వక్ఫ్ సవరణ చట్టం, 2025ని వ్యతిరేకిస్తూ, ఏప్రిల్ 2025లో పశ్చిమ బెంగాల్లోని చాలా చోట్ల నిరసనలు జరిగాయి. ముర్షిదాబాద్ జిల్లాలో ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారి, గొడవలు, అల్లర్లు కూడా జరిగాయని వార్తా కథనాలు పేర్కొన్నాయి(ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). వార్తా కథనాల ప్రకారం(ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ), పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో జరిగిన ఈ గొడవల కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు, ఇందులో చందన్ దాస్, హరగోబింద్ దాస్ అనే ఇద్దరు హిందువులు ఒక మూక దాడిలో మరణించగా, ఒక ముస్లిం వ్యక్తి పోలీసు కాల్పుల్లో చనిపోయాడు. ముర్షిదాబాద్ జిల్లాలో జరుగుతున్న ఈ హింసను తప్పించుకోవడానికి వందలాది హిందువులు తమ ఇళ్లను వదిలి, ఆశ్రయం పొందడానికి మాల్డా నగరానికి చేరుకున్నారు(ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). పరస్థితిని అదుపులోకి తీసుకురావడానికి జంగిపూర్‌లో కేంద్ర బలగాలని మోహరించాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది(ఇక్కడ, ఇక్కడ). ఈ అల్లర్లకు సంబంధించి సుమారు 150 పైగా వ్యక్తులు అరెస్ట్ అయ్యారు (ఇక్కడ, ఇక్కడ).
ఈ నేపథ్యంలో, పశ్చిమ బెంగాల్‌లో ఇద్దరు ముస్లిం వ్యక్తులు ఒక దుకాణాన్ని ధ్వంసం చేస్తుండగా భారత సైనిక సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నట్లు క్లెయిమ్ చేస్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: పశ్చిమ బెంగాల్‌లో ఇద్దరు ముస్లిం వ్యక్తులు ఒక దుకాణాన్ని ధ్వంసం చేస్తుండగా భారత సైనిక సిబ్బంది వారిని అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వీడియోకు, పశ్చిమ బెంగాల్‌కు ఎటువంటి సంబంధం లేదు. ఇది బంగ్లాదేశ్ సైనిక సిబ్బంది ఒక దుకాణాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాలను చూపిస్తుంది. రిపోర్ట్స్ ప్రకారం, ఈ సంఘటన 14 ఆగస్టు 2024న బంగ్లాదేశ్‌లోని ఫరీద్‌పూర్ జిల్లాలోని బోల్మారి ఉపజిల్లాలో జరిగింది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP)కి చెందిన రెండు వర్గాల మధ్య జరిగిన వివాదం నేపథ్యంలో ఈ దాడి జరిగింది. ఒక వర్గానికి చెందిన వ్యక్తులు మరొక వర్గానికి చెందిన దుకాణాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తుండగా, ఇంతలో, బంగ్లాదేశ్ సైనిక సిబ్బంది దాడిలో పాల్గొన్న వారిని అరెస్టు చేశారు. వార్త కథనాలు అరెస్టయిన వ్యక్తులను BNP యూత్ దళ్ కార్యకర్తలు మహ్మద్ టుతుల్ హుస్సేన్, దుఖు మియాగా గుర్తించాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ వీడియోకు సంబంధించిన మరింత సమాచారం కోసం, ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను రిపోర్ట్ చేస్తూ 17 ఆగస్టు 2024న ప్రచురించబడిన పలు వార్త కథనాలు (ఇక్కడ, ఇక్కడ) మాకు లభించాయి. ఈ కథనాలు ప్రకారం, 14 ఆగస్టు 2024న బంగ్లాదేశ్‌లోని ఫరీద్‌పూర్ జిల్లాలోని బోల్మారి ఉపజిల్లాలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP)కి చెందిన రెండు వర్గాల మధ్య జరిగిన వివాదం నేపథ్యంలో దాడి జరిగింది. ఒక వర్గానికి చెందిన వ్యక్తులు మరొక వర్గానికి చెందిన దుకాణాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఇంతలో, బంగ్లాదేశ్ సైనిక సిబ్బంది దాడిలో పాల్గొన్న వారిని అరెస్టు చేశారు.
ఈ సంఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి వెతకగా, పలు వార్త కథనాలు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) మాకు లభించాయి. ఈ కథనాలు ప్రకారం,బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) లోని రెండు వర్గాల మధ్య వివాదం ఫలితంగా, ఒక వర్గానికి చెందిన కార్మికులు ఫరీద్‌పూర్‌లోని బోల్మారి ఉపజిల్లా BNP అధ్యక్షుడు, జాతీయతాబాది స్వచ్ఛసేబక్ దళ్ ఉపజిల్లా శాఖ కన్వీనర్ సంజయ్ సాహా దుకాణంపై దాడి చేశారు. ఇంతలో, బంగ్లాదేశ్ సైనిక సిబ్బంది దాడిలో పాల్గొన్న వారిని అరెస్టు చేశారు. వార్త కథనాలు అరెస్టయిన వ్యక్తులను బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) యూత్ దళ్ కార్యకర్తలు మహ్మద్ టుతుల్ హుస్సేన్, దుఖు మియాగా గుర్తించాయి.

గతంలో ఇదే వీడియో భారత సైనిక సిబ్బందిపై ఆపాదిస్తూ వైరల్ అయినప్పుడు, Factly దానిని ఫాక్ట్-చెక్ చేసింది.
చివరిగా, ఆగస్టు 2024లో బంగ్లాదేశ్ సైనికులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాలను పశ్చిమ బెంగాల్ హింసకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు.