Fake News, Telugu
 

ఇంజనీరింగ్ చదవడానికి మాథ్స్, ఫిజిక్స్ తప్పనిసరి కాదని AICTE తెలిపినప్పటికీ కావలసిన అర్హత ప్రమాణాలు కాలేజీలు నిర్ణయించుకోవచ్చు

0

‘కేంద్రం కామర్స్ విధ్యార్దులు కూడా ఇంజనీరింగ్ చదవడానికి అవకాశం ఇచ్చింది’ అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా పోస్టులో చెప్తున్న విషయానికి సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: ‘కేంద్రం కామర్స్ విధ్యార్దులు కూడా ఇంజనీరింగ్ చదవడానికి అవకాశం ఇచ్చింది’.

ఫాక్ట్ (నిజం): నూతన విద్యా విధానం (NEP), 2020లో చెప్తున్నదానికి అనుగుణంగా ఇంజనీరింగ్ ప్రవేశాలకు ఇంటర్/హై స్కూల్ స్కూల్‌లో మాథ్స్ మరియు ఫిజిక్స్ తప్పనిసరి కాదని AICTE 2021లో ప్రకటించింది. అలాగే 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి AICTE విడుదల చేసిన అప్రూవల్ ప్రాసెస్ హ్యాండ్‌బుక్‌లో కూడా పేర్కొంది. మాథ్స్, ఫిజిక్స్ తప్పనిసరి కాదని AICTE పేర్కొన్నప్పటికీ, ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకునే అధికారం సంబధిత రాష్ట్ర ప్రభుత్వం/అనుబంధ విశ్వవిద్యాలయం/బోర్డుకు వదిలేసింది. పైగా CEC చేసిన వారు ఇంజనీరింగ్ చేయవచ్చని AICTE ప్రత్యేకంగా చెప్పనప్పటికీ ఇంజనీరింగ్ అర్హతకు సంబంధించి AICTE పేర్కొన్న కొన్ని టెక్నికల్ వొకేషనల్ సబ్జెక్టులలో కొన్ని కామర్స్ అనుబంధ కోర్సులు కూడా ఉన్నాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

విద్యార్థులు తమ ఆసక్తి బట్టి వివిధ విద్యా విభాగాల నుండి తమకు నచ్చిన సబ్జెక్టులను చదువుకొనేలా అవకాశం కల్పించాలని నూతన విద్యా విధానం (NEP), 2020లో పేర్కొన్నదానికి మరియు పలు రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థనలకు అనుగుణంగా, ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) గత సంవత్సరం (2021) ఇంజనీరింగ్ ప్రోగ్రాంలో ప్రవేశానికి కావాల్సిన అర్హతలలో మార్పులు చేసింది.

AICTE చేసిన మార్పులు ఏమిటి?

ఇంతకు ముందు ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశం పొందాలనుకున్న వారు ఇంటర్/హై స్కూల్‌లో మాథ్స్, ఫిజిక్స్ తోపాటు (కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేటిక్స్ ప్రాక్టీసెస్, అగ్రికల్చర్, ఇంజినీరింగ్ గ్రాఫిక్స్, బిజినెస్ స్టడీస్ మరియు టెక్నికల్ వొకేషనల్ సబ్జెక్టులు) ఏదైనా ఒక సబ్జెక్టు చదివి ఉండాలి. మరియు ఈ సబ్జెక్టులలో కనీస మార్కులు (45% జనరల్ విద్యార్థులు) సంపాదించి ఉండాలి.

ఐతే గత సంవత్సరం AICTE చేసిన మార్పుల ప్రకారం ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశం కోసం ఇంటర్/హై స్కూల్‌లో మాథ్స్ మరియు ఫిజిక్స్ కచ్చితంగా చదివి  ఉండాల్సిన అవసరం లేదు. ఈ కొత్త నిబంధనల ప్రకారం ఒక విద్యార్థి AICTE తెలిపిన 14 సబ్జెక్టుల లిస్టులో ఏవైనా మూడు సబ్జెక్టులు చదివి ఉంటే సరిపోతుంది. దేశంలో ఇంజనీరింగ్ విద్యకు సంబంధించి AICTE విడుదల చేసిన అప్రూవల్ ప్రాసెస్ హ్యాండ్‌బుక్‌లో ఈ విషయాన్ని పేర్కొంది.

కంప్యూటర్ సైన్స్, బయోటెక్నాలజీ, అగ్రికల్చర్, ఇంజినీరింగ్ గ్రాఫిక్స్, బిజినెస్ స్టడీస్, ఐటీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ ఇన్ఫర్మేటిక్స్ ప్రాక్టీస్ మొదలైన సబ్జెక్టులలో ఏవైనా మూడు సబ్జెక్టులు చదివి ఉంటే సరిపోతుంది. వీటితోపాటు CBSE అందించే టెక్నికల్ వొకేషనల్ సబ్జెక్టులు చదివిన వారికి కూడా ఇంజనీరింగ్ చదివేందుకు AICTE అర్హత కల్పించింది.

ఐతే పోస్టులో చెప్తున్నట్టు, CEC చదివిన వారుకు కూడా ఇంజినీరింగ్ చదవడానికి అర్హులని ప్రత్యేకంగా పేర్కొనక పోయినప్పటికీ, CBSE అందించే టెక్నికల్ వొకేషనల్ సబ్జెక్టులలో కొన్ని కామర్స్ అనుబంధ కోర్సులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ కోర్సులు చదివినవారు కూడా ఇంజనీరింగ్‌కు అర్హులవుతారు.

ఐతే ఇప్పుడు ఇంజనీరింగ్ చదవడానికి మాథ్స్, ఫిజిక్స్ అవసరం లేదా?

AICTE ప్రతిపాదించిన మార్పుల ప్రకారం ఇంజనీరింగ్ ప్రవేశానికి మాథ్స్, ఫిజిక్స్ కచ్చితంగా చదవాల్సిన అవసరం లేనప్పటికీ, ఈ విషయంలో తుది నిర్ణయాన్ని సంబధిత రాష్ట్ర ప్రభుత్వం/ అనుబంధ విశ్వవిద్యాలయం/బోర్డుకు వదిలేసింది.

అంటే ఇంజనీరింగ్ ప్రవేశాలకు సంబంధించిన అర్హత ప్రమాణాలను (ఏ సబ్జెక్టులు చదివి ఉండాలన్నది) రాష్ట్ర ప్రభుత్వం లేదా అనుబంధ విశ్వవిద్యాలయం/బోర్డు నిర్ణయించవచ్చు. ఐతే వేరువేరు కోర్సులు చేసి ఇంజనీరింగ్‌లోకి ప్రవేశించిన వారికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కాలేజీలు/యూనివర్సిటీలు బ్రిడ్జి కోర్సులు (మాథ్స్, ఫిజిక్స్, మొదలైన సబ్జెక్టులు) అందించవచ్చని కూడా AICTE తెలిపింది.

చివరగా, ఇంజనీరింగ్ చదవడానికి మాథ్స్, ఫిజిక్స్ తప్పనిసరి కాదని AICTE తెలిపినప్పటికీ కావలసిన అర్హత ప్రమాణాలు కాలేజీలు నిర్ణయించుకోవచ్చు.

Share.

About Author

Comments are closed.

scroll