Fake News, Telugu
 

నోట్ల రద్దు చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించలేదు; నోట్ల రద్దుకు అనుకూలంగా జనవరి 2023న తీర్పు ఇచ్చింది

0

నోట్ల రద్దుపై మోదీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో షాక్, డీమోనిటైజేషన్ ఎలాంటి ప్రక్రియను అనుసరించకుండా చాలా తొందరపాటుతో జరిగిందని, అందువల్ల చట్టప్రకారం చట్టవిరుద్ధమని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిందని, నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేందుకే డీమోనిటైజేషన్ జరిగిందని సీజేఐ వ్యాఖ్యానించారు అని చెప్తూ పలు పోస్టులు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఇలాంటి మరిన్ని పోస్టుల యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: నోట్ల రద్దు చట్ట విరుద్ధమని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

ఫాక్ట్(నిజం): పెద్ద నోట్లను రద్దు చేస్తూ 2016లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని 02 జనవరి 2023న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 4:1 మెజారిటీతో సమర్థించింది. ఈ తీర్పు పరిశీలిస్తే జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఎఎస్ బోపన్న, జస్టిస్ వి. రామసుబ్రమణియన్‌లు నోట్లను రద్దు నిర్ణయాన్ని సమర్థించగా, జస్టిస్  నాగరత్న ఒక్కరు మాత్రమే డీమోనిటైజేషన్ చట్టవిరుద్ధమని భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు అని తెలిసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఇటీవల 30 మార్చి 2024న హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్శిటీ ఆఫ్ లా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోర్టులు, రాజ్యాంగం అనే సదస్సు యొక్క పరిచయ సమావేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి బి.వి. నాగరత్న మాట్లాడుతూ “02 జనవరి 2023న డీమోనిటైజేషన్‌(నోట్ల రద్దు) పై తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు బెంచ్‌లో భాగమైనందుకు సంతోషంగా ఉంది. 08 నవంబర్ 2016న ఏం జరిగిందో మనందరికీ తెలుసు, మన కరెన్సీ నోట్లలో 86 శాతం  500 మరియు 1,000 నోట్లు, ఇది కేంద్ర ప్రభుత్వానికి తెలియదా?, సరైన ప్రణాళిక లేకుండా డీమోనిటైజేషన్‌ (నోట్ల రద్దు) చేయడం వలన సామాన్యులు చాల ఇబ్బంది పడ్డారు, రద్దు చేసిన 500 మరియు 1,000నోట్లలో 98% కరెన్సీ తిరిగి వచ్చింది, కాబట్టి నల్లధనం నిర్మూలనలో మనం ఎక్కడున్నాం?డీమోనిటైజేషన్‌ నల్లధనం నిర్మూలనలో ఎంత వరకు ఉపయోగపడిందో మాకు తెలియదు. కాబట్టి నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికి, లెక్కల్లో లేని నగదు వ్యవస్థలోకి ప్రవేశించడానికి ఇది మంచి మార్గం అని నేను అనుకున్నాను. కావున నేను డీమోనిటైజేషన్‌ని విభేదించవలసి వచ్చింది,” అని చెప్పారు అని పలు వార్త కథనాలు పేర్కొన్నాయి (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ).

ఈ నేపథ్యంలోనే, నోట్ల రద్దు చట్ట విరుద్ధమని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది అని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 02 జనవరి 2023న డీమోనిటైజేషన్‌(నోట్ల రద్దు) పై సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు పరిశీలిస్తే, 2016లో రూ. 500 మరియు రూ.1000 కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 4:1 మెజారిటీతో సమర్థించింది అని తెలుస్తుంది. జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్, జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ ఎ.ఎస్. బోపన్న, జస్టిస్ వి. రామసుబ్రమణియన్‌లు నోట్లను రద్దు నిర్ణయాన్ని సమర్థించగా, జస్టిస్  నాగరత్న ఒక్కరు మాత్రమే డీమోనిటైజేషన్ చట్టవిరుద్ధమని, ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్ 26(2) ప్రకారం ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డు మాత్రమే నోట్ల రద్దును సిఫార్సు చేయగలదు అనే విషయాన్ని మెజారిటీ తీర్పులో పరిగణలోకి తీసుకోలేదని, కేంద్రం నుండి నోట్ల రద్దు ప్రతిపాదన వచ్చినప్పుడు అది చట్టం ద్వారా లేదా కనీసం ఆర్డినెన్స్ ద్వారా రావాలని , పార్లమెంటు లేకుండా ప్రజాస్వామ్యం మనుగడ సాగించదు అని, నోట్ల రద్దు నిర్ణయం మంచి ఉద్దేశ్యంతో చేసినా చట్టపరమైన  పలు అంశాలు మరిచారు అని భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు అని తెలుస్తుంది. ఇదే విషయాన్ని తెలుపుతున్న పలు వార్త కథనాలు ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

చివరగా, నోట్ల రద్దు చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించలేదు, పెద్ద నోట్లను రద్దు చేస్తూ 2016లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని 02 జనవరి 2023న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 4:1 మెజారిటీతో సమర్థించింది.

Share.

About Author

Comments are closed.

scroll