Fake News, Telugu
 

భారతీయ జవాన్లు మండుటెండలో ఆహారం చేస్తున్న నిజమైన ఫోటో అని చెప్తూ ఒక AI వాడి రూపొందించిన ఫోటోని షేర్ చేస్తున్నారు

0

“ఇండియా… పాకిస్తాన్ బోర్డర్ రాజస్థాన్ లోని బద్మేర్ లో 48° ఎండలో  విధి నిర్వహణ లో నడి రోడ్డుపై ఆహారం తింటున్న భారత ఆర్మీ మహిళా జవాన్ లు.,” అని చెప్తూ సోషల్ మీడియాలో ఒక ఫోటో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) వైరల్ అవుతోంది. అసలు ఇందులో ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

పోస్ట్ యొక్క ఆర్చైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు. 

క్లెయిమ్: పాకిస్తాన్ బార్డర్ వద్ద మన భారతీయ మహిళా జవాన్లు 48° ఎండలో భోజనం చేస్తున్న ఫోటో. 

ఫ్యాక్ట్(నిజం):  ఈ ఫోటో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి తయారు చేసిన ఫోటో, నిజమైనది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

మొదటిగా ఈ ఫోటోకి సంబంధించి ఏవైనా వార్తా కథనాలు వచ్చాయా అని ఇంటర్నెట్‌లో వెతకగా, మాకు దీనికి సంబంధించిన ఎటువంటి వార్తా కథనాలు దొరకలేదు. వైరల్ ఫోటోని తీక్షణంగా గమనించగా, అందులో చాలా లోటుపాట్లు ఉన్నట్టు మాకు అర్థమైంది. ముఖ్యంగా ఇటువంటి వ్యత్యాసాలు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్/AI ద్వారా తయారు చేసిన ఫోటోలలో ఉంటాయి(ఇక్కడ, ఇక్కడ). వాటిని ఇప్పుడు చూద్దాం. 

మొదటిగా, కూర్చొని ఉన్న  మహిళా జవాన్ల వెనుక నడుస్తున్న కొందరు జవాన్ల నీడలు అసలు ఫొటోలో కనిపించడం లేదు. భోజనం చేస్తున్న మహిళా జవాన్లలో అందరికంటే మధ్యలో ఉన్న ఆవిడ ఎడమ చెయ్యి సగానికి పైగా తను పట్టుకున్న గిన్నెలో కలిసిపోయింది. AI ద్వారా తయారు చేసిన ఫోటోలలో చేతులు, కాళ్ళు, ఇంకా వాటి వేళ్ళు సరిగ్గా జెనెరేట్ అవవు

అలానే, ఫోటోకి ఎడమ వైపున ముందు వరుసలు కూర్చొన్న జవాన్‌ భుజం పైన ఉన్న భారతీయ జండా చాలా వింతగా ఉంది. భారతీయ జండాలో ఉండే మూడు రంగులు కాకుండా, ఇందులో అనేక రంగులు ఉండటం గమనార్హం. తనకి ఎదురుగా కూర్చొన్న ఇంకో జవాన్‌కి అయితే ఏకంగా మూడు చేతులు ఉన్నాయి. 

అదనంగా, ఈ ఫోటోని మేము AI ద్వారా తయారు చేసిన ఫోటోలని కనిపెట్టే టూల్స్ ,‘Hive’ ఇంకా True Media ఉపయోగించి వీటి గురించి చూస్తే. ఇవి కచ్చితంగా AI ఉపయోగించి తయారు చేసిన ఫోటోలు అని అవి నిర్ధారించాయి. 

చివరిగా, ఒక AI వాడి రూపొందించిన ఫోటోన షేర్ చేస్తూ, మన భారతీయ మహిళా జవాన్లు మండుటెండలో ఆహారం చేస్తున్న నిజమైన ఫోటో అని తప్పుగా క్లెయిమ్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll