తో నెతన్యాహూ వీడియో కాల్ ద్వారా మాట్లాడిన 2019 నాటి ఒక వీడియోను, ఇటీవల సౌదీ రాజుతో వీడియో కాల్ ద్వారా నెతన్యాహూ మాట్లాడిన దృశ్యాలు అని తప్పుగా షేర్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll