16 మార్చ్ 2025న పాకిస్థాన్‌లోని నోష్కిలో ఆ దేశ సైనికులు ప్రయాణిస్తున్న మిలిటరీ కాన్వాయిపై బాంబు దాడి జరిగింది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). దీనికి తామే బాధ్యులమని బెలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ(BLA) ప్రకటించిందని వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి. ఈ వార్తా కథనాల ప్రకారం, ఈ దాడి యొక్క వీడియోని కూడా BLA విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఒక బస్సులో పాకిస్థాని ఆర్మీ దుస్తులు వేసుకుని ప్రయాణిస్తున్న కొందరి వీడియో ఒకటి (ఇక్కడ, ఇక్కడ), ‘నోష్కి బస్సు దాడికి ముందు 🇵🇰 🪖 యొక్క చివరి ఫుటేజ్’ అనే క్లైముతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: 16 మార్చ్ 2025న పాకిస్థాన్ సైనికులు ప్రయాణిస్తున్న బస్సుపై బెలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) చేసిన బాంబు దాడికి ముందు, ఆ బస్సులో సైనికులు రికార్డ్ చేసిన చివరి వీడియో.
ఫ్యాక్ట్(నిజం): ఈ వీడియో 16 మార్చి 2025 కంటే ముందు నుంచే సోషల్ మీడియాలో ఉంది. దీనికి, మార్చ్ 2025 పాకిస్థాన్ సైనికులపై BLA చేసిన బాంబు దాడికి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
వైరల్ వీడియో వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, అందులోని కొన్ని కీ ఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా, ఈ వీడియో 16 మార్చి 2025 నాడు నోష్కిలో పాకిస్థాన్ సైనికుల బస్సుపై BLA చేసిన బాంబు దాడి ముందు బస్సులో తీసిన చివరి వీడియో అని చెప్తూ మాకు ఎటువంటి వార్తా కథనాలు దొరకలేదు. అలాగే, ఈ సెర్చ్ ద్వారా ఈ వీడియోతో ఉన్న కొన్ని పాత సోషల్ మీడియా పోస్టులు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) మాకు లభించాయి.

వీటన్నిటిలో ముందుగా చేసిన అప్లోడ్, 17 ఫిబ్రవరి నాడు టిక్ టాక్‌లో ఒక laiq.wazir6 అనే ఒక యూజర్ చేసిన పోస్ట్(ఆర్కైవ్ లింక్). ఈ వీడియోపై ఉన్న ఉర్దూ వాక్యాన్ని తెలుగులోకి తర్జుమా చేసి చూడగా, బెలుచిస్థాన్‌లో పాకిస్థాన్ సైనుకులు బుర్కాలో తిరిగే పరిస్థితి వచ్చింది అని ఉంది అని మాకు అర్థం అయ్యింది.

దీని గురించి మరింత సమాచారం కోసం తగిన కీ వర్డ్స్ ఉపయోగించి వెతుకగా, మాకు ఎటువంటి వార్తా కథనాలు దొరకలేదు. అయినా ఈ వీడియో 16 మార్చి 2025 నాడు నోష్కిలో జరిగిన దాడి కంటే ముందు నుంచే ఇంటర్నెట్లో ఉంది కాబట్టి, ఈ వీడియోకి నోష్కి దాడికి ఎటువంటి సంబంధం లేదు అని మనకు స్పష్టం అవుతుంది.
అదనంగా, వైరల్ వీడియో చివర్లో బస్సు పేలుతున్న దృశ్యాలు, పేలిపోయిన తర్వాత దృశ్యాలు కొన్ని ఉన్నాయి. ఇవి, నోష్కి ఘటనకి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) చెందినవి కావు అని మా పరిశోధనలో(రివర్స్ ఇమేజ్ సెర్చ్) తెలిసింది. ఈ వీడియోలు జనవరి 2025లో పాకిస్థాన్‌లోని ఖుజ్‌దార్‌లో జరిగిన బస్సు పేలుడుకి చెందినవి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ)
చివరగా, మార్చ్ 2025న పాకిస్థాన్ సైనికులపై BLA చేసిన బస్సు దాడికి ముందు బస్సులో తీసిన వీడియో అని చెప్తూ ఒక సంబంధం లేని పాత వీడియోని షేర్ చేస్తున్నారు.