Fake News, Telugu
 

సంబంధంలేని వీడియోను అయోధ్యకు చేతులపై నడుచుకుంటూ వెళ్తున్న భక్తుడంటూ షేర్ చేస్తున్నారు

0

22 జనవరి 2024న అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన జరగనున్న నేపథ్యంలో రామ మందిర వేడుకకు హాజరయ్యేందుకు రెండు చేతులపై నడుస్తూ అయోధ్య వెళ్తున్న రామ భక్తుడు అంటూ ఒక  వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. పలు ప్రముఖ మీడియా సంస్థలు కూడా ఈ విషయాన్ని రిపోర్ట్ చేశాయి (ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన వేడుకకు రెండు చేతులపై నడుస్తూ అయోధ్య వెళ్తున్న రామ భక్తుడి వీడియో.

ఫాక్ట్(నిజం): వైరల్ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి బీహార్‌కు చెందిన నిహాల్ సింగ్ (అలియాస్ బిచూ బామ్). ఇతడు పలు శివక్షేత్రాలను చేతులపై నడుస్తూ దర్శించుకొనే యాత్రలో భాగంగా దేవ్‌ఘర్ నుండి బసుకినాథ్‌కు ప్రయాణిస్తున్నాడు. అతను 4 జూలై 2023న ఈ యాత్రను బీహార్‌లోని సుల్తాన్‌గంజ్‌లో ప్రారంభించాడు. అంతే కాకుండా మాతో ఫోన్‌లో మాట్లాడుతూ అతను అయోధ్యకు చేతులపై నడుస్తూ వెళ్ళడం లేదని, అతను బసుకినాథ్ ఆలయానికి చేతిపై నడుచుకుంటూ వెళ్తున్నట్లు, అక్కడికి చేరుకోవడానికి మరో నెల పట్టవచ్చు అని స్పష్టం చేసాడు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వీడియోకు సంబంధించి సమాచారం కోసం, ముందుగా మేము వైరల్ పోస్టులో షేర్ చేసిన వీడియో స్క్రీన్ షాట్లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని పబ్లిష్ చేసిన పలు రిపోర్ట్స్ మాకు లభించాయి (ఇక్కడ & ఇక్కడ). ఈ రిపోర్ట్స్ ప్రకారం వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు నిహాల్ సింగ్, ఇతడు బసుకినాథ్ లోని శివ క్షేత్రాన్ని దర్శించిడానికి తన రెండు చేతులపై తేలు(బిచూ)లాగా నడుస్తూ వెళ్తున్నాడు, బీహార్‌లోని సుల్తాన్‌గంజ్ నుండి ప్రారంభమైన ఈ యాత్ర మొత్తం 160 కిమీ మేర పలు శివక్షేత్రాల గుండా సాగనున్నది. 4 జూలై 2023న ప్రారంభమైన ఈ యాత్రకు  సంబంధించిన పలు రిపోర్ట్లు ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

ఇదే విషయమై మరింత సమాచారం కోసం వెతకగా, ఇతను 31 డిసెంబర్ 2023న దేవ్‌ఘర్‌లోని బైద్యనాథ్ ఆలయంలో అతడు జల్ అభిషేకం చేశాడని, ఇప్పుడు బసుకినాథ్ ఆలయానికి వెళ్తున్నాడని తేలింది. 16 జనవరి 2024న అతను ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, అతను దేవగర్ నుండి బసుకినాథ్ వరకు సాగే తన యాత్రలో భాగంగా ఇప్పటి వరకు  దాదాపు 15 కి.మీ నడిచినట్టు వెల్లడించాడు.

అంతే కాకుండా మేము ఫేస్‌బుక్ ద్వారా అతని కాంటాక్ట్ నంబర్‌ను తెలుసుకొని అతనిని సంప్రదించగా, నిహాల్ సింగ్ మాతో ఫోన్‌లో మాట్లాడుతూ తను అయోధ్యకు చేతులపై నడుస్తూ వెళ్ళడంలేదు అని స్పష్టం చేసాడు. అలాగే పలు ప్రముఖ వార్తసంస్థలు కూడా తాను అయోధ్యకు రెండు చేతులపై నడుస్తూ వెళ్తున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు తెలిపాడు. తాను బసుకినాథ్ ఆలయానికి చేతిపై నడుచుకుంటూ వెళుతున్నాని, అక్కడికి చేరుకోవడానికి అతనికి మరో నెల పట్టవచ్చని తెలిపాడు.

చివరగా, నిహాల్ సింగ్ సుల్తాన్‌గంజ్ నుండి బసుకినాథ్‌కు తన చేతులపై నడుస్తూ ప్రయాణిస్తున్న వీడియోను అయోధ్యకు ప్రయాణిస్తున్నడంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll