కొందరు యువకులపై ఒక గుంపు దాడి చేస్తున్న వీడియోని ఇటీవల ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఒక ముస్లిం ముసలాయనని కొంత మంది యువకులు కొట్టిన సంఘటనకి ముడిపెడ్తున్నారు. ఆ సంఘటనలో ముసలాయన గడ్డం కట్ చేసిన నిందుతుల ఇళ్ళల్లోకి చొరబడి వారిని చితక బాదిన హిందూ, ముస్లిం సోదరులంటూ అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఘజియాబాద్ సంఘటన నిందుతులపై హిందువులు, ముస్లిములు దాడి చేసిన వీడియో.
ఫాక్ట్ (నిజం): ఈ వీడియో ఢిల్లీలోని జహంగీర్పురిలో కూరగాయలు అమ్ముకునే ఒక వ్యక్తి ఇంట్లో దోపిడీకి (మామూళ్లు వసూలుకి) వచ్చిన ముగ్గురు యువకుల్ని అక్కడి ప్రజలు పట్టుకొని కొట్టిన ఘటనకు సంబంధించింది, ఇదే విషయాన్ని చాలా వార్తా సంస్థలు కూడా రిపోర్ట్ చేసాయి. ఈ వీడియోకి ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో జరిగిన సంఘటనకి ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వీడియో ఢిల్లీలోని జహంగీర్పురిలో జరిగిన సంఘటనకు సంబంధించింది. ఈ వీడియోకి సంబంధించి మరింత సమాచారం కోసం గూగుల్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా ఈ వీడియోని రిపోర్ట్ చేసిన చాలా వార్తా కథనాలు మాకు కనిపించాయి. NDTV ప్రచురించిన కథనం ప్రకారం ఢిల్లీ లోని జహంగీర్పురిలో కూరగాయలు అమ్ముకునే ఒక వ్యక్తి ఇంట్లో దోపిడీకి (మామూళ్ల వసూలు) వచ్చిన ముగ్గురు యువకుల్ని అక్కడి ప్రజలు పట్టుకొని కొట్టారు, ఈ వీడియో ఆ ఘటనకు సంబంధించింది.
ఆ ముగ్గురు యువకుల్ని పోలీసులు అరెస్ట్ చేసి వారిపై FIR కూడా నమోదు చేసారు. TV9 భారత్ వర్ష్, రిపబ్లిక్ భారత్ కూడా ఈ వీడియోకి సంబంధించిన ప్రచురించిన కథనాలలో ఈ ఘటన ఢిల్లీలోని జహంగీర్పురిలో జరిగిందంటూ పైన తెలిపిన విషయాన్నే పేర్కొంది. వీటన్నిటి బట్టి, ఈ వీడియోకి ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో జరిగిన ఘటనకి ఎటువంటి సంబంధంలేదని కచ్చితంగా చెప్పొచ్చు.
చివరగా, ఢిల్లీలో కొందరు యువకుల్ని జనాలు కొడుతున్న వీడియోని ఘజియాబాద్ లో జరిగిన ఘటనకి ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు.