1000 సంవత్సరాల వయసున్న ఒక చెట్టుకి వేర్లకు 101 జంతువుల నమూనాలు ఉన్నాయని చెప్తూ ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. ఈ వీడియోలో ఒక చెట్టు వేర్లు మరియు బెరడుకి అనేక జంతువుల నమూనాలు చెక్కబడి ఉండడం చూడవచ్చు. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: 1000 సంవత్సరాల వయసున్న చెట్టు వేర్లకి ఉన్న 101 జంతువుల నమూనాలను చూపుతున్న వీడియో.
ఫాక్ట్: ఈ చెట్టు తమిళనాడులోని యార్కాడ్ పట్టణంలో ఉన్న స్కై పార్క్‌లో ఉంది. ఇది బ్రిటిష్ కాలం నాటి చెట్టు అని, దీనికి 100-150 ఏళ్ల వయసు ఉంటుందని పార్కు నిర్వాహకులు చెప్పారు. పైగా, ప్లాస్టర్ ఆర్ పారిస్, సిమెంట్ వంటి కృత్రిమ పదార్థాలతో 101 జంతువుల నమూనాలను తయారుచేసి చెట్టు చుట్టూ అమర్చామని వాళ్లు పేర్కొన్నారు. కావున పోస్టులో చెప్పబడిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ముందుగా వైరల్ వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను చూపించే మరిన్ని వీడియోలు(ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) మాకు లభించాయి. వీటి ఆధారంగా ఈ చెట్టు తమిళనాడులోని యార్కాడ్ పట్టణంలో ఉన్న స్కై పార్క్‌లో ఉనట్లు గుర్తించాం.
ఈ పార్కు 2023లో ప్రారంభించబడింది. వైరల్ వీడియోలో కనిపిస్తున్న చెట్టుని “Tree of Life” గా స్కై పార్కు వెబ్సైట్లో పేర్కొన్నారు. ఈ చెట్టు బెరడు పైభాగాన వందకుపైగా జంతువుల నమూనాలను చెక్కబడినట్లు అందులో తెలిపారు. మానవుడి సృజనాత్మకతకు నిదర్శనంగా నిలిచే ఈ చెట్టు జీవ వైవిధ్య ప్రాముఖ్యతను తెలుపుతుందని పేర్కొన్నారు.
దీని గురించి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి స్కై పార్కు నిర్వాహకులను సంప్రదించగా, ఈ చెట్టు బ్రిటిష్ కాలం నాటిదని, సుమారు 100-150 ఏళ్ల వయసు ఉండొచ్చని వాళ్లు చెప్పారు. అయితే ప్లాస్టర్ ఆర్ పారిస్, సిమెంట్ వంటి కృత్రిమ పదార్థాలతో 101 జంతువుల నమూనాలను తయారుచేసి చెట్టు బెరడు, వేర్ల ఆకారంలో చెట్టు చుట్టూ ఏర్పాటు చేశామని స్పష్టంచేశారు.
చివరిగా, ఈ వీడియోలోని బ్రిటిష్ కాలం నాటి చెట్టుకి కృత్రిమ పదార్థాలతో చేసిన 101 జంతువుల నమూనాలను అమర్చారు.