Fake News, Telugu
 

అహ్మదాబాద్ విమానాశ్రయం పేరు ‘అదానీ ఎయిర్ పోర్ట్’ గా మారలేదు, వీడియోలోనిది అదానీ రైలు కాదు

0

‘సర్దార్ పటేల్ ఎయిర్ పోర్ట్ ఇప్పుడు అయింది అదానీ ఎయిర్ పోర్ట్’, ‘అదాని ట్రైన్ రెడీ’, అని చెప్తూ ఫోటో మరియు వీడియోలను సోషల్ మీడియాలో కొందరు పోస్ట్ చేస్తున్నారు. ఆ పోస్టుల్లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

అహ్మదాబాద్ లోని విమానాశ్రయం పేరు ‘అదానీ ఎయిర్ పోర్ట్’ గా మార్చబడిందా?

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ 1: అహ్మదాబాద్ లోని ‘సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం’ ఇప్పుడు ‘అదానీ ఎయిర్ పోర్ట్’ గా అయినట్టు ఫోటోలో చూడవొచ్చు.

ఫాక్ట్: అహ్మదాబాద్ లోని ‘సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం’ యొక్క పేరుని ‘అదానీ ఎయిర్ పోర్ట్’ గా మార్చలేదు. ఆ విమానాశ్రయం యొక్క కార్యకలాపాలు, నిర్వహణ, మరియు అభివృద్ధి కి సంబంధించిన బాధ్యతలను ‘ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా’ (AAI)’ వారు అదానీ గ్రూప్ కి అప్పగించారు. ఫోటోలోని బోర్డు పై అహ్మదాబాద్ నగరంలోకి వెళ్తుంటే ‘Welcome to Ahmedabad’ (పక్కన ‘adani Airports’) అని కనిపిస్తే, అదే బోర్డు పై మరో వైపు విమానాశ్రయం లోకి వెళ్తుంటే ‘Welcome to Sardar Vallabhbhai Patel International Airport’ (పక్కన ‘adani Airports’) అని రాసి ఉన్నట్టు కనిపిస్తుంది. కావున, పోస్ట్ లో ఆ బోర్డు యొక్క ఒక వైపు ఫోటో చూపిస్తూ, అహ్మదాబాద్ విమానాశ్రయం పేరు మార్చబడిందని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

పోస్ట్ లో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్ లో వెతకగా, అహ్మదాబాద్ లోని ‘సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం’ యొక్క పేరు ‘అదానీ ఎయిర్ పోర్ట్’ గా మార్చబడలేదని, విమానాశ్రయం యొక్క కార్యకలాపాలు, నిర్వహణ, మరియు అభివృద్ధి కి సంబంధించి ‘ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా’ (AAI)’ వారు అదానీ గ్రూప్ తో ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది. నవంబర్ 2020 లో ‘ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా’ (AAI)’ వారు అదానీ గ్రూప్ కి అహ్మదాబాద్  విమానాశ్రయం యొక్క బాధ్యతలను అప్పగించింది.

పై విషయాలకు సంబంధించి ‘ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా’ (AAI)’ వారు చేసిన ట్వీట్లను ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.

అహ్మదాబాద్ విమానాశ్రయం కి సంబంధించిన వెబ్ సైట్ మరియు ట్విట్టర్ అకౌంట్ లో విమానాశ్రయం పేరు ‘సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్’ అనే ఉన్నట్టు చూడవొచ్చు. ‘అదానీ గ్రూప్’ వారు చేసిన ట్వీట్ లో కూడా ‘సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్’ అని రాసారు.

విమానాశ్రయం యొక్క పేరు మార్చినట్టు చెప్తూ పోస్ట్ లో పెట్టిన బోర్డు ఫోటో నిజంగానే అహ్మదాబాద్ విమానాశ్రయం కి సంబంధించిందే. అయితే, అహ్మదాబాద్ నగరంలోకి వెళ్తుంటే బోర్డు పై ‘Welcome to Ahmedabad’ (పక్కన ‘adani Airports’) అని కనిపిస్తుందని, అదే బోర్డు పై మరో వైపు విమానాశ్రయం లోకి వెళ్తుంటే ‘Welcome to Sardar Vallabhbhai Patel International Airport’ (పక్కన ‘adani Airports’) అని రాసి ఉంటుందని ఒకరు ట్వీట్ చేసారు. అదే విషయం చెప్తూ ‘టీవీ9 గుజరాతీ’ వారు తాజాగా పోస్ట్ చేసిన వీడియోని ఇక్కడ చూడవొచ్చు.

లక్నో విమానశ్రయం యొక్క కార్యకలాపాలు, నిర్వహణ, మరియు అభివృద్ధి కూడా ‘ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా’ (AAI)’ వారు అదానీ గ్రూప్ కి అప్పగించారు. ఆ విమానాశ్రయం కి సంబంధించిన బోర్డు పై కూడా ‘Chaudhary Charan Singh International Airport, Lucknow’ అని రాసి ఉండి, పక్కన ‘adani Airports’ అని ఉన్నట్టు ఇక్కడ చూడవొచ్చు. కావున, అహ్మదాబాద్ లోని ‘సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం’ యొక్క పేరుని ‘అదానీ ఎయిర్ పోర్ట్’ గా మార్చలేదు.

వీడియోలోని రైలు అదానీ గ్రూప్ కి సంబంధించినదా?

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ 2: అదానీ గ్రూప్ కి చెందిన రైలు వీడియో.

ఫాక్ట్: వీడియోలో ఉన్నది అదానీ గ్రూప్ కి చెందిన రైలు కాదు; భారత రైల్వే కి చెందిన రైలు. కేవలం, ప్రకటన మాత్రం అదానీ గ్రూప్ ది. కావున, పోస్ట్ లో అదానీ రైలు అని చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

వీడియోలోని రైలు మీద ‘पश्चिम रेलवे, वडोदरा’ (‘పశ్చిమ రైల్వే, వదోదర’) అని రాసి ఉన్నట్టు చూడవొచ్చు. కావున, కొన్ని కీ-వర్డ్స్ తో వెతకగా, వీడియోలోని రైలు కి సంబంధించి ‘Western Railway’ వారు ఫిబ్రవరి 2020 లో చేసిన ట్వీట్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. తమ పది రైళ్ళ పై ప్రకటనలు పెట్టడం ద్వారా సుమారు కోటి రూపాయుల వరకు ఆదాయం పొందుతున్నట్టు ‘Western Railway’ వారు తమ ట్వీట్ లో రాసారు. ఆ రైళ్ళకి సంబంధించి వార్తాసంస్థలు ప్రచురించిన ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చదవొచ్చు. కావున, వీడియోలో ఉన్నది అదానీ గ్రూప్ కి చెందిన రైలు కాదు; భారతీయ రైల్వే కి చెందిన రైలు. కేవలం, ప్రకటన మాత్రం అదానీ గ్రూప్ ది.

కేవలం అదానీ గ్రూప్ మాత్రమే కాదు, వివిధ సంస్థలు తమ ప్రకటనలను భారతీయ రైల్వే రైళ్ళ పై ప్రదర్శిస్తున్నాయి. వాటిల్లో కొన్నిటిని ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవొచ్చు. వాణిజ్య ప్రకటనలు ప్రదర్శిస్తున్నందుకు భారతీయ రైల్వే కి ‘Non Fare Revenue’ కింద ఆదాయం వస్తుంది. కోవిడ్-19 కి సంబంధించిన మెసేజ్లను కూడా రైళ్ళ పై ప్రదర్శించినట్టు ఇక్కడ చూడవొచ్చు. రైల్వే ప్రైవేటీకరణ పై రైల్వే మంత్రి పీయూష్ గోయల్ జూలై 2020 లో ఏమన్నారో ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, అహ్మదాబాద్ విమానాశ్రయం పేరు ‘అదానీ ఎయిర్ పోర్ట్’ గా మారలేదు. వీడియోలోనిది అదానీ రైలు కాదు.

Share.

About Author

Comments are closed.

scroll