ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 50 మంది భజరంగ్‌దల్ కార్యకర్తలు ముగ్గురు క్రైస్తవ పాస్టర్లపై కర్రలతో దాడి చేసి విపరీతంగా కొట్టి 20 బైక్ లను తీసుకొనిపోయారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. వీడియోలో కొందరు వ్యక్తులు ఒక వ్యక్తిని రాడ్లతో కొడుతుండడం చూడొచ్చు. ఉత్తర భారతదేశంలో జరుగుతున్న మతోన్మాదుల దుశ్చర్య అంటూ కూడా ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఐతే ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో భజరంగ్‌దల్ కార్యకర్తలు క్రైస్తవ పాస్టర్లపై కర్రలతో దాడి చేస్తున్న వీడియో.
ఫాక్ట్(నిజం): ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని సంగ్రూర్ జిల్లాలో 2023లో జరిగింది. వ్యక్తిగత శత్రుత్వం కారణంగా సోను కుమార్ అనే వ్యక్తిపై ఆరుగురు వ్యక్తులు దాడి చేసారు. ఈ ఘటనకు సంబంధించిన వార్తా కథనాలు, పోలీసుల వివరణ మరియు FIR సమాచారంలో ఎక్కడ కూడా భజరంగ్‌దల్ ప్రస్తావన గానీ మతపరమైన కోణం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్స్‌ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇవే దృశ్యాలను ఫిబ్రవరి 2023లో ప్రచురించిన పలు వార్తా కథనాలు మాకు కనిపించాయి (ఇక్కడ & ఇక్కడ). ఈ కథనాల ప్రకారం వీడియోలోని ఘటన పంజాబ్ రాష్ట్రంలోని సంగ్రూర్ జిల్లా సునమ్లోని జగత్పురా గ్రామంలో చోటు చేసుకుంది.

జగత్పురా గ్రామంలో 37 ఏళ్ల సోను కుమార్ అనే వ్యక్తిపై వ్యక్తిగత శత్రుత్వం కారణంగా ఆరుగురు (కుల్దీప్ సింగ్, మణి సింగ్, మల్కిత్ సింగ్, లవీ సింగ్, అమృత్ సింగ్ మరియు గోపాల్ సింగ్) వ్యక్తులు దాడి చేసారని ఈ కథనాలు రిపోర్ట్ చేసాయి. బాధితుడు పోలీస్ ఇన్ఫార్మర్ అనే అనుమానంతోనే అతనిపై దాడి చేసారని ఈ కథనం రిపోర్ట్ చేయగా, పాత కక్షలతోనే బాధితుడిపై దాడి జరిగినట్టు ఈ కథనం రిపోర్ట్ చేసింది.
ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం వెతికే క్రమంలో పంజాబ్ పోలీస్ ఈ వీడియోకు సంబంధించి వివరణ ఇచ్చిన ఒక ట్వీట్ మాకు కనిపించింది. ఈ ట్వీట్ ప్రకారం ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ఆరుగురు నిందితులపై IPC సెక్షన్లు 307, 323, 324, 325, 506, 148, 149 కింద FIR రిజిస్టర్ చేసినట్టు తెలిసింది. ఐతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సెక్షన్లు అన్నీ కూడా హత్య ప్రయత్నం, దాడికు సంబంధించినవే కానీ మతపరమైన దాడులకు సంబంధించినవి కావు.
ఈ వివరాల ఆధారంగా వెతకగా ఈ ఘటనకు సంబంధించిన FIR మాకు లభించింది. ఐతే ఈ FIRలో కూడా ఈ దాడికు సంబంధించి మతపరమైన కోణం ఉన్నట్టు పేర్కొనలేదు. దీన్నిబట్టి, వైరల్ పోస్టుల్లో చెప్తున్నట్టు ఈ వీడియోలోని ఘటనకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి లేదా భజరంగ్దల్కు ఎలాంటి సంబంధం లేదని, అలాగే ఈ ఘటనలో ఎలాంటి మతపరమైన కోణం లేదని స్పష్టమవుతుంది.

చివరగా, పంజాబ్‌లో వ్యక్తిగత కారణాల వల్ల జరిగిన దాడికి సంబంధించిన వీడియోను ఛత్తీస్‌గఢ్/భజరంగ్దల్కు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు.