“పారిస్ ఒలింపిక్స్ 2024లో అత్యుత్తమ ‘నైతిక విలువలు’ ప్రదర్శించిన స్పానిష్ ఆటగాడు. కెన్యా ఆటగాడు రన్నింగ్ రేసులో ముందున్నాడు, గెలుస్తున్నాడు. ముందు గీతను చూసి రేసు చరమ గీత (విన్నింగ్ లైన్) అనుకుని ఆగిపోయాడు, భాష రాదు కాబట్టి అదే విన్నింగ్ రేఖ అనుకుని ఆగిపోయాడు. కానీ వెనకాలే పరుగెడుతున్న స్పానిష్ రన్నర్ కెన్యా రన్నర్ ను ‘ఇంకా పరుగెత్తాలి’ అంటూ కెన్యా ఆటగాడిని ముందుకు తోసి ఆ రేస్ కెన్యా ఆటగాడే గెలిచేలా చేశాడు” అంటూ ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: 2024 పారిస్ ఒలింపిక్స్‌లో భాష రాక అదే విన్నింగ్ రేఖ అనుకుని ఆగిపోయన కెన్యా రన్నర్ ను, వెనకాలే పరుగెడుతున్న స్పానిష్ రన్నర్ ఇవాన్ ఫెర్నాండెజ్ అత్యుత్తమ ‘నైతిక విలువలు’ ప్రదర్శిస్తూ కెన్యా రన్నర్ ను ‘ఇంకా పరుగెత్తాలి’ అంటూ ముందుకు తోసి ఆ రేస్ కెన్యా ఆటగాడే గెలిచేలా చేశాడు.
ఫాక్ట్(నిజం): ఈ సంఘటన 2024 పారిస్ ఒలింపిక్స్‌లో జరగలేదు. ఈ సంఘటన 02 డిసెంబర్ 2012లో స్పెయిన్ దేశంలోని అనయా నవర్రేలోని బుర్లాడాలో జరిగిన క్రాస్ కంట్రీ రేసులో జరిగింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ క్లయిమ్ కు సంబంధించిన సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఘటననుకు సంబంధించిన పలు రిపోర్ట్స్ లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఇందులో కొన్ని వైరల్ పోస్టులోని ఫోటోను కూడా పబ్లిష్ చేసాయి. ఈ రిపోర్ట్స్ ప్రకారం, 02 డిసెంబరు 2012న స్పెయిన్ దేశంలోని అనయా నవర్రేలోని బుర్లాడాలో క్రాస్ కంట్రీ రేసులో ఈ సంఘటన జరిగింది. ఈ రేసులో స్పానిష్ అథ్లెట్ ఇవాన్ ఫెర్నాండెజ్ రేసులో అందరికన్నా ముందు ఉన్న కెన్యాకు చెందిన రన్నర్ అబెల్ ముతాయ్ కంటే కొంత దూరం వెనుకబడి రెండవ స్థానంలో ఉన్నాడు. వారు ఇద్దరు ఫినిషింగ్ లైన్ కు సమీపించగానే, అక్కడ ఉన్న ఒక గీతను చూసి అదే ఫినిషింగ్ లైన్(Finishing line) అని అనుకుని పొరపాటుగా ముగింపుకు 10 మీటర్ల ముందు పరుగు పూర్తైందనే ఆలోచనతో కెన్యా రన్నర్ అబెల్ ముతాయ్ ఆగిపోయాడు. అతని వెనుకే వస్తున్న ఇవాన్ ఫెర్నాండెజ్, అబెల్ ముతాయ్ ను పట్టించుకోకుండా ముందుకు పరిగెత్తి ఉంటే బంగారు పతకం గెలిచేవాడు. కానీ అతను ఆ పని చేయలేదు. అతనిలో ఉన్న మానవత్వం అతన్ని ముందుకు వెళ్లనివ్వలేదు. బదులుగా, అతను వెనుక ఉండి, సంజ్ఞలను చేస్తూ కెన్యా రన్నర్ అబెల్ ముతాయ్ ను ఫినిషింగ్ లైన్ వైపు నడిపించాడు మరియు అతనిని ముందుగా ఫినిషింగ్ లైన్ దాటేలా చేశాడు. ఫలితంగా అబెల్ ముతాయ్ అసలైన ఫినిషింగ్ లైన్ ను చేరుకుని ఈ రేసులో బంగారు పతకాన్ని సాధించాడు. ఇవాన్ ఫెర్నాండెజ్ రన్నరప్ గా నిలిచాడు. ఈ రేసుకు సంబంధించిన పలు వీడియో క్లిప్స్ పారిస్ ఒలింపిక్స్ కన్న చాలా ఏళ్ల ముందు నుండే యూట్యూబ్‌లో ఉన్నాయి (ఇక్కడ). దీన్ని బట్టి ఈ ఘటన 2024 పారిస్ ఒలింపిక్స్‌లో జరగలేదు అని స్పష్టమవుతుంది.
తదుపరి మేము ఈ ఇద్దరు అథ్లెట్లు అనగా ఇవాన్ ఫెర్నాండెజ్, అబెల్ ముతాయ్ 2024 పారిస్ ఒలింపిక్స్‌లో ఫాల్గొన్నారా అని పారిస్ ఒలింపిక్స్ అధికారిక వెబ్‌సైట్‌లో వెతకగా, వీరిద్దరూ 2024 పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనలేదని తెలిసింది. స్పెయిన్ కు చెందిన ఇవాన్ ఫెర్నాండెజ్ ఇంతవరకు ఎప్పడూ ఒలింపిక్స్‌లో పాల్గొనలేదని తెలిసింది. అలాగే, కెన్యాకు చెందిన అబెల్ ముతాయ్ 2012లో జరిగిన లండన్ ఒలింపిక్స్‌లో 3,000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో కాంస్య పతక విజేత అని తెలిసింది.
అలాగే మేము ఇవాన్ ఫెర్నాండెజ్ యొక్క అధికారిక ఇన్‌స్టాగ్రామ్ కనుగొన్నాము. 02 డిసెంబర్ 2023న వైరల్ పోస్టులోని ఒక ఫొటోను ఇవాన్ పోస్టు చేసినట్లు మేము గుర్తించాము. ఈ ఫోటో యొక్క వివరణలో, ఈ ఫోటో 02 డిసెంబర్ 2012లో జరిగిన రేసుకు సంబంధించింది అని, ఈ ఫొటోలో ఇవాన్ తో పాటు ఉన్నది అబెల్ అని పేర్కొన్నాడు. అలాగే, ఇవాన్ తన X(ట్విటర్)లో కూడా ఈ ఫొటోను తరచూ షేర్ చేస్తున్నట్లు మేము గుర్తించాము (ఇక్కడ).
చివరగా, స్పానిష్ రన్నర్ ఇవాన్ ఫెర్నాండెజ్ కెన్యా రన్నర్ అబెల్ ముతాయ్ మధ్య 2012లో జరిగిన సంఘటనను 2024 పారిస్ ఒలింపిక్స్‌లో జరిగినట్లుగా తప్పుగా షేర్ చేస్తున్నారు.