Fake News, Telugu
 

2009-14 మధ్య కూడా రైల్వే బడ్జెట్ లో తెలంగాణ ప్రాంతానికి కేటాయింపులు జరిగాయి

0

నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో పురోగమిస్తోన్న తెలంగాణ రైల్వేలు’ అని పెట్టి, 2009-14 మధ్య తెలంగాణ కి రైల్వే బడ్జెట్ లో సగటున సున్నా (‘0’) కోట్ల రూపాయలు కేటాయిస్తే, 2021-22 సంవత్సరానికి 2,420 కోట్ల రూపాయలు కేటాయించినట్టు ఉన్న ఒక ఇన్ఫోగ్రాఫిక్ ఫోటోని సోషల్ మీడియాలో కొంత మంది పోస్ట్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 2009-14 మధ్య తెలంగాణ కి రైల్వే బడ్జెట్ లో సగటున సున్నా కోట్ల రూపాయలు కేటాయిస్తే, 2021-22 సంవత్సరానికి 2,420 కోట్ల రూపాయలు కేటాయించారు.

ఫాక్ట్: 2021-22 సంవత్సరానికి 2,420 కోట్ల రూపాయల రైల్వే బడ్జెట్ ని తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు. కానీ, 2009-14 మధ్య తెలంగాణ కి రైల్వే బడ్జెట్ లో సగటున సున్నా కోట్ల రూపాయలు కేటాయించారనే మాట వాస్తవం కాదు. 2009-14 మధ్య కూడా రైల్వే బడ్జెట్ కింద తెలంగాణ ప్రాంతానికి కేటాయింపులు జరిగాయి. 2009-14 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం లేదు. సరైన డేటా లేకుంటే 2009-14 మధ్య సగటును మరియు 2021-22 బడ్జెట్ ను పోల్చకూడదు. కానీ, పోస్ట్ లో ‘సున్నా’ అని పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

2021-22 సంవత్సరానికి రైల్వే బడ్జెట్ లో తెలంగాణ కి ఎంత కేటాయించారో తెలుసుకోవడానికి ఇంటర్నెట్ లో వెతకగా, ఆ విషయం పై దక్షిణ మధ్య రైల్వే ఇచ్చిన ప్రెస్ రిలీజ్ వారి వెబ్ సైట్ లో దొరుకుతుంది. తెలంగాణ రాష్త్రం లోకి పూర్తిగా లేదా పాక్షికంగా వచ్చే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్టులు మరియు భద్రతా పనుల కోసం 2021-22 సంవత్సరానికి 2,420 కోట్ల రూపాయలు కేటాయించినట్టు ప్రెస్ రిలీజ్ లో చదవొచ్చు. కావున, పోస్ట్ లో 2021-22 సంవత్సరానికి సంబంధించి ఇచ్చిన వివరాలు కరెక్టే.

2009-14 మధ్య తెలంగాణ ప్రాంతానికి (2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది) రైల్వే బడ్జెట్లలో ఎంత కేటాయించారనే డేటాని భారతీయ రైల్వే వెబ్ సైట్ లోని పింక్ బుక్స్ (‘రైల్వేలో మౌలిక సదుపాయాల పనుల గురించి, గ్రాంట్ల డిమాండ్లు మరియు వివిధ పనులను నిర్వహించడానికి బడ్జెట్ కేటాయింపుల సమగ్ర వివరాలతో కూడిన సంకలనం’) లో చూడవొచ్చు. తెలంగాణ ప్రాంతంలోని కొన్ని ప్రాజెక్టులకు 2010-11, 2011-12, 2012-13, and 2013-14 సంవత్సరాలలో ప్రతిపాదిత కేటాయింపుల వివరాలు కింద టేబుల్ లో చూడవొచ్చు.

పై టేబుల్ లోని సమాచారం ప్రకారం 2009-14 మధ్య కూడా తెలంగాణ ప్రాంతానికి రైల్వే బడ్జెట్ లో కేటాయింపులు ఉన్నాయి; పోస్ట్ లో చెప్పినట్టు సున్నా కోట్ల రూపాయలు మాత్రం కాదు. టేబుల్ లోని సమాచారం తెలంగాణ ప్రాంతానికి చెందిన కొన్ని ప్రాజెక్టుల వివరాలు మాత్రమే అని గమనించాలి; పూర్తి కేటాయింపుల వివరాలు కాదు. అంతేకాదు, అవి ప్రతిపాదిత కేటాయింపులు (అసలు కేటాయింపులు ఎక్కువ లేదా తక్కువ ఉండవొచ్చు).

పోస్ట్ లోని ఇన్ఫోగ్రాఫిక్ ని హైదరాబాద్ లోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (‘PIB in Hyderabad’) వారు కూడా ఫేస్బుక్ లో పోస్ట్ (ఆర్కైవ్డ్) చేసినట్టు తెలిసింది. ఆ విషయం పై హైదరాబాద్ పీఐబీ అధికారులతో FACTLY మాట్లాడగా, ఆ ఇన్ఫోగ్రాఫిక్ వారికి రైల్వే అధికారుల నుండి వచ్చినట్టు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే వారు కూడా అదే ఇన్ఫోగ్రాఫిక్ ని పోస్ట్ చేసినట్టు ఇక్కడ (ఆర్కైవ్డ్) చూడవొచ్చు. దక్షిణ మధ్య రైల్వే పీఆర్ఓ అధికారులను FACTLY సంప్రదించగా, అన్ని రాష్ట్రాలకు ఒకటే టెంప్లేట్ ఇన్ఫోగ్రాఫిక్ వాడారని, 2009-14 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం లేనందున ఆ సంవత్సరాలలో కేటాయింపులు ఆంధ్రప్రదేశ్ కిందికి వస్తాయని, అందుకే తెలంగాణ కి సంబంధించిన ఇన్ఫోగ్రాఫిక్ లో సున్నా పెట్టినట్టు వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014-20 మధ్య సగటును 2021-22 బడ్జెట్ తో పోలుస్తూ ఇంకో ఇన్ఫోగ్రాఫిక్ పెట్టినట్టు వారు తెలిపారు.

అయితే, పోస్ట్ చేసిన 2009-14 ఇన్ఫోగ్రాఫిక్ లో ఈ వివరాలు ఏమీ కూడా లేవు. దీని వలన సోషల్ మీడియాలో 2009-14 మధ్యలో అప్పటి ప్రభుత్వం తెలంగాణ ప్రాంతానికి ఏమి కేటాయించలేదు అని అర్థం వచ్చేటట్లు షేర్ చేస్తున్నారు. 2009-14 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం లేదన్నది నిజమే. సరైన డేటా లేకుంటే 2009-14 మధ్య సగటును మరియు 2021-22 బడ్జెట్ ను పోల్చకూడదు. కానీ, పోస్ట్ లో ‘సున్నా’ అని పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

చివరగా, 2009-14 మధ్య కూడా రైల్వే బడ్జెట్ లో తెలంగాణ ప్రాంతానికి కేటాయింపులు జరిగాయి. ఇన్ఫోగ్రాఫిక్ లో చూపెట్టినట్టు ‘సున్నా’ మాత్రం కాదు.

Share.

About Author

Comments are closed.

scroll