“యోగా బలంతో ఆకాశంలో ఎగురుతూ చూపించాడు. హనుమాన్ జీ ఊహాజనితమని పిలిచే వారు ఇప్పుడేమంటారు?” అని అడుగుతూ ఒక వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: యోగా బలంతో ఆకాశంలో ఎగురుతున్న వ్యక్తి యొక్క వీడియో.
ఫాక్ట్: వీడియోలో ఉన్న వ్యక్తి పేరు విఘ్నేశ్ ప్రభు. తను ఒక మెజీషియన్. వీడియోలో కనిపిస్తున్నది ఒక ఇల్యూషన్. కావున పోస్ట్‌లో చెప్పింది తప్పు.
పోస్ట్‌లోని వీడియోలో 3:37 సమయం దగ్గర ఎగురుతున్న వ్యక్తి పేరు ‘విఘ్నేశ్ ప్రభు’ అని ఒక అమ్మాయి చెపుతుంది. ఆ పేరుతో ఇంటర్నెట్లో వెతకగా, వీడియోలో ఎగురుతున్న వ్యక్తి ‘విఘ్నేశ్ ప్రభు’ అని, తను ఒక మెజీషియన్ అని తెలుస్తుంది. తన ఫేస్బుక్ అకౌంట్లో తను ఎగిరే వీడియోని పోస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే, తన పోస్ట్‌లో ఎక్కడా కూడా యోగా గురించి రాయలేదు.

అంతేకాదు, తన వెబ్సైట్లో తను ఎగిరే వీడియోకి సంబంధించిన ఫోటో ఒకటి పెట్టి, ‘ది ఇల్యూషన్ షో’ అని రాసినట్టు చూడవచ్చు.

అంతేకాదు, వీడియోలో తను ఎలా ఎగరగలిగాడో ‘Magic Secrets Revealed’ వారు పెట్టిన ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. క్రేన్ మరియు వైర్ల సహాయంతో మనిషిని పైకి లేపినట్టు వీడియోలో చూడవచ్చు. అయితే, అవి కనపడకుండా జాగ్రత్త తీసుకుంటారని తెలుస్తుంది.

చివరగా, వీడియోలోని వ్యక్తి ఒక మెజీషియన్ మరియు కనిపిస్తున్నది ఒక ఇల్యూషన్. తను యోగా సహాయంతో గాలిలోకి ఎగరలేదు.