“కాంగ్రెస్ వస్తే బిడ్డ మీ కరెంట్ ఉడబీకుతా. మీకు ఫ్యూసులే ఉండవు బిడ్డ. మీ మోటర్లు కాలుతాయి, మీ ట్రాన్స్‌ఫార్మర్లు పేలుతాయి”, అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక బహిరంగసభలో ప్రజలను బెదిరిస్తున్న దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కాంగ్రెస్ గెలిస్తే కరెంట్ కొత విధిస్తానని రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రజలను బెదిరిస్తున్న దృశ్యాలు.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో ఎడిట్ చేయబడినది. కాంగ్రెస్ వర్ధన్నపేట సభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్నప్పుడు తీసిన వేర్వేరు వీడియో క్లిప్పులను జోడిస్తూ ఈ వీడియోని రూపోందించారు. అసలు వీడియోలో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మరియు ఇంకొందరి భారాస నేతల కరెంట్ ఉడబీకుతానని వ్యాఖ్యలు చేశారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం కీ పదాలను ఉపయోగించి వెతికితే, ఈ వీడియో ఇటీవల వర్ధన్నపేటలో జరిగిన కాంగ్రెస్ సభలోని దృశ్యాలను చూపిస్తున్నట్టు తెలిసింది. వర్ధన్నపేట కాంగ్రెస్ సభలో రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రసంగాన్ని NTV వార్తా సంస్థ 14 నవంబర్ 2023 నాడు పబ్లిష్ చేసిన వీడియోలో చూడవచ్చు.
ఈ వీడియోలోని 42:27 టైమ్ స్టాంప్ దగ్గర నుండి, రేవంత్ రెడ్డి, “ఇయ్యాల ఆయన అంటుండు.. నిన్న మొన్న ఎడ చూసిన.. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని. నేను చెప్పదలుచుకున్న, ఆ సన్నాసులకు. కాంగ్రెస్ వస్తే బిడ్డా మీ కరెంట్ ఉడబీకుతా నేను అని చెబుతున్నా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు. కాంగ్రెస్ రాగానే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, దయాకర్ రావు, కవిత రావు కరెంట్ ఉడబీకుతా. మీకు ఫ్యూసులే ఉండవు బిడ్డ. మీ మోటర్లు కాలుతాయి, మీ ట్రాన్స్‌ఫార్మర్లు పేలుతాయని చెప్పి ఈ వర్ధన్నపేట గడ్డపై నిలిచోని నేను చెప్పదలుచుకున్న.”, అని వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్నప్పుడు తీసిన వేర్వేరు వీడియో క్లిప్పులను ఎడిట్ చేస్తూ ఈ వీడియోని రూపొందించారని పై వివరాల ఆధారంగా ఖచ్చితంగా చెప్పవచ్చు.
చివరగా, ఎడిట్ చేసిన వీడియోని కాంగ్రెస్ గెలిస్తే కరెంట్ కొత విధిస్తానని రేవంత్ రెడ్డి ప్రజలను బహిరంగంగా బెదిరిస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.