రాబోయే 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో వైస్సార్సీపీకి 142 స్థానాలు, టీడీపీ&జనసేన కూటమికి 33 స్థానాలు వస్తాయని ‘ఏబీపీ-సీ ఓటర్’ సర్వే ఫలితాలు విడుదల చేసింది అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి మద్దతుగా ఏబీపీ సంస్థ లోగోతో కూడిన సర్వే ఫలితాలను చూపుతున్న స్క్రీన్ షాట్ ఒకటి షేర్ చేస్తున్నారు. అలాగే మరో పోస్టులో 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ&జనసేన కూటమికి 142 స్థానాలు, వైస్సార్సీపీకి 33 స్థానాలు వస్తాయని ‘ఏబీపీ-సీ ఓటర్’ సర్వే ఫలితాలు విడుదల చేసింది అని షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024కి సంబంధించి ‘ఏబీపీ-సీ ఓటర్’ సంస్థ సర్వే ఫలితాలు విడుదల చేసింది.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ సర్వే ఫలితాలను ఏబీపీ సంస్థ విడుదల చేయలేదు. ఇది వారి లోగోను వాడి తప్పుడు కథనంతో ఎడిట్ చేస్తూ షేర్ చేసిన ఫోటో. ఈ వైరల్ సర్వే ఫలితాలపై ఏబీపీ సంస్థ స్పందిస్తూ “ఏబీపీ నెట్‌వర్క్ లేదా మరే ఇతర అనుబంధ సంస్థ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల 2024కి సంబంధించి అటువంటి డేటా ఏదీ విడుదల చేయలేదు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న పోస్ట్ పూర్తిగా కల్పితం ” అని తమ అధికారిక ఫేస్‌బుక్ పేజీ మరియు వెబ్‌సైట్ ద్వారా స్పష్టత ఇచ్చింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ క్లెయిమ్స్ గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, 29 ఫిబ్రవరి 2024న ఏబీపీ సంస్థ తమ అధికారిక ఫేస్ బుక్ పేజీలో ఈ వైరల్ క్లెయిమ్ పై స్పందిస్తూ “ఏబీపీ నెట్‌వర్క్ లేదా మరే ఇతర అనుబంధ సంస్థ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల 2024కి సంబంధించి అటువంటి డేటా ఏదీ విడుదల చేయలేదు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న పోస్ట్ పూర్తిగా కల్పితం ” అని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని ఏబీపీ సంస్థ తమ వెబ్‌సైట్‌లో కూడా తెలియజేసింది.
ఇదే వైరల్ స్క్రీన్ షాట్ ఉపయోగిస్తు‘Way2News’ కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల 2024లో వైఎస్ఆర్ సిపికి 142 స్థానాలు, టీడీపీ&జనసేన కూటమికి 33 స్థానాలు వస్తాయని ‘ఏబీపీ-సీ ఓటర్’ సర్వే ఫలితాలు విడుదల చేసింది అని వార్తా కథనం ప్రచురించింది అని చెప్తున్న ‘Way2News’ వార్తకథనం స్క్రీన్ షాట్ కూడా వైరల్ అవుతోంది. ఈ వార్త కథనం పైన ఉన్న ఆర్టికల్ లింక్ (https://way2.co/44s2sk) ద్వారా ‘Way2News’లో వెతికితే “త్వరలో టీడీపీలోకి మంత్రి జయరాం? ” అనే టైటిల్‌తో ప్రచురించిన అసలైన వార్త దొరికింది. దీన్ని బట్టి ‘ఏబీపీ- సీ ఓటర్’ సర్వే ఫలితాలు విడుదల చేసింది అని ‘Way2News’ కూడా ఎలాంటి కథనాన్ని ప్రచురించలేదు అని నిర్థారించవచ్చు.
చివరగా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల 2024కి సంబంధించి ఏబీపీ సంస్థ ఎటువంటి సర్వే ఫలితాలు విడుదల చేయలేదు, ఈ వైరల్ స్క్రీన్ షాట్ ఫేక్.