Fake News, Telugu
 

2015 నాటి కల్తీ ఆహార పదార్ధాల తయారీ ముఠా అరెస్ట్ వార్తను ఇటీవల జరిగిన సంఘటనగా షేర్ చేస్తున్నారు

0

వంటలలో వాడే జీరా, గసగసాలు, మిరియాలు తదితర దినుసులను మరియు మసాలాలను హానికరమైన రసాయనాలతో కల్తీ చేసి హైదరాబాద్‌లోని బేగం బజార్‌లో అమ్ముతున్నారని చెప్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: ఇటీవల హైదరాబాద్‌లో కల్తీ ఆహారపదార్ధాలను తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్న పోలీసులు.

ఫాక్ట్: ఇది ఇటీవల జరిగిన సంఘటన కాదు. 18 నవంబర్ 2015న దినుసులు, మసాలాలను కల్తీ చేసి హైదరాబాద్ బేగం బజార్‌లో  విక్రయిస్తున్న 14 మంది వ్యక్తులని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ప్రధాన నిందితుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజేష్ గుప్తా. ఇది ఇటీవల జరిగిన సంఘటన కాదు కనుక పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా వైరల్ వీడియోలోని సమాచారం ఆధారంగా దాని గురించి ఇంటర్నెట్లో వెతకగా, పూర్తి వీడియోని 18 నవంబర్ 2015 లోనే ‘TheNewsWala’ అనే యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడు చేసినట్లు గుర్తించాము.

వీడియోలో ఉన్నట్లుగా హైదరాబాద్ సౌత్ జోన్ DCP వి. సత్యనారాయణ ప్రెస్ మీట్‌లో చెప్పిన వివరాల ప్రకారం, 18 నవంబర్ 2015న హైదరాబాద్‌లోని హుస్సేని ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ ఆహార పదార్ధాలను తయారు చేసే ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్ళు వివిధ రకాలైన హానికరమైన రసాయనాలతో వంటలలో వాడే దినుసులు మరియు మసాలాలను కల్తీ చేసి బేగం బజార్‌లోని వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కల్తీ దందాకి ప్రధాన సూత్రధారి ఉత్తరప్రదేశ్‌కు చెందిన  రాజేష్ గుప్తా. బేగం బజార్‌లో దుకాణదారులైన కన్హయ్య లాల్, మహేందర్ తదితరులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 14 మంది వ్యక్తులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. సంబంధిత వార్తా కథనాలను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

చివరిగా, 2015లో హైదరాబాద్‌లో కల్తీ ఆహారపదార్ధాలు తయారు చేస్తూ పోలీసులకి పట్టుబడ్డ ముఠాకి సంబంధించిన వార్తని ఇటీవల జరిగిన సంఘటనగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll