Fake News, Telugu
 

ఉక్రెయిన్‌పై సైనిక దాడిని రష్యాలోని చాలా మంది రాజకీయ నాయకులు, ప్రముఖ కళాకారులు వ్యతిరేకిస్తున్నారు

0

ప్రస్తుతం ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడి చేస్తున్న నేపథ్యంలో పుతిన్ తీసుకున్న ఈ నిర్ణయంతో రష్యాలోని ఒక్క రాజకీయ పార్టీ కూడా విరోధించలేదని క్లెయిమ్ చేస్తున్న పోస్టు ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఉక్రెయిన్‌పై సైనిక దాడి చేయాలని పుతిన్ తీసుకున్న నిర్ణయాన్ని రష్యాలోని ఒక్క రాజకీయ పార్టీ కూడా వ్యతిరేకించలేదు.

ఫాక్ట్ (నిజం): ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడిని వ్యతిరేకిస్తూ రష్యాలోని రాజకీయ నాయకులు, కళాకారులు, మొదలైనవారు చాలా మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. పుతిన్ మద్దతుదారులైన పలువురు పార్లమెంట్ సభ్యులు కూడా ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడిని భాహిరంగంగానే వ్యతిరేకించారు. ఇటీవల రష్యాలోని పలు నగరాలలో యుద్దానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించగా, పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేసినట్టు కూడా వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడిని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఐతే రష్యా అధ్యక్షుడు పుతిన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని రష్యాలోని చాలా మంది రాజకీయ నాయకులు, ప్రముఖ కళాకారులు (సంగీతకారులు, టీవీ స్టార్లు మొదలైనవారు) వ్యతిరేకిస్తున్నారు. ఉక్రెయిన్‌పై సైనిక దాడిని నిరసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నట్టు వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి.

రష్యాలో పుతిన్ మద్దతుదారులైన పలువురు పార్లమెంట్ సభ్యులు ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడిని వ్యతిరేకిస్తునట్టు వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి. కమ్యూనిస్ట్ పార్టీ ఎంపీ మిఖాయిల్ మత్వీవ్ ఉక్రెయిన్‌పై దాడిని భాహిరంగంగానే వ్యతిరేకించారు. రష్యా వెంటనే యుద్దాన్ని ఆపేయాలని ఆయన కోరారు. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ ఎ. నవల్నీ కూడా ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడిని ఖండించాడు. నవల్నీ మద్దతుదారులు దాడికి వ్యతిరేకంగా నిరసనలకు కూడా పిలుపునిచ్చారు.

ఇటీవల ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడిని వ్యతిరేకిస్తూ పలు నగరాలలో నిరసనలు నిర్వహిస్తున్న సుమారు 1700 మందిని రష్యా పోలీసులు అరెస్ట్ చేసినట్టు వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి.

అంతర్జాతీయంగా కూడా రష్యా చాలా విమర్శలు ఎదురుకుంటుంది. ఉక్రెయిన్‌పై దాడిని వ్యతిరేకిస్తూ ఇప్పటికే పలు దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. అలాగే పలు దేశాలు రష్యా విమానాలకు తమ గగనతలాన్ని నిరాకరించాయి. కాబట్టి పుతిన్ నిర్ణయాన్ని రష్యాలో ఎవరూ వ్యతిరేకించలేదన్న వాదన కరెక్ట్ కాదు.

చివరగా, ఉక్రెయిన్‌పై సైనిక దాడిని రష్యాలోని చాలా మంది రాజకీయ నాయకులు, ప్రముఖ కళాకారులు వ్యతిరేకిస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll