Fake News, Telugu
 

రేవంత్ రెడ్డి బీర్ల ఐలయ్య భూభాగోతాన్ని ప్రచారం చేస్తూ ఓట్లు అడుగుతున్న దృశ్యాలుగా షేర్ చేస్తున్న ఈ వీడియో ఎడిట్ చేయబడినది

0

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఆలేరు కాంగ్రెస్ అభ్యర్ధి బీర్ల ఐలయ్య భూభాగోతాన్ని ప్రచారం చేస్తూ ప్రజలను ఓట్లు అడుగుతున్న దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా షేర్ అవుతోంది. ఈ వీడియోలో రేవంత్ రెడ్డి, “యాడ భూములు ఉన్న.. ఎనకటికి అనుకున్నాము. పెద్దలు చెబితే నాకు నమ్మకము ఉండేది కాదు. గుడిని, గుడిలో ఉండే లింగాన్ని మింగేటోడు ఉంటాడని. మీ ఆలేరులో యాదగిరి నరసింహా స్వామి చుట్టూతా పేదోళ్ల భూములు గుంజుకొని, అమ్ముకొని, అక్రమాలకు పాల్పడి, చివరికి నరసింహాస్వామిని కూడా మోసం చేసే బీర్ల ఐలయ్యను మీరు గెలిపించండి.”, అని బహిరంగసభలో వ్యాఖ్యలు చేసినట్టుగా ఉంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.  

క్లెయిమ్: ఆలేరు కాంగ్రెస్ అభ్యర్ధి బీర్ల ఐలయ్య భూభాగోతాన్ని ప్రచారం చేస్తూ రేవంత్ రెడ్డి ప్రజలను ఓట్లు అడుగుతున్న దృశ్యాలు.     

ఫాక్ట్ (నిజం): ఈ వీడియో ఎడిట్ చేయబడినది. అసలు వీడియోలో రేవంత్ రెడ్డి, ఆలేరు బీఆర్ఎస్ అభ్యర్ధి సునీత యాదగిరిగుట్టలో భూఅక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ, ప్రజలు బీర్ల ఐలయ్యను 30 వేల మెజారిటీతో గెలిపించాలని కోరారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో కోసం సంబంధిత కీ పదాలను ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికితే, ఈ వీడియోలోని దృశ్యాలు, 24 నవంబర్ 2023 నాడు ఆలేరు కాంగ్రెస్ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్నప్పుడు తీసినవని తెలిసింది. ఆలేరు కాంగ్రెస్ సభలో రేవంత్ రెడ్డి పూర్తి ప్రసంగం వీడియోని ఇక్కడ చూడవచ్చు.

ఈ వీడియోలోని 1:29:06 నిమిషాల దగ్గర, రేవంత్ రెడ్డి ఆలేరు బీఆర్ఎస్ అభ్యర్ధి సునీత భూఅక్రమాల గురించి వివరిస్తూ, “ఇగా అమ్మగారు. ఓటు ఆమెకేస్తే ఇంటాయన కూడా ఎక్స్‌స్ట్రా దొరికిండు మిమ్మల్ని దోచుకోవడానికి యాడ భూములు ఉన్న..ఎనకటికి అనుకున్నాము.. పెద్దలు చెబితే నాకు నమ్మకము ఉండేది కాదు. గుడిని, గుడిలో ఉండే లింగాన్ని మింగేటోడు ఉంటాడని. మీ ఆలేరులో సునీతను, ఆమె భర్తను చూసిన తర్వాత, యాదగిరి నరసింహా స్వామి చుట్టూతా పేదోళ్ల భూములు గుంజుకొని, అమ్ముకొని, అక్రమాలకు పాల్పడి, చివరికి నరసింహాస్వామిని కూడా మోసం చేసే జాతి. అందుకే, ఖచ్చితంగా ఈ ఆలేరులో ఓడించాలి. లక్ష్మీ నరసింహా స్వామికి మొక్కు చెల్లించుకోవాలి.”

అసలు వీడియోలో, రేవంత్ రెడ్డి, ఆలేరు బీఆర్ఎస్ అభ్యర్ధి సునీత యాదగిరిగుట్టలో పలు భూఅక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ, ప్రజలు అందుకే ఆమెను 30 వేల మెజారిటీతో ఓడించాలని ప్రజలను కోరారు. బీర్ల ఐలయ్య భూఅక్రమాలకు పాల్పడినట్టు రేవంత్ రెడ్డి ఆలేరు బహిరంగసభలో ఎక్కడా పేర్కొనలేదు. అసలు వీడియోని ఎడిట్ చేసి పోస్టులో షేర్ చేసిన వీడియోని రూపొందించారని పై వివరాల ఆధారంగా ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, రేవంత్ రెడ్డి బీర్ల ఐలయ్య భూభాగోతాన్ని ప్రచారం చేస్తూ ఓట్లు అడుగుతున్న దృశ్యాలుగా షేర్ చేస్తున్న ఈ వీడియో ఎడిట్ చేయబడినది.

Share.

About Author

Comments are closed.

scroll