Fake News, Telugu
 

‘1857’ మొదటి స్వాతంత్ర్య పోరాటం సావర్కర్ లేకపోతే జరిగివుండేది కాదు అని అమిత్ షా అనలేదు

0

వీర్ సావర్కర్ లేకపోతే 1857 లో దేశంలో మొదటి స్వాతంత్ర్య పోరాటం జరిగివుండేది కాదు అని అమిత్ షా అన్నారని, కానీ సావర్కర్ పుట్టింది 1883 లో అయితే 1857 ఘటనకి సంబంధం ఎలా ఉంటుంది అని ఒక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ‘1857’ మొదటి స్వాతంత్ర్య పోరాటం సావర్కర్ లేకపోతే జరిగివుండేది కాదు అని అమిత్ షా అన్నాడు.

ఫాక్ట్: సావర్కర్ గురించి అమిత్ షా అలా అనలేదు. వీర్ సావర్కర్ లేకపోతే 1857 తిరుగుబాటు ఉద్యమం చారిత్రాత్మకం అయి ఉండేది కాదు, దానిని కూడా బ్రిటీష్ వారి కోణం నుండే చూసేవాళ్ళము, 1857 తిరుగుబాటును మొదటి స్వాతంత్ర్య పోరాటంగా మొట్టమొదట పేర్కొన్నది వీర్ సావర్కర్ అని అమిత్ షా వ్యాఖ్యానించాడు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.

అమిత్ షా సావర్కర్ గురించి ఏమి అన్నాడు అని గూగుల్ సెర్చ్ చేసినప్పుడు ‘ఇండియా టుడే’ వారి ఆర్టికల్ లభించింది. ఆ ఆర్టికల్ లో అమిత్ షా వారణాసి లో జరిగిన ఒక కార్యక్రమంలో ‘వీర్ సావర్కర్ లేకపోతే 1857 తిరుగుబాటు ఉద్యమం చారిత్రాత్మకం అయి ఉండేది కాదు’ అని అన్నట్లు తెలిసింది. అందులో ఎక్కడా కూడా 1857 మొదటి స్వాతంత్ర్య పోరాటంలో సావర్కర్ పాల్గొన్నాడని అమిత్ షా అన్నట్లుగా లేదు. మరింత సమాచారం కోసం వెతికినప్పుడు ‘ANI ’ వారి ట్వీట్ లభించింది. అందులో ఉన్న విషయం తెలుగు అనువాదం ఈ విధంగా ఉంది – ‘వీర్ సావర్కర్ లేకపోతే 1857 తిరుగుబాటు ఉద్యమం చారిత్రాత్మకం అయి ఉండేది కాదు, దానిని కూడా బ్రిటీష్ వారి కోణం నుండే చూసేవాళ్ళము. 1857 తిరుగుబాటును మొదటి స్వాతంత్ర్య పోరాటంగా మొట్టమొదట పేర్కొన్నది వీర్ సావర్కర్ ‘, అని అమిత్ షా వ్యాఖ్యానించాడు’.

ఆ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను చూసినప్పుడు కూడా అమిత్ షా ఇంతకముందు ట్వీట్ లో ఉన్న వ్యాఖ్యలే చేసినట్లుగా తెలుస్తుంది.

వినాయక్ దామోదర్ సావర్కర్ 28 మే 1883 భాగుర్ అనే గ్రామంలో జన్మించారు. సావర్కర్ రాసిన ‘ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, 1857’ అనే పుస్తకం అనేక మందికి ప్రేరణగా మారింది. ఈ పుస్తకం ప్రచురించబడక ముందే నిషేధించబడింది. సావర్కర్ హాలండ్ లో పుస్తకాన్ని ముద్రించగలిగాడు. ఇది తరువాత భారతదేశం, అమెరికా, జపాన్ మరియు చైనాలకు కల్పిత పేర్లతో కవర్లలో చుట్టబడి చేరుకుంది. ఈ పుస్తకం నుండి ప్రేరణ పొంది ఘదర్ పార్టీ నాయకులు కొమగాతమారు తిరుగుబాటును లేవనెత్తారు. భగత్ సింగ్ మరియు అతని సహచరులు 1928 లో అండర్ గ్రౌండ్ ఎడిషన్ ను తీసుకువచ్చారు. ఈ సమాచారం పార్లమెంట్ వారు సావర్కర్ పై రిలీజ్ చేసిన pdf లో ఉంటుంది.

చివరగా, ‘1857’ మొదటి స్వాతంత్ర్య పోరాటం సావర్కర్ లేకపోతే జరిగివుండేది కాదు అని అమిత్ షా అనలేదు.

Share.

About Author

Comments are closed.

scroll