Fake News, Telugu
 

గద్వాల్ జిల్లా పుల్లూరు చెక్‌పోస్టు దగ్గర పట్టుబడ్డ రూ. 750 కోట్ల డబ్బు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించినవి

0

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కేరళ నుంచి తెలంగాణకు లారీలో తరలిస్తున్న రూ. 750 కోట్ల నగదును పోలీసులు పట్టుకున్నారంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ బాగా షేర్ అవుతోంది. రూ. 750 కోట్ల డబ్బు కట్టలను తరలిస్తున్న లారీని గద్వాల్ దగ్గర పోలీసులు తనిఖీ చేసి వాహనాన్ని సీజ్ చేసినట్టు ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కేరళ నుంచి తెలంగాణకు లారీలో తరలిస్తున్న రూ. 750 కోట్ల నగదును గద్వాల్ దగ్గర పోలీసులు పట్టుకున్నారు.

ఫాక్ట్ (నిజం): జోగుళాంబ గద్వాల్ జిల్లా పుల్లూరు చెక్‌పోస్టు దగ్గర పోలీసులకు పట్టుబడ్డ ఈ రూ. 750 కోట్ల నగదు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్‌కు సంబంధించినదని ఎన్నికల అధికారులు నిర్ధారించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేరళ నుండి తెలంగాణలోని తమ బ్యాంకులకు డబ్బుని తరలిస్తుండగా పోలీసులు అనుమానంతో ఈ బండిని సీజ్ చేసినట్టు తెలిసింది. రూ. 750 కోట్లతో పట్టుబడ్డ ఈ కంటైనర్ ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించినది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.  

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం కీ పదాలను ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికితే, ఈ ఘటనకు సంబంధించి V6 వార్తా సంస్థ పబ్లిష్ చేసిన ఆర్టికల్ దొరికింది. 17 అక్టోబర్ 2023 నాడు కేరళ నుండి తెలంగాణకు రూ. 750 కోట్ల నగదు తరలిస్తున్న ఒక లారీని గద్వాల్ చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు పట్టుకున్నారని ఈ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. గద్వాల పోలీసులు వెంటనే ఉన్నతాధికారులకి సమాచారమిచ్చి వాహనాన్ని సీజ్ చేసినట్టు తెలిసింది.

అయితే, కలెక్టర్‌ ఆదేశాల మేరకు విచారణ జరిపిన అధికారులు, విచారణలో ఈ డబ్బు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్‌కు సంబంధించినదని నిర్ధారించినట్టు ఈ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆదేశాల మేరకు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కేరళ నుంచి హైదరాబాద్‌కు లారీలో నగదు తరలిస్తుండగా, మంగళవారం రాత్రి పుల్లూరు చెక్‌పోస్టు వద్ద అధికారులు ఈ వాహనాన్ని పట్టుకున్నట్టు తెలిసింది.

నగదు ఆర్‌బీఐ నుంచి వచ్చినట్టు నిర్ధారణ అవ్వడంతో అధికారులు పోలీస్‌ ఎస్కార్ట్‌ సాయంతో ఈ డబ్బుని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తరలించినట్టు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి ఇతర వార్తా సంస్థలు పబ్లిష్ చేసిన కథానాలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. గద్వాల్ జిల్లా పుల్లూరు చెక్‌పోస్టు దగ్గర పట్టుబడ్డ ఈ డబ్బు ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించినది కాదు.

చివరగా, గద్వాల్ జిల్లా పుల్లూరు చెక్‌పోస్టు దగ్గర పట్టుబడ్డ రూ. 750 కోట్లు డబ్బు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించినవి.

Share.

About Author

Comments are closed.

scroll