Fake News, Telugu
 

తమిళనాడులోని ఆవిన్ కంపెనీ వారు తమ పాల ప్యాకెట్ల ద్వారా అన్ని మతాల పండగలకు ఇదే తరహాలో శుభాకాంక్షలు తెలిపారు

0

తమిళనాడు రాష్ట్రంలో పాల ప్యాకెట్ల మీద క్రిస్మస్ శుభాకాంక్షలు అంటూ ఒక ఫోటోతో ఉన్న పోస్టును సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: తమిళనాడులో పాల ప్యాకెట్ల మీద క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్న ఫోటో.

ఫాక్ట్: ఫోటోలో తమిళనాడుకు చెందిన ఆవిన్ కంపెనీ పాల ప్యాకెట్ పై క్రిస్మస్ శుభాకాంక్షలు అని రాసుంది, కానీ, వారు కేవలం క్రిస్మస్ పండుగకు మాత్రమే ఇలా ప్రింట్ చేయలేదు; దీపావళి, రంజాన్, పొంగల్ వంటి పండగలకు కూడా అదే తరహాలో శుభాకాంక్షలు తెలిపారు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.       

ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అటువంటి ఫోటో ఒకటి ఫేస్బుక్ పోస్టులో లభించింది. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్న ఆ పాల ప్యాకెట్ తమిళనాడులోని ఆవిన్ కంపెనీకి చెందిందని ఆ పోస్టులో తెలిపారు.

ఫోటోను గూగుల్ లెన్స్ ద్వారా అనువాదం చేసినప్పుడు కూడా ఇది తమిళనాడులో అమ్మే ఆవిన్ కంపెనీకి చెందిన ‘ఆవిన్ గ్రీన్ మ్యాజిక్’ పాల ప్యాకెట్ అని తెలుస్తుంది. ఆవిన్ కంపెనీ నిజంగానే పాల ప్యాకెట్ల మీద క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రింట్ చేసారు.

ఐతే, క్రిస్మస్ పండగ ఒక్కటే కాకుండా మిగితా పండగలకు కూడా ఆవిన్ ఇటువంటి ప్యాకెట్లు తయారు చేసినట్టు మాకు చాలా ఫోటోలు సోషల్ మీడియాలో లభించాయి. దీపావళి, రంజాన్, పొంగల్ వంటి పండగలకు కూడా అదే తరహాలో శుభాకాంక్షలు తెలిపినట్టు చూడొచ్చు.

2018లో ఆవిన్ పాల ప్యాకెట్ల మీద రంజాన్ శుభాకాంక్షలు అని రాసి ఉన్న ఫోటో బాగా షేర్ అయ్యింది. దీపావళికి లేదా గణేష్ చతుర్థికి ఇలా ఎప్పుడు పెడతారో అని ఒకరు అడిగినప్పుడు; దీపావళి, పొంగల్, క్రిస్మస్ లకు కూడా ఆవిన్ తమ పాల ప్యాకెట్లపై శుభాకాంక్షలు ప్రింట్ చేస్తారని ఒక యూసర్ ఫోటోలు పెట్టి ట్వీట్ చేసాడు.

ఇటువంటి క్లెయిమ్ ఒకటి ఇటీవల బాగా వైరల్ అయినప్పుడు, ‘యు టర్న్’ వెబ్ సైట్ వారు ఒక ఫాక్ట్-చెక్ ఆర్టికల్ రాసారు. 04 నవంబర్ 2021న ఆవిన్ పాల ప్యాకెట్ మీద దీపావళి శుభాకాంక్షలు అని ప్రింట్ చేసారని అందులో ఫోటో కూడా పెట్టారు.

చివరగా, తమిళనాడులోని ఆవిన్ కంపెనీ వారి పాల ప్యాకెట్ల ద్వారా క్రిస్మస్ కు మాత్రమే శుభాకాంక్షలు చెప్పలేదు; దీపావళి, రంజాన్, పొంగల్ వంటి పండగలకు కూడా అదే తరహాలో శుభాకాంక్షలు తెలిపారు.

Share.

About Author

Comments are closed.

scroll