చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు పనితీరు, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రస్తుత పనితీరు అని చెప్తూ, రెండు రోడ్ల ఫోటోలతో కూడిన పోస్ట్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ‘చంద్రబాబు పనితీరు’ అని పెట్టి, ఒక రహదారి ఫోటో పెట్టారు. ఆ రహదారి ఫోటో ఎక్కడిదో చూద్దాం.
క్లెయిమ్: చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు నిర్మించిన రహదారి ఫోటో.
ఫాక్ట్ (నిజం): ‘చంద్రబాబు పనితీరు’ అని పెట్టిన రహదారి ఫోటో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించింది కాదు. అది గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్-వడోదర ఎక్స్‌ప్రెస్‌వే ఫోటో. పోస్ట్ లోని రెండవ ఫోటో ఎక్కడిదో తెలియలేదు. కావున, పోస్ట్ లో గుజరాత్ ఫోటో పెట్టి, చంద్రబాబు ప్రభుత్వం నిర్మించిన రహదారి గా చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.
పోస్టులోని రహదారి ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే ఫోటోని ఒకరు 2013 లోనే ఫేస్బుక్ లో పోస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఆ ఫోటో మీద ‘Ahmedabad – Vadodara Expressway’ (అహ్మదాబాద్-వడోదర ఎక్స్‌ప్రెస్‌వే ) అని రాసి ఉన్నట్టు చూడవొచ్చు. అంతేకాదు, ఆ ఫోటోలో దిశలు చూపెట్టే బోర్డు మీద కూడా ‘Vadodara’ (వడోదర), ‘Nadiad’ (నడిఆద్) అని రాసి ఉన్నట్టు చూడవొచ్చు. ఆ బోర్డు క్లియర్ గా ఉన్న మరో ఫోటో ఇక్కడ చూడవొచ్చు.
‘National Highways Authority of India’ వారి వెబ్సైటులో కూడా పోస్ట్ లో పెట్టిన ఫోటో చూడవొచ్చు. ఆ వెబ్సైటులోని ఫోటో మీద కూడా ‘Ahmedabad – Vadodara Expressway’ అని రాసి ఉన్నట్టు చూడవొచ్చు. కాకపోతే, వారు తప్పుగా ఆ ఫోటోని ‘Hoskote Dobbaspet’ (కర్ణాటక) ఆల్బమ్ (ఆర్కైవ్డ్) లో పెట్టారు.
ఇదే ఫోటోని ఛత్తీస్‌గఢ్ కి సంబంధించిన ఫోటోగా కొందరు షేర్ చేసినప్పుడు, అది తప్పు అంటూ 2018 లో ‘ఆల్ట్ న్యూస్’ వారు రాసిన ఆర్టికల్ ని ఇక్కడ చదవొచ్చు. అంతేకాదు, కొన్ని పాకిస్తాన్ వెబ్సైటులు కూడా ఇదే ఫోటోని పాకిస్తాన్ గురించి రాసిన ఆర్టికల్స్ లో పెట్టినట్టు ఇక్కడ , ఇక్కడ చూడవొచ్చు. పోస్ట్ లో పెట్టిన రెండవ ఫోటో ఎక్కడిదో మాకు తెలియలేదు.
చివరగా, ‘చంద్రబాబు పనితీరు’ అని పెట్టిన రహదారి ఫోటో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించింది కాదు. అది గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్-వడోదర ఎక్స్‌ప్రెస్‌వే ఫోటో.