Fake News, Telugu
 

UPI పేమెంట్స్‌ పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతూ ఇటీవల RBI తీసుకున్న నిర్ణయం కేవలం UPI ద్వారా చేసే పన్ను చెల్లింపులకు మాత్రమే వర్తిస్తుంది

0

దేశంలో UPI లావాదేవీ పరిమితి రూ.1 లక్ష నుండి రూ. 5 లక్షలకు పెంచారని, ఇప్పటినుండి 24 గంటల్లో 5 లక్షల రుపాయల మొత్తం వరకు UPI లావాదేవీలు చేయవచ్చని RBI తెలిపిందని ఒక వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ ఉంది (ఇక్కడ & ఇక్కడ).  ఈ కథనం ద్వారా ఆ వార్తకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: దేశంలో UPI లావాదేవీ పరిమితి రూ.1 లక్ష నుండి రూ. 5 లక్షలకు పెంచారు, ఇప్పటినుండి 24 గంటల్లో 5 లక్షల మొత్తం వరకు UPI లావాదేవీలు చేయవచ్చు – RBI

ఫాక్ట్(నిజం): UPI పేమెంట్స్‌ పరిమితిని రూ.1 లక్ష నుండి రూ.5 లక్షల వరకు పెంచుతూ ఇటీవల RBI తీసుకున్న నిర్ణయం కేవలం UPI ద్వారా చేసే పన్ను చెల్లింపులకు మాత్రమే వర్తిస్తుంది. సాధారణ (ఒక వ్యక్తి మరో వ్యక్తికి P2P ) చేసే నగదు బదిలీ రోజువారీ పరిమితికి సంబంధించి RBI ఎలాంటి మార్పులు చేయలేదు. సాధారణ (P2P) నగదు బదిలీ రోజువారీ పరిమితి ఇప్పటికీ రూ.1 లక్ష మాత్రమే. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

RBI ప్రకటన:

ఇటీవల 08 ఆగస్ట్ 2024 నాడు మానిటరీ పాలసీ కమిటీ భేటీలో UPI ద్వారా పన్ను చెల్లింపుల పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు UPI ద్వారా పన్ను చెల్లింపుల పరిమితి రూ.1 లక్ష ఉండగా, దీనిని ఇప్పుడు 5 లక్షలకు పెంచారు. అంటే ఇకపై వ్యక్తిగత ఆదాయపు పన్ను, ఆస్తి పన్ను, ముందస్తు పన్ను చెల్లింపులు చేసేవారు ఒక లావాదేవీలో రూ.5 లక్షల వరకు UPI ద్వారా చెల్లించే అవకాశం ఉంది.

అలాగే UPI పేమెంట్స్‌కు సంబంధించి  ‘డెలిగేటెడ్ పేమెంట్స్‌’ అనే కొత్త ఫీచర్ ను కూడా RBI ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ప్రకారం ఒక UPI వినియోగదారు తన బ్యాంక్ అకౌంట్ నుంచి నిర్ధేశిత పరమితి వరకూ UPI పేమెంట్స్ చేసేందుకు మరో వ్యక్తికి అధికారమివ్వవచ్చు.

సాధారణ UPI ట్రాన్సాక్షన్ పరిమితిలో ఎలాంటి మార్పు లేదు:

ఐతే RBI తీసుకున్న ఈ నిర్ణయం కేవలం UPI ద్వారా పన్ను చెల్లింపులకు మాత్రమే వర్తిస్తుంది. సాధారణ (ఒక వ్యక్తి మరో వ్యక్తికి P2P ) నగదు బదిలీ రోజువారీ పరిమితికి సంబంధించి RBI ఎలాంటి మార్పులు చేయలేదు. సాధారణ (P2P) నగదు బదిలీ రోజువారీ పరిమితి (లిమిట్‌) ఇప్పటికీ రూ.1 లక్ష మాత్రమే. అంటే ఇప్పుడు కూడా ఒక వ్యక్తి మరో వ్యక్తికి (P2P) ఒక రోజులో UPI ద్వారా రూ.1 లక్ష వరకు మాత్రమే ట్రాన్స్‌ఫర్‌ చేయగలరు.

ఐతే ఒక రోజులో UPI ద్వారా ట్రాన్స్‌ఫర్‌ చేయగల మొత్తం ఆయా బ్యాంకులు, ఉపయోగిస్తున్న యాప్‌లపై కూడా ఆధారపడి ఉంటుంది. అయితే 24 గంటల్లో రూ.1 లక్ష కంటే ఎక్కువ UPI పేమెంట్‌ను ఏ బ్యాంకు అనుమతించదు. ఉదాహరణకు, HDFC, ICICI, Axis, వంటి బ్యాంకులు స్టాండర్డ్‌ ట్రాన్సాక్షన్లకు రూ.1 లక్ష వరకు UPI పేమెంట్స్‌ అనుమతిస్తాయి. అయితే సహకార బ్యాంకుల వంటి చిన్న బ్యాంకులు  రూ. 20,000 వరకు మాత్రమే  UPI పేమెంట్స్‌ అనుమతిస్తాయి.

ముందు కూడా లక్షకు మించి UPI పేమెంట్స్‌ చేసేవారు:

ఐతే అంతకుముందు, క్యాపిటల్ మార్కెట్లు, బీమా, మొదలైన చెల్లింపులకు సంబంధించి రూ.2 లక్షల వరకు UPI ద్వారా చేసుకునే వెసులుబాటును RBI కల్పించింది. అలాగే  IPOలలో పెట్టుబడి, రిటైల్ డైరెక్ట్ స్కీంలలో ఒక్క ట్రాన్సాక్షన్‌కు యూపీఐ ద్వారా రూ.5 లక్షలు చెల్లించే అవకాశం కూడా కల్పించింది (ఇక్కడ).

చివరగా, UPI పేమెంట్స్‌ పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతూ ఇటీవల RBI తీసుకున్న నిర్ణయం కేవలం UPI ద్వారా చేసే పన్ను చెల్లింపులకు మాత్రమే వర్తిస్తుంది.

Share.

About Author

Comments are closed.

scroll