Fake News, Telugu
 

మసీదు, మదరసాలకు సంబంధించి భారత ప్రభుత్వం ఈ కొత్త చట్టం తీసుకురాలేదు

0

మసీదు, మదరసాలలో ఏదైనా నష్టం కలిగిస్తే అని చెప్తూ, దానికి సంబంధించి భారత ప్రభుత్వం ఒక ప్రకటన చేసిందని ఒక వీడియోతో ఉన్న పోస్టును బాగా షేర్ చేస్తున్నారు. ఐపీసీ సెక్షన్ 427 మరియు ఒక కొత్త చట్టం (1985) కింద బుక్ చేసి మూడు సంవత్సరాలు శిక్ష వేస్తారని అంటున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: మసీదు, మదరసాల కోసం భారత ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం.

ఫాక్ట్ (నిజం): అటువంటి కొత్త చట్టం ఏది రాలేదు. ఐపీసీ 427 ప్రకారం దుష్ప్రవర్తనకు పాల్పడి, తద్వారా రూ. 50 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో నష్టం లేదా నష్టం కలిగించే వ్యక్తులు ఈ సెక్షన్ కింద రెండు సంవత్సరాల జైలు శిక్ష మరియు/లేదా జరిమానాతో శిక్షించబడతారు. దీనికి మసీదు, గుడి, చర్చి అని సంబంధం లేదు. ప్రజా ఆస్తి నష్ట నిరోధక చట్టం (The Prevention of Damage To Public Property Act, 1984) ప్రకారం, మసీదులకు మాత్రమే కాకుండా ఏదైనా ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించినందుకు నేరస్థులను శిక్షించడం గురించి ఈ చట్టం మాట్లాడుతుంది. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.  

పోస్టులో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, భారత ప్రభుత్వం ఇటువంటి ఒక కొత్త చట్టం తీసుకొచ్చినట్టు ఎక్కడా కూడా ఎటువంటి సమాచారం లేదు. భారత ప్రభుత్వం ఇటువంటి ఒక ప్రకటన విడుదల చేసినట్టు వార్తాపత్రికలు కూడా ప్రచురించలేదు. లోక్‌సభ వెబ్సైటులో కూడా కీ వర్డ్స్‌తో వెతకగా అలాంటి చట్టం వచ్చినట్టుగా ఆధారాలు దొరకలేదు.  

ఐపీసీ సెక్షన్ 427

ఐపీసీ సెక్షన్ 427 ప్రకారం దుష్ప్రవర్తనకు పాల్పడి, తద్వారా రూ. 50 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో నష్టం కలిగించే వ్యక్తులు ఈ సెక్షన్ కింద రెండు సంవత్సరాల జైలు శిక్ష మరియు/లేదా జరిమానాతో శిక్షించబడతారు. దీనికి మసీదు, గుడి, చర్చి అని సంబంధం లేదు.

The Prevention of Damage To Public Property Act, 1984

ప్రజా ఆస్తి నష్ట నిరోధక చట్టం (The Prevention of Damage To Public Property Act, 1984) 1984లో అమల్లోకి వచ్చింది. అయితే, పోస్టులో తప్పుగా ‘1985’ అని ఉంది. ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించినందుకు విధించే శిక్షల యొక్క నిబంధనలు ఈ చట్టంలో ఉన్నాయి. చట్టం ప్రకారం, ప్రభుత్వ ఆస్తి అనేది కేంద్ర ప్రభుత్వం (రాష్ట్ర ప్రభుత్వమైనా, కార్పొరేషన్ అయినా) ఆధీనంలో ఉన్నా లేదా నియంత్రణలో ఉన్నా, ప్రజా ఆస్తిగా (public property) నిర్వచించబడుతుంది. ఈ ఆస్తికి నష్టం చేస్తే కనీసం ఒక సంవత్సరం జైలు శిక్ష లేదా జరిమానా విధించబడుతుంది. ఈ చట్టం ద్వారా బెయిల్ తీసుకోటానికి ఆస్కారం ఉంది. ఈ చట్టం మసీదుల గురుంచి కాదు, ఏదైనా ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించినందుకు నేరస్థులను శిక్షించడం గురించి ఈ చట్టం మాట్లాడుతుంది.

ఆగష్టు 2021లో, ఇదే పోస్ట్ యొక్క క్లెయిమ్ రాజస్థాన్‌లో (సోషల్ మీడియాలో) బాగా షేర్ అవడంతో, రాజస్థాన్‌ పోలీస్ వారు తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఇది ఫేక్ అని నిర్ధారించారు. లోకేష్ శర్మ, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి దగ్గర పని చేసే అధికారి, ఈ యొక్క క్లెయిమ్ ఫేక్ అని ట్వీట్ చేసారు.

చివరగా, మసీదు, మదరసాలకు సంబంధించి భారత ప్రభుత్వం ఈ కొత్త చట్టం తీసుకురాలేదు.

Share.

About Author

Comments are closed.

scroll