Fake News, Telugu
 

తాను ఆత్మహత్య చేసుకున్నందున అగ్నివీరుడు అమ్రిత్ పాల్ సింగ్‌కు సైనిక గౌరవం లభించలేదు

0

అగ్నిపథ్ యోజన ద్వారా రిక్రూట్ అయి ఇటీవల మరణించిన అమ్రిత్ పాల్ సింగ్ ఫోటోను షేర్ చేస్తూ, “అగ్నివీర్ ద్వారా రిక్రూట్ అయిన అమృత్ పాల్ అనబడే వ్యక్తి  జమ్మూ అండ్ కాశ్మీర్ లోని పూంచ్ లో మరణించాడు. అతని మృతదేహాన్ని ప్రైవేటు వాహనంలో తీసుకువచ్చారు, దహన సంస్కారానికి ఆర్మీ యూనిట్ హాజరు కాలేదు మరియు అతనికి ఆర్మీ గార్డ్ అఫ్ హానర్ అందించబడలేదు.” అంటూ సోషల్ మీడియాలో  పోస్టు చేస్తున్నారు. దీని వెనుక ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం. 

క్లెయిమ్: అగ్నివీర్ ద్వారా నియామకం పొందిన అమ్రిత్ పాల్ జమ్మూ అండ్ కాశ్మీర్ లోని పూంచ్ లో మరణించాడు. అతని మృతదేహాన్ని ప్రైవేటు వాహనంలో తీసుకువచ్చారు, దహన సంస్కారానికి ఆర్మీ యూనిట్ హాజరు కాలేదు మరియు అతనికి ఆర్మీ గార్డ్ అఫ్ హానర్ అందించబడలేదు

ఫాక్ట్(నిజం): ఆర్మీ దర్యాప్తులో అగ్నివీర్ అమ్రిత్ పాల్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించబడింది, అందుకే అతనికి మరణానంతరం ఎటువంటి హానర్ లేదా సైనిక అంత్యక్రియలు అందించబడలేదు అని ఇండియన్ ఆర్మీ ‘X’ ద్వారా స్పష్టం చేసింది. కావున, ఈ పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది. 

ఈ క్లెయిమ్ గురించి కీవర్డ్ సెర్చ్ ద్వారా ఇంటర్నెట్లో వెతకగా, 11 అక్టోబర్ 2023న వచ్చిన న్యూస్ రిపోర్ట్ (ఇక్కడ మరియు ఇక్కడ) ప్రకారం, అగ్నివీర్ అమ్రిత్ పాల్ సింగ్ పూంచ్ జిల్లా మాన్‌కోట్ ప్రాంతంలోని LOC సమీపంలో సెంట్రీగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆ సమయంలో అతను బుల్లెట్ గాయం కారణంగా మరణించాడు. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ. ప్రమాదవశాత్తూ అగ్నిప్రమాదం జరిగిందా, ఆత్మహత్యా లేక మరేదైనా కారణాల వల్ల ఈ ఘటన జరిగిందా అనేది నిర్ధారిస్తున్నట్లు పోలీసు అధికారులు  తెలిపారు.

తదుపరి, 14 అక్టోబర్ 2023న భారత సైన్యం యొక్క 16వ కార్ప్స్ ‘వైట్ నైట్ కార్ప్స్‘ ట్వీట్ ద్వారా, ‘అగ్నివీర్ అమ్రిత్ పాల్ సింగ్ స్వయంగా తుపాకీతో కాల్చుకున్న గాయం కారణంగా మరణించాడు. తన మృత దేహాన్ని, ఒక జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ మరియు నలుగురు ఇతర ర్యాంక్‌లతో కలిసి, అగ్నివీర్ యూనిట్ నియమించిన సివిల్ అంబులెన్స్‌లో రవాణా చేయబడింది. ఆర్మీ సిబ్బంది కూడా అంత్యక్రియలకు హాజరయ్యారు. కానీ, మరణానికి కారణం స్వీయ గాయం అయినందువల్ల  ప్రస్తుత పాలసీకి అనుగుణంగా ఎటువంటి హానర్ లేదా సైనిక అంత్యక్రియలు అందించబడలేదు’ అని తెలిసింది.

అంతే కాకుండా, 15 అక్టోబర్ 2023న భారత సైన్యం X  ద్వారా, ‘అమ్రిత్ పాల్ అంత్యక్రియలకు గార్డు ఆఫ్ హానర్ ఇవ్వబడలేదు, ఎందుకంటే స్వీయ గాయం కారణంగా మరణించిన సందర్భంలో ఈ హానర్ ఇవ్వబడదు.’ అని తెలిపింది. 

అగ్నిపథ్ యోజన గురించి తెలుసుకునేందుకు, భారత సైన్యం దీని గురించి అందించిన నిబంధనలు పరిశీలించాం. అగ్నిపథ్ యోజన జూన్ 2022లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది.ఈ యోజన ప్రకారం, 1950 నాటి ఆర్మీ చట్టం ప్రకారం, శిక్షణా కాలంతో సహా నాలుగు సంవత్సరాల పాటు కొనసాగే సేవా కాలానికి అభ్యర్థులు నమోదు చేయబడతారు.  అగ్నివీర్రులకు పెన్షన్  నిబంధనలు వర్తించవు. కానీ, అగ్నిపథ్ పథకం సర్వీసులో మరణించిన సైనికుల లబ్ధిదారులకు ఆర్థిక పరిహారాన్ని అందిస్తుంది. పరిహారం మొత్తం X, Y, Z గా వర్గీకరించిన పరిస్థితుల పై ఆధారపడి ఉంటుంది.

చివరిగా, అగ్నివీర్ అమ్రిత్ పాల్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నందున సైనిక గౌరవం లభించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll