గత కొన్ని నెలలుగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్/డీజిల్ ధరల నుండి ఉపశమనం కలిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెట్రోల్/ డీజిల్‌పై తాము విధించే ఎక్సైజ్ డ్యూటీని కొంత తగ్గించింది. కేంద్ర నిర్ణయాన్ని అనుసరించి తెలుగు రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్/ డీజిల్‌పై తాము విధించే టాక్స్‌లని తగ్గించాలని డిమాండ్లు వస్తున్నాయి. ఐతే ఈ నేపథ్యంలోనే పెట్రోల్/ డీజిల్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే టాక్స్‌లకు సంబంధించిన వివరాలను తెలుపుతున్న పలు సోషల్ మీడియా పోస్టులు (ఇక్కడ , ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ ) విస్తృతంగా షేర్ అవుతున్నాయి. ఈ కథనం ద్వారా పెట్రోల్/ డీజిల్‌పై ఆ పోస్టులలో చెప్తున్న దాంట్లో నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: పెట్రోల్/ డీజిల్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్న టాక్స్‌ల వివరాలు.
ఫాక్ట్ (నిజం): ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై ₹5 ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన తర్వాత హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధరలో కేంద్ర వాటా ₹27.33 కాగా, రాష్ట్ర వాటా ₹28.16. అనగా మొత్తం ధరలో 25.26% కేంద్ర ఖజానాకి వెళ్తుండగా, 26.02% రాష్ట్ర ఖజానాకి చేరుతుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
సాధారణంగా పెట్రోల్ బంక్‌లలో లీటర్ పెట్రోల్/ డీజిల్‌పై మనం చెల్లించే ధరని నాలుగు భాగాలుగా విభజించవచ్చు. పెట్రోల్/ డీజిల్‌ను డీలర్లకు విక్రయించే ధర + కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ డ్యూటీ + డీలర్ కమిషన్+ స్టేట్ VAT, ఈ నాలుగింటిని కలిపితే వచ్చేది మనం చెల్లించే ధర.
ఐతే ఈ నాలుగింటిలో సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ఎంత ఉండాలనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కాగా రాష్ట్రాలు విధించే VAT సాధారణంగా ‘ad valorem’, అంటే మిగతా మూడింటిపై ఆధారపది ఉంటుంది. ఎలాగంటే స్టేట్ VAT= X % (ఆయిల్ కంపెనీలు పెట్రోల్/ డీజిల్‌ను డీలర్లకు విక్రయించే ధర + కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ డ్యూటీ + డీలర్ కమిషన్). అంటే కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ పెంచినప్పుడు, దానికి అనుగుణంగా స్టేట్ VAT కూడా పెరుగుతుంది, అలాగే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గినప్పుడు, స్టేట్ VAT కూడా తగ్గుతుంది.
పెట్రోల్‌కి సంబంధించి ఇండియన్ ఆయిల్ వెబ్సైటులో 04 నవంబర్ 2021 రోజున ఢిల్లీలో అమలులో ఉన్న ప్రైస్ బిల్డ్అప్ వివరాలు ఇక్కడ చూడొచ్చు. ఈ వివరాల ప్రకారం ఆ రోజు ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర ₹103.97గా ఉంది. ఇందులో ఆయిల్ కంపెనీలు పెట్రోల్/డీజిల్‌ను డీలర్లకు విక్రయించే ధర ₹48.23 కాగా, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ₹27.90, డీలర్ కమిషన్ ₹3.85. ఇక ఢిల్లీ ప్రభుత్వం విధించే 30% VAT ₹23.99.
పెట్రోల్/ డీజిల్‌పై ఎవరు ఎలాంటి టాక్స్‌లు విధిస్తున్నారు:
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్/ డీజిల్‌పై విధించే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ, స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (సెస్), అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (సెస్), అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ (సెస్) అనే నాలుగు రకాలుగా విభజించవచ్చు. ఈ నాలుగింటిలో కేవలం బేసిక్ ఎక్సైజ్ డ్యూటీని మినహాయిస్తే మిగిలిన మూడు రకాల టాక్స్‌లు సెస్/సర్చార్జీ రూపంలో విధిస్తారు. ఇటీవల చేసిన సవరణల అనంతరం పెట్రోల్‌పై కేంద్ర ప్రభుత్వం ₹27.90 సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని వసూలు చేస్తుండగా, ఇందులో బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ ₹1.40, మిగిలిన ₹26.50 పైన తెలిపిన సెస్/సర్చార్జీ రూపంలోనే వసూలు చేస్తుంది.
ఐతే ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ప్రకారం కేంద్ర పన్నులలో రాష్ట్రాలకు 41% వాటా ఉంటుంది. కానీ సెస్/సర్చార్జీ రూపంలో వసూలు చేసేదాంట్లో రాష్ట్రాలకు ఎటువంటి వాటా ఉండదు. అంటే పెట్రోల్/ డీజిల్‌పై విధించే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీలో కేవలం బేసిక్ ఎక్సైజ్ డ్యూటీలో మాత్రమే రాష్ట్రాలకు వాటా ఉంటుంది. బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ (₹1.40)లో 59% వాటా కేంద్రానిది (₹0.83) కాగా, మిగిలిన 41% (₹0.57)లో ఫైనాన్స్ కమిషన్ సిఫారసు ప్రకారం ఒక్కో రాష్ట్రానికి ఒక్కో నిష్పత్తిలో పంచుతారు.
ఇక రాష్ట్ర ప్రభుత్వాల విషయానికి వస్తే, పెట్రోల్/ డీజిల్‌పై రాష్ట్రాలు సేల్స్ టాక్స్/ VAT వసూలు చేస్తాయి. కాగా కొన్ని రాష్ట్రాలు మాత్రం VATకి అధనంగా సెస్, ఇతర చార్జీలు కూడా వసూలు చేస్తున్నాయి. ఐతే తెలంగాణ ప్రభుత్వం మాత్రం పెట్రోల్/ డీజిల్‌పై కేవలం సేల్స్ టాక్స్/ VATని వసూలు చేస్తుంది.
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్ పై 35.2% VATని వసూలు చేస్తుంది, అంటే (తెలంగాణ VAT= 35.2% ( ఆయిల్ కంపెనీలు పెట్రోల్/ డీజిల్‌ను డీలర్లకు విక్రయించే ధర (₹48.23) + కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ డ్యూటీ (₹27.90) + డీలర్ కమిషన్(₹3.85)). పైన తెలిపిన ప్రైస్ బిల్డ్అప్ ఆధారంగా లెక్కిస్తే తెలంగాణ ప్రభుత్వం VAT రూపంలో ₹28.15 వసూలు చేస్తుంది.
2014 నుండి ఎవరెవరు ఎంత టాక్స్ పెంచారు:
మే 2014లో ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ మొదటిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు డీజిల్‌పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ₹3.56 కాగా, పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ ₹ 9.48గా ఉండేది. ఆ తర్వాత క్రమక్రమంగా ఎక్సైజ్ డ్యూటీ పెరుగుతూ తగ్గుతూ వచ్చింది. మోదీ ప్రభుత్వం మొదటిసారిగా నవంబర్ 2014లో సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని పెంచింది, ₹ 9.48గా ఉన్న పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీని ₹11.02కి పెంచింది. ఆ సంవత్సరం డిసెంబర్‌లో మళ్ళీ ఒకసారి ఎక్సైజ్ డ్యూటీని పెంచింది. అదేవిధంగా 2015లో నాలుగుసార్లు, 2016లో మూడుసార్లు ఎక్సైజ్ డ్యూటీని పెంచుకుంటూ వచ్చింది.
2017, 2018లో పలు సార్లు ఎక్సైజ్ డ్యూటీని తగ్గించినప్పటికీ, తిరిగి 2019 నుండి వరసగా పెంచుకుంటూ వచ్చింది. మే 2020లో ఏకంగా పెట్రోల్‌పై ₹10, డీజిల్‌పై ₹13 ఎక్సైజ్ డ్యూటీని పెంచడంతో పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ అత్యధికంగా ₹32.98 మరియు ₹31.83కి చేరుకుంది.
2021 బడ్జెట్‌లో ఎక్సైజ్ డ్యూటీకి సంబంధించి కొన్ని సవరణలు చేసింది. నికరంగా ఎక్సైజ్ డ్యూటీలో ఎటువంటి హెచ్చుతగ్గులు చేయనప్పటికీ, కొత్తగా పెట్రోల్‌పై ₹2.5 మరియు లీటర్ డీజిల్‌పై ₹4 అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్‌ని ప్రవేశపెట్టింది. ఐతే ఈ భారం వినియోగదారులపై పడకుండా అప్పటికివరకు వసూలు చేస్తున్న బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ మరియు స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీని కొత్తగా పెట్టిన సెస్‌కి అనుగుణంగా తగ్గించారు.
చివరిసారిగా ఇటీవల నవంబర్ 2021లో ఎక్సైజ్ డ్యూటీని సవరించి, పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹10 ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడంతో ప్రస్తుతం పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ ₹27.90కి చేరుకోగా, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ ₹21.80కి చేరుకుంది.
తెలంగాణ విషయానికి వస్తే, రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్/ డీజిల్ విక్రయంపై విధించే సేల్స్ టాక్స్/ VATని గత ఏడు సంవత్సరాలలో ఒకసారి మాత్రమే సవరించింది. ఫిబ్రవరి 2015లో అప్పటివరకు పెట్రోల్‌పై ఉన్న 31% VATని 35.2%కి, అలాగే డీజిల్‌పై అప్పటివరకు ఉన్న 22.25% VATని 27%కి పెంచింది. ఆ తర్వాత మళ్ళీ VATపై ఎటువంటి సవరణలు జరగలేదు.
కేంద్ర ప్రభుత్వం సెస్‌ల రూపంలో వసూలు చేసేది పెరుగుతూ వస్తుంది:
ఈ ఆర్టికల్ మొదట్లో ప్రస్తావించినట్టు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ రూపంలో వసూలు చేసేదాంట్లో కేవలం బేసిక్ ఎక్సైజ్ డ్యూటీని మినహాయిస్తే మిగతా మూడు సెస్‌లు కాబట్టి వాటిలో రాష్ట్రాలకు ఎటువంటి వాటా ఇవ్వనక్కరలేదు. ఐతే కేంద్ర ప్రభుత్వం చాలా కాలం నుండి బేసిక్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తూ, సెస్‌ల రూపంలో వసూలు చేసేదాన్ని పెంచుకుంటూ వస్తుంది.
నవంబర్ 2014లో స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (సెస్) ₹6 కాగా, 2016 వరకు దీనిలో ఎటువంటి మార్పు లేనప్పటికీ 2017 నుండి క్రమక్రమంగా పెంచుతూ 2020కి దీనిని ₹12 చేసారు. 2021 బడ్జెట్‌లో రూపాయి తగ్గించినప్పటికీ, తగ్గించిన మొత్తాన్ని కొత్తగా ప్రవేశపెట్టిన అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్‌కి బదలాయించారు.
అదేవిధంగా నవంబర్ 2014లో ₹2గా ఉన్న అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీని ( రోడ్డు & ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్) మార్చ్ 2015లో ఏకంగా నాలుగు రూపాయలు పెంచారు. ఆ తర్వాత 2018లో రెండు రూపాయలు, 2019 మరియు 2020లో రూపాయి చొప్పున రెండు సార్లు పెంచగా, మే 2020లో ఏకంగా ఎనిమిది రూపాయలు పెంచి అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీని ₹18 చేసారు.
ఈ క్రమంలోనే రాష్ట్రాలకు వాటా ఉండే బేసిక్ ఎక్సైజ్ డ్యూటీని మొదట్లో పెంచినప్పటికీ ఆ తర్వాత తగ్గిస్తూ వచ్చారు. 2014లో ₹2.70 ఉన్న బేసిక్ ఎక్సైజ్ డ్యూటీని క్రమక్రమంగా పెంచుకుంటూ 2016లో ₹9.48 చేసారు. ఐతే ఆ తర్వాత దీనిని క్రమక్రమంగా తగ్గిస్తూ ₹1.40 చేసారు, ప్రస్తుతం కూడా ఇదే రేట్ అమలులో ఉంది.
దీన్నిబట్టి పైన చెప్పినట్టు పెట్రోల్‌పై కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న ఎక్సైజ్ డ్యూటీలో కేవలం ఈ ₹1.40లో మాత్రమే రాష్ట్రాలకు వాటా ఉంటుంది. ఈ ₹1.40లో కేంద్రం వాటా 59%, అనగా ₹0.83. మిగిలిన దాంట్లో 41%, అనగా ₹0.57లో అన్ని రాష్ట్రాలకు వాటా ఉంటుంది. ఫైనాన్స్ కమిషన్ సిఫారసు ప్రకారం ఇందులో తెలంగాణకి 2.13% వాటా ఉంటుంది. అంటే 57 పైసలలో తెలంగాణకి 2.13% అనగా రూ 0.01 (ఒక పైసా) వాటా రాష్ట్రానికి చెందుతుంది.
ప్రస్తుత రిటైల్ ధరలలో ఎవరి వాటా ఎంత:
ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెట్రోల్/ డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన తర్వాత 10 నవంబర్ 2021న హైదరాబాద్‌లోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్‌లో లీటర్ పెట్రోల్ ధర 108.20గా ఉంది. ఈ మొత్తంలో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఎంతో కింద చూద్దాం.
- కేంద్ర వాటా (ఎక్సయిజ్ డ్యూటీ) = ₹27.33, (బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీలో కేంద్ర వాటా (₹0.83) + సెస్ (26.5))
- రాష్ట్ర వాటా = ₹28.16, (స్టేట్ VAT 35.2% = ₹28.15 + బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీలో కేంద్ర వాటా (₹0.01))
అంటే లీటర్ పెట్రోల్ ధర ₹108.20లో 25.26% కేంద్ర ఖజానాకి చెందుతుండగా, 26.02% రాష్ట్ర ఖజానాకి చేరుతుంది.
అలాగే కేవలం పన్నులను పరిగణలోకి తీసుకుంటే హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై ధర ₹108.20లో మొత్తం ₹56.05 పన్నుల రూపంలో వసూలు చేస్తుండగా, ఇందులో 48.76% వాటా కేంద్రానిది కాగా, 50.24 % రాష్ట్ర ప్రభుత్వానిది.
చివరగా, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన తర్వాత హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధరలో కేంద్ర వాటా ₹27.33 కాగా, రాష్ట్ర వాటా ₹28.16.